కదంబకం — 22 : చతుష్షష్ట్యుపచారాఢ్యా
శ్రీశారదా దయా సుధ :—
26—11—2017; ఆదిత్యవాసరము.
కదంబకం—22.
ఈ రోజు “శారదా సంతతి~20” లో గానగంగాకంఠధరుడు, ఆదర్శ పురుష కంఠస్వరయుతుడు, నిత్యస్వరతపస్వి ఐన ఉస్తాద్ అమీర్ఖాన్సాహబ్ గురించి, క్లుప్తంగా ముచ్చటించుకున్నాం! ఈ శీర్షికలో వారిగానవైశిష్ట్యంగురించి, వారు పాడిన పూర్ణ కళాత్మక రాగ వైదుష్యం గురించి పిసరంత పరిచయం చేసుకుందాం!
వారు మంచి పొడగరి. బాగా అందమైన రూపం. ఆకట్టుకునే ముఖ వైఖరి. సంగీత సభలో వేదికపై ఒక అపూర్వ యోగిలా కూర్చునేవారు. సభ సుమారు 3 గంటల కాలవ్యవధి (కనీసం) కలిగివుండేది. సభ ఎంతసేపు ఐతే అంతసేపూ, కదలకుండా ఒక యోగిలా వేదికపైన కూర్చుని, ఒక తపస్విలా కనులు మూసుకుని, ఒక మహాదార్శనికుడిలా రాగాధిదేవతని దర్శిస్తూ, ఆ మహారాజ్ఞిని,స్వరపరిభాషలో, ఒక్కొక్కస్వర సౌందర్యాన్ని మెలి-మెల్లిగా, సూక్ష్మాతి-సూక్ష్మంగా తన హృదయసీమలో తాను సంపూర్ణంగా దర్శిస్తూ, రసజ్ఞజన హృదారామంలో రసవంతంగా ఆ దివ్యదర్శనానుభవాన్ని, ఆవిష్కరిస్తూ, ఆయన నిదానంగా తాను గానం చేస్తున్న రాగవైభవప్రదర్శనని కనీసం గంటసేపు కొనసాగించేవారు. ఈ విధమైన గానకళాతపస్సుకి యోగ్యమైన మహారాగాలనే వారు తమ గానసభలలో పాడేవారు.
మార్వా, పూర్యా, యమన్ , తోడి, దర్బారీ, లలిత్ , మాల్కోస్ , మియామల్హార్ , శుద్ధకల్యాణ్ , జోగ్ , వంటి అనేక తపోదీక్షాన్విత గానోపాసనా సమర్థమైన రాగాలనే వేదికపైన వారు చతుష్షష్ట్యుపచారాలతో అర్చించేవారు. (64 ఉపచారాలతో పూజ సమయ దక్షిణాచార శాక్తేయ ఉపాసనలో ఉంది. అందువల్లే “లలితా సహస్ర నామావళి” లో, “చతుష్షష్ట్యుపచారాఢ్యా” అని శ్రీ లలితాంబికకి ఒక దివ్యనామం వుంది. సామాన్య సాధకులు 16 ఉపచారాల పూజచేస్తే, విశేషసాధకులు 64 ఉపచారాల ఆరాధన ద్వారా శ్రీమాతని ఉపాసిస్తారు. అమీర్ఖాన్జీ సంగీతదేవతామూర్తియొక్క మహనీయ ఉపాసకులు. అందువల్ల ప్రతి సంగీతసభావేదికపైన వారు, వివిధ రాగాధిదేవతలని, విశిష్ట ఉపాసనలతో అర్చించేరు. ఆ అద్భుత అర్చనా వైభోగమే వారు పాడి మనకి అందించిన వివిధ రాగ దేవతల అర్చనలైన అనేక రాగ కృతులు.).
దక్షిణ భారత సంగీత సంప్రదాయానికి చెందిన చారుకేశి, కీరవాణి, ఆభోగి, బైరాగి(అంటే మన రేవతి రాగం), హంసధ్వని వారి కంఠనాదాలంకరణలతో నూతన మర్యాదల విలక్షణ శోభలని సమకూర్చుకున్నాయి.
ఎంతో పూర్వజన్మ పుణ్యవిశేషం వుంటేనే, వారి పవిత్ర సంగీత మందిర ప్రాంగణంలోకి అడుగు పెట్టగలం. ఆ అపూర్వ రాగాధిదేవతార్చనానుభవం మనమూ పొందగలం. ఆ దివ్యానుభవ తీర్థ-ప్రసాద లేశాన్ని మనలో పదిలపరచుకోగలం.
స్వస్తి ||
ఏ అన్నవరమో, తిరుపతో వెళ్లి వచ్చిన వాళ్లు – ఇంటిదగ్గర కూచున్న వాళ్ళకి ప్రసాదం ఇచ్చినట్టు, ఈ మహా సంగీత కళాకారుల జీవన తీర్థయాత్ర నువ్వు చేసి, వారి గాన మాధుర్య గంగా నదిలో ములిగి, వారు ఆలపించిన రాగాల గిరులు దర్శించి
వచ్చి, ఆ తీర్థప్రసాదాలు మా లాంటి వాళ్లకి అందజేస్తున్నావు. చివరిలో చెప్పినట్టుగా పూర్వ జన్మ పుణ్య విశేషం లేశ మాత్రమేనా చదువరులకి ఉందన్నమాట.–సంతోషం! “చతుష్షష్ట్యుపచారా ” అనే శీర్షికే అద్భుతంగా ఉంది. అనేక రాగాల ఉపచారాలతో నాదో పాసన చేసిన అమీర్ ఖాన్జీ వంటి ఋషి తుల్యులు. వారి గురించీ, వివిధ సంగీత సభల్లో వారు ఆలపించిన రాగాల గురించీ వినడం, చదవడం పుణ్యప్రదం.
చాలా బాగుంది సర్
తెలుసుకోదగ్గ విషయాలు అందిస్తున్నందుకు ధన్యవాదములు