శారదా సంతతి — 21 : శ్రీ జి.ఎన్ . బాలసుబ్రమణియం
శ్రీశారదా దయా కావేరి :—
03—12—2017; ఆదిత్యవాసరము.
శారదా సంతతి~21. జన్మతః దివ్య గాయక సార్వభౌముడు —శ్రీ జి.ఎన్ . బాలసుబ్రమణియం.
శ్రీ జి.ఎన్ .బి. ప్రసక్తి, ఉస్తాద్ అమీర్ఖాన్జీ గురించి ముచ్చటించుకునే సందర్భంలో వచ్చింది. శ్రీశారదామాతయొక్క ప్రత్యేక అనుగ్రహంతో జన్మించిన సంగీతశారదా వరపుత్రులు, వీరిద్దరూను. వీరిద్దరికి, వారి-వారి గాన వైశారద్యంలో, సాధారణంగావుండవలసిన సంప్రదాయసిద్ధమైన శిక్షణ- అంటే- strict traditional formal training-లేదని, లేకపోతే, ఉన్నదేమైనావుంటే, అది అతిస్వల్పమని చెప్పవలసినదే. అమీర్జీ లాగే జిఎన్బి కూడా గొప్ప సంగీత సంప్రదాయమున్న కుటుంబంలో 06—01—1910 వతేదీన పుట్టేరు. తల్లి, శ్రీమతి విశాలం అమ్మాళ్ . తండ్రి శ్రీ జి.వి.నారాయణస్వామి అయ్యరు. తల్లి-తండ్రులిద్దరు ౘక్కని శాస్త్రీయ సంగీత గానంలో నైపుణ్యమున్నవారు. పుట్టిన పెద్దకొడుక్కి, బాలసుబ్రమణియం అని పేరుపెట్టి, ముద్దుగా, “మణి” అని పిలిచేవారు. నారాయణస్వామి అయ్యరుగారు, చెన్నై, ట్రిప్లికేను పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. మంచి సంగీత గానం, విమర్శలలో ఆరితేరినవారుకనక, చెన్నైలోని ప్రాచీనతమ సంగీతసభలలో ఒకటైన “పార్థసారథి సంగీత సభ” కి కార్యదర్శిగాకూడా ఉండేవారు. మణికి ప్రారంభసంగీత అభ్యాసం తండ్రివద్దే జరిగింది. మణిగొప్ప ‘మ్యూజికల్ వాయిస్ ‘తో పుట్టేడు. He might not have come into this world with a silver spoon in his mouth, but, surely he entered into the musical world with a golden voice in his mouth. జిఎన్బి, జన్మసిద్ధ గాయకులు.
వారి చిన్నతనంనుంచి వారి ఇంట్లో ఎప్పుడూ సంగీతవాతావరణమే వుండేది. కోనేరిరాజపురం వైద్యనాథయ్యరు, “పూచ్చి”రామనాథపురం శ్రీనివాస అయ్యంగారు, పల్లడం సంజీవరావు, తిరుచ్చి గోవిందస్వామి పిళ్లై వంటి మహావిద్వాంసులు వస్తూ-వెడుతూనే వుండేవారు. ఫిడేలు కరూరు చిన్నస్వామయ్యరు వారి పక్కింట్లోవుండేవారు. చిన్నస్వామి గారింట్లో నిత్యమూ సంగీత కార్యక్రమాలు జరిగేవి. చిన్నస్వామిశిష్యుడు, మదురై సుబ్రమణియయ్యరు ప్రక్కవాటాలో అద్దెకుండేవారు. బాల్యంలో వారివద్ద, తరవాత 20 ఏళ్ళ వయస్సులో టైగరు వరదాచారిగారివద్ద స్వల్పకాలం, జిఎన్బి సంగీతంలో కొన్ని ప్రాధమికాంశాలు, ప్రధానాంశాలు గ్రహించేరు. ముఖ్యంగా, కేవలం స్వయం ప్రతిభవల్ల, అనుభవజ్ఞుల సంగీతం వినడంద్వారాను జిఎన్బి సంగీతవిద్యనభ్యసించేరు. మిగిలినదంతా వారి కంఠంయొక్క గొప్పతనమూ, వారి కఠోర తపస్సులమూలంగానే సాధ్యం ఐంది. వారు 20 ఏళ్ళకే B.A.(Hons.) English literature లో పట్టా తీసుకున్నారు. తండ్రి అభీష్టం కొడుకుని లాయరు చేయాలనివున్నా, జిఎన్బికి శాస్త్రీయసంగీతగాయకుడిగానే స్థిర పడాలనిపించింది. రైటానరబుల్ శ్రీనివాసశాస్త్రిగారి ప్రోత్సాహంతో వారుగాయకుడిగానే జీవితంలో స్థిరపడ్డారు.
వారికి 18 ఏళ్ళ వయస్సున్నప్పుడు ఒక విచిత్రసంఘటన జరిగింది. మైలాపూరు, కపాలేశ్వరస్వామివారి ఆలయంలో, ప్రతిసంవత్సరమూ, వసంతోత్సవంలో సంగీతసభలు జరిగేవి. 1928లో వసంతోత్సవంలో, ఒక రోజు, మహావిద్వాంసుడు, ముసిరి సుబ్రమణియయ్యరు కచేరివుంది. కాని ఆ రోజు వారికి ఏదో ఆటంకంవచ్చి, వారి కచేరి రద్దయ్యింది. దాంతో యువకళాకారుడు జిఎన్బిపై కార్యకర్తల కన్నుపడింది. ఐతే నారాయణస్వామయ్యరుగారు పిల్లవాణ్ణి పంపడానికి భయపడ్డారు. జిఎన్బికి ౙంకూ-గొంకూ లేదుకాని, పెద్ద విద్వాంసుడిస్థానంలో పాడడానికి, తటపటాయిస్తున్నాడు. గురువు సుబ్రమణియయ్యరు, ఇతర పెద్దల ప్రోత్సాహంతో, జిఎన్బి, వేదికపై కూర్చుని, కపాలేశ్వరుని ధ్యానించి, సభారంభం వర్ణంతో చేసేసరికి, సభ్యుల కరతాళధ్వనులు వెన్నుతట్టి, ధైర్యమిచ్చేయి. తరవాత “హంసధ్వని”లో, “వాతాపి గణపతిం” పాడి, వెంటనే పంతువరాళిరాగం విస్తృత ఆలపనచేసి, కృతి పాడి ఆ వెనువెంట భైరవి అందుకున్నారు. “చింతయ మాం” కృతిని అద్భుతంగా పాడి, తరవాత అఠాణా కృతిని ముగించి, 3-గంటల కచేరి, 3-నిమిషాలలో ఐపోయిన భావం శ్రోతలకి కలిగించేరు.
21 ఏళ్ళ వయస్సులో వివాహం ఐంది. వెంటనే సంతానంకూడా కలిగింది. వారి వయస్సు 24—27 లలోవుండగా చలనచిత్రాలలో నటించేరు. “శకుంతలై”, “భామావిజయం” వారి సినిమాలు. వారు గొప్ప స్ఫురద్రూపి కావడంవల్ల, శకుంతలలో వారు దుష్యంతుడిగా నటించగా, ఎం.ఎస్ .సుబ్బులక్ష్మి, శకుంతలగా నటించేరు.
వారికి 23ఏళ్ళ వయస్సున్నప్పుడు, కుంభకోణంలో, వారి చెల్లెలి పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళిలో, మహారాజపురం విశ్వనాథయ్యరుగారి కచేరి జరిగింది. ఆ సభలో విశ్వనాథయ్యరుగారు, “తోడి“రాగంలో, త్యాగయ్యగారి, “కోటినదులు” కృతిని పాడేరు. ఆ సందర్భంలో తీవ్రవేగంతోవుండే స్వరసమూహ ప్రయోగాలని పాడుతూ, జిఎన్బీతో యిలాగ అన్నారుట:—
“మణీ! ఇదిగో ఇవన్నీ నీ ప్రయోగాలే!”
అంటే ఒక మహాప్రతిభాశాలి ఐన యువగాయకుడికి, పరిపూర్ణ గానకళావృద్ధ గాయకశిఖామణి సమర్పించిన ఆశీఃపూర్వక అభినందనలవి.
1940—1950 వరకువున్న దశాబ్దిని “జిఎన్బీ యుగము” అంటే “GNB-Era“అని దక్షిణ భారత శాస్త్రీయ సంగీత చరిత్రకారులు వర్ణిస్తారు. దాదాపు 35 సంవత్సరాల సారవంతమైన తన జీవితాన్ని, కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి అంకింతం చేసిన జిఎన్బీ, రాజరాజేశ్వరీ మాతని సేవించిన గొప్ప శ్రీవిద్యా ఉపాసక భక్తివరులు. వారు మదరాసు మ్యూజిక్ అకాడమీ వారి “సంగీత కళానిధి” బిరుదును స్వీకరించేరు.
“శ్రుతి భేదం”/”గ్రహభేదం” అనే సంగీత ప్రక్రియకి సర్వజన ఆమోదం సంపాదించి పెట్టిన మహానుభావులు.
వారు తమ 55 ఏళ్ళ వయస్సులో అనారోగ్యంతో పరమపదించడం సంగీతప్రియుల దురదృష్టం. 01—05—1965న వారు తనువు చాలించేరు.
వారికి సంబంధించిన అనేక విశేషాంశాలు, వారి గాన శైలి వివరాలు, నేటి “కదంబకం” లో క్లుప్తంగా తెలుసుకుందాం!
స్వస్తి ||
కర్ణాటక శాస్త్రీయ సంగీత సరస్వతిని తన సువర్ణ స్వర (గోల్డెన్ వాయిస్) పారిజాతాలతో అర్చించిన మహా గాయకుడు జి. ఎన్. బి. పరిచయంచాలా సంతోషం కలిగించింది . ఎంతోమంది ఉద్దండ సంగీత పండితులుదక్షిణాదిని తమ కచేరీల పరంపరతో ఏలుతోన్న ఆ రోజుల్లో, ఒక దశాబ్ద కాలాన్ని ‘ తనది’ అని ముద్రవేయించుకోగలిగిన
జి. ఎన్. బి. అసామాన్యుడు! . ఆయన ఎంతటి మహా గాయకుడో అంతటి రూపసి కూడా. ఈ పరిచయం చదివేకా ఆ రూపం కళ్ళముందు కదలాడింది.