సాహిత్యము-సౌహిత్యము – 30 : అమ్మా! రమ్మని పిల్చె భార్యను, మగం డయ్యర్థరాత్రంబునన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
02—12—2017; శనివారము.

సాహిత్యము—సౌహిత్యము~30.

మన శీర్షిక శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని వదలలేకపోతోంది. వారిదే మరొక మధుర పూరణం. సమస్య ఈసారి శార్దూలవిక్రీడిత పద్యపాదం.

అమ్మా! రమ్మని పిల్చె భార్యను,
మగం డయ్యర్థరాత్రంబునన్ ” ||

ఆ అర్థరాత్రి, తన భార్యని, భర్త ‘అమ్మా! రా!‘ అని పిలిచేడు” అని ఈ సమస్యకి అర్థం. ఇప్పుడు పూరణ చూద్దాం!

సొమ్ముల్ తెచ్చితి, పూలు తెచ్చితిని
కస్సున్ , బుస్సునున్ , మాను మీ

విమ్మాడ్కిన్ నిదురింపగా తగునె, లేవే,
నన్ను కారింపకే,

నెమ్మోమున్ తిలకింప వచ్చితిని, సందే
హింపకే, నిద్ర పె

ద్దమ్మా! రమ్మని పిల్చె భార్యను, మగం
డయ్యర్థరాత్రంబునన్ ” ||

ఇక్కడ సమస్యాపూరణానికి అనువైన ౘక్కని సన్నివేశాన్ని కల్పించుకుని, దానికి అనుగుణమైన భావశబలిత చమత్కారంతో పద్యాన్ని కూర్చడంలోనే కవిగారి వైదుష్యం, సద్యఃస్ఫూర్తి యిమిడివున్నాయి. సన్నివేశం యిది. భార్యయందు అమితప్రీతి కలిగిన భర్త ఒక సాయంత్ర తన భార్యకి మంచి ఆభరణాలు, పువ్వులు అన్నీ పట్టుకుని యింటికి వచ్చేడు. బహుశః ఆలస్యమైవుంటుంది. ఆపాటికి భార్య గాఢనిద్రలోవుంది. భర్త ముందు లాలనతోను, చివరికి చిన్నమెత్తు చిరాకు రంగరించిన మందలింపుగాను భార్యకి తన రసికహృదయాన్ని వెళ్ళబోసుకోవడం దీనిలోని ఇతివృత్తం. ఇప్పుడు పద్యభావం పరికిద్దాం!

ఇదిగో నీకు ఆభణాలు, అలంకారాలు తీసుకువచ్చెను, లే! నిద్రాభంగం చేస్తున్నానని కస్సు-బుస్సులాడకు. ఇంత నిద్రేమిటి చెప్పు! ౘక్కని నీ ముఖబింబాన్ని చూడాలని తహతహ లాడుతున్నాను. లేనిపోని అనుమానాలు పెట్టుకోకు. నన్ను యిలా ౘంపుకుతినకు. ఇదుగో! ఓ నిద్దర పెద్దమ్మా! లే! రా!” అంటూ భర్త, తన భార్యని అర్థరాత్రి పిలిచేడు.

స్వస్తి ||

You may also like...

1 Response

  1. సి.యస్ says:

    అర్థవంతమైన భావంతో పాటు సమర్ధవంతమైన పూరణ శ్రీ శాస్త్రిగారి సొంతం. వారి సమస్యా పూరణం అద్భుతంగా ఉంటూ, పద్యంలో మంచి
    ధార కూడా ఉంటోంది. ఆయనవే వరసగా పరిచయం చేస్తూన్నా ఇబ్బంది ఏమీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *