మధూకర సరణి

శ్రీశారదా వాత్సల్య దీప్తి :—
ఇతరములు.

I) మధూకర సరణి.

శ్రీ బాలాంత్రపు కిరణ్ సుందర్ వ్రాసినట్లు సంస్కృతంలో  “మధు” శబ్దం, ఉకారాంత నపుంసకలిఙ్గ శబ్దమే! దానికి తెలుగులో “తేనె” అని అర్థంకదా!
అందువల్ల “మధుకరః” అనేమాటకి, నాకు తెలిసిన,  అమరం, వాచస్పత్యం, కల్పద్రుమం, శబ్దసాగరం, ఆప్టే, మోనియర్ విలియమ్స్ , మేక్డొనెల్ , నిఘంటువులలో “భ్రమరం” ప్రధాన అర్థంగా ఇచ్చేరు.

Apteలో
1. a large black bee;
2. a lover, libertine;
3. sweet lime
అనే మూడు అర్థాలు వున్నాయి.

మిగిలిన నిఘంటువులలో కాస్త హెచ్చు-తగ్గులలో అవే అర్థాలున్నాయి.

భిక్షావృత్తి” అనే అర్థం వేటిలోను లేదు. ఆప్టేలోనే, “మాధుకరీ” అనే శబ్దలేఖనం వద్ద,

1. Collecting alms by begging from door to door, as a bee collects honey by moving from flower to flower.
2 . Alms obtained from five different places

అనే రెండు అర్థాలు ఇవ్వబడ్డాయి.

స్వాతంత్ర్యం వచ్చిన 54 ఏళ్ళకి, 2001లో,  “తెలుగు అకాడమి“, హైదరాబాదువారు, ఆచార్య చేకూరి రామారావు, ఆచార్య రవ్వా శ్రీహరి,  శ్రీ తిరుమల రామచంద్ర, డా. పోరంకి దక్షిణామూర్తి, డా. వి.వి.ఎల్ . నరసింహారావుగారల “పరిశీలక సంఘం” నేతృత్వంలో, డా. బూదరాజు రాధాకృష్ణ, డా. అక్కిరాజు రమాపతిరావు మొదలైనవారి సంపాదకత్వంలో, ౘాలా అందమైన గెటప్లో , “తెలుగుతెలుగు” నిఘంటువుని ప్రచురణ చేసేరు. ప్రాచీన, ఆధునిక ఆంధ్ర(తెలుగు) వాఙ్మయాన్ని, అప్పటివరకు అందుబాటులోవున్న ఇతరనిఘంటువులని, లోకవ్యవహారంలో ప్రాచుర్యంలోవున్న పలుకుబడులని ఇటువంటి అనేక అంశాలనిపరిగణనలోకి తీసుకుని ఆ నిఘంటు నిర్మాణం జరిగింది.

ఆ నిఘంటువుని ప్రమాణంగా తీసుకుని నేను, ‘మధూకర సరణి‘ పదబంధాన్ని చేసేను. అప్పుడుకూడా, “మధుకర(మధూకర) సరణి” అని పెడదామా, లేక, “మధూకర(మధుకర) సరణి” అని పెడదామా అని ఆలోచించి, చివరికి, ఈ అంశాలన్నీ popular prose లోనేవ్రాస్తున్నానుకదా అని, informal usage “మధూకర సరణి”ని finalise చేసేను. ఇంతకీ, “తెలుగు అకాడమీ” నిఘంటువులో,

1) “మధుకరవృత్తి”,
2) “మధూకరవృత్తి”
3) “మాధుకరం”

అని పై మూడు పదాలూ ప్రామాణిక ఆరోపాలు(entries)గా స్వీకరించబడ్డాయి.

మొదటి ఆరోపానికి రెండవ ఆరోపం రూపాంతరంగాస్వీకరించబడింది.

ౘాలా తెలుగు నిఘంటువులలో, “మధుకరము” అంటే, తుమ్మెద అర్థంతోబాటు, ౘాలా సంస్కృతనిఘంటువులలో కనిపింౘని “భిక్షుకవృత్తి” అనే అర్థంకూడా యిచ్చేరు. “మధూకరం” వాటిలో యివ్వబడలేదు.

ఈ ప్రాంతాలలో పండితవర్గంలోకూడా, నా చిన్నతనం నుండి “మధూకరం” బాగా ఎక్కుగా ప్రయోగంలోవుంది. అందువల్లనే ఈ పదం ఆధునిక ఆంధ్ర భాషాశాస్త్ర పండితుల స్వీకారయోగ్యతని పొంది,శిష్టవ్యావహారిక ప్రతిపత్తిని సంతరించుకుని, ఆధునిక నిఘంటువులో స్థానాన్ని సంపాదించింది అని నేను భావిస్తున్నాను.

నేను వ్రాస్తున్న విషయాలు, శిష్ట వ్యావహారిక వచనంలో వ్రాస్తున్నాను. దీంట్లో, మా ప్రాంతాలలో విశేష వ్యవహారంలో వున్న దైనికభాషని, అంటే రోజువారీ సగటు తెలుగు పలుకుబడిని అనుసరించి వ్రాస్తున్నాను. ఐతే, కావ్యభాషలోను, పద్యరచనలోను నా ఈ పలుకుబడులు చెల్లుబాటుకావు. కాని ప్రకృత ప్రయోజనాన్ని ఇది సిద్ధింపజేస్తుంది అని నా నమ్మకం.

నిత్యజనబాహుళ్యవ్యవహారంలోవున్న తెలుగు వంటి భాషలో ఇలాంటి పరిణామాలు అనివార్యం. మనం “మేధస్సు” శబ్దంగురించి పరామర్శచేసేం. కొన్నాళ్ళకి, ఎవరు ఎంత నిరోధించినా, ముందునుంచి కాకపోతే, వెనకనించైనా ఆ మాట తెలుగు నిఘంటువులలోకి ఎక్కడం తప్పదు. ఎందుకంటే, అలాగ ప్రవేశింౘడానికి క్రమసోపానాలున్నాయి.

1. Slang or Brogue,
2. Colloquialism,
3. Informal usage,
4. Formal usage.

ఈ విభజనలో, మొదటి మూడు Non-standard usage గావుండి, నాలుగవది, Standard usage గా పరిగణింపబడుతోంది. అందువల్లే “మేధస్సు”ని slangగా మనం అనుకోవాలి అని ఆ వ్యాసంలో ప్రస్తావించిన గుర్తు.

English language లో, అసలు “sweetard” గావున్నరూపం, కాలక్రమంలో, “sweetheart” గా ఐపోయిందని, అలాగే, “buttonhold“, “buttonhole” గా మారిందని, యిలాగ అనేక పదాలు మారిపోయేయి(మారిపోతున్నాయి), అని, Bill Bryson, తన, “The Mother Tongue ENGLISH & How It Got That Way”, అనే పుస్తకంలో వ్రాసేరు.

అలాగే, తెలుగులోకూడా, బహుజనపల్లివారి “ఆంధ్రశబ్దరత్నాకరము”లో, “మనువర్తి“(గ్రామ్యము-అనింద్యము) అని ప్రధాన ఆరోపం యిచ్చి, “మనోవర్తి“ని రూపాంతరం అన్నారు.

కాని, తెలుగు అకాడమి నిఘంటువులో మాత్రం, “మనోవర్తి”ని ప్రధాన ఆరోపంగా ఉదహరించి, “మనువర్తి/మనువృత్తి” ఈ రెండింటిని రూపాంతరాలుగా చూపించేరు.

II) ఇంక రెండవ సందేహం గురించి పరిశీలిద్దాం!

సంస్కృతంలో, భ్రమరం, మధుపం, మధుకరం, మక్షిక మొదలైన శబ్దాలు, తెలుగులో తుమ్మెద, తేనెటీగ, జుంటీగ మొదలైనమాటలు పర్యాయపదాలుగానే భాషలో వాడుకలోవున్నాయి.

ఐతే, “కీటకశాస్త్రం“(entomology) ని అనుసరించి, సంస్కృతంలో వీటికి తేడాలున్నట్టు అనిపిస్తుంది. అమరంలో ఉదహరించబడిన శ్లోకం ప్రకారం వేరు-వేరు రకాల తేనెలున్నాయి. అవి, బహుశః వేరు-వేరు జాతుల భ్రమరాలసేకరణ కావచ్చేమో!

“మాక్షికం తైలవర్ణం స్యాత్ ఘృతవర్ణం తు పౌత్తికమ్ |
విజ్ఞేయం భ్రామరం శ్వేతం క్షౌద్రం తు కపిలం మతమ్ “||

“మాక్షికం అనే తేనె, నువ్వులనూనెరంగులోవుంటుంది. పౌత్తికం అనే తేనె, (ఆవు)నెయ్యిరంగులోను, భ్రామరం అనే తేనె తెలుపురంగులోను, క్షౌద్రం అనే తేనె కపిలవర్ణం(పసుపులో, నలుపు కలిసిన చాయ)లోను వుంటాయి”.

స్వస్తి||

You may also like...

5 Responses

  1. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    Thank you Krishna!

  2. Kbj srinivas says:

    Superb analysis bava garu. Please keep on writing this type of analytical articles. Even if one of 10,000 makes use of them, the language and art/science of research will stay alive.

  3. వాసుదేవరావు says:

    బాగుంది

  4. సి.యస్ says:

    వివరణ విపులంగానూ , సప్రమాణంగానూ ఉంది. భాష మీద ధ్యాస తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇంత శ్రద్ధగా పట్టించుకుని సందేహం లేవనెత్తిన కిరణ్ కీ, నివృత్తి చేసిన నీకూ ధన్యవాదాలు

  5. జోగన్న says:

    Good information.Thank you Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *