సాహిత్యము-సౌహిత్యము – 29 : స్వాముల వారికిన్ కడుపు పండి జనించిరి పుత్ర రత్నముల్
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
25—11—2017; శనివారము.
సాహిత్యము—సౌహిత్యము~29.
శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్యశాస్త్రివరిష్ఠుల ప్రతిభా పాటవాలు అసాధారణమైనవి అనితరసాధ్యమైనవి. వారి ప్రజ్ఞా వైదగ్ధ్యంతో పునీతమైన పూరణ మరొకటి ఈ రోజు మీ ముందుకి ఘనంగా వస్తోంది. ఉత్పలమాల ఛందస్సులోని పద్యం.
“స్వాముల వారికిన్ కడుపు పండి
జనించిరి పుత్ర రత్నముల్ “||
“ఒక స్వామీజీకి గర్భంవచ్చి, ౘక్కని కొడుకులని కన్నారు” అని దీని అర్థం. ఇంక పూరణ చూద్దాం.
“కామితముల్ ఘటించుటకు కావలె
సంతతి యంచు దంపతుల్ ,
నీమము తోడ తాపసిక నిష్ఠ మునింగి
ప్రపత్తి యుక్తులై |
ఏమరుపాటు లేక భజియించిరి భద్ర
గిరీంద్ర సంస్థిత
స్వాముల–వారికిన్ కడుపు పండి,
జనించిరి పుత్రరత్నముల్ ” ||
“ఇహ-పర సాధకాలైన కోరికలు తీరాలంటే సత్సంతానం కలగాలి. ఈ విషయం తెలిసిన భార్యాభర్తలిద్దరు నియమ-నిష్ఠల తోను, భక్తి-ప్రపత్తుల తోను తీవ్ర వ్రతాలు ఆచరించి, ఏ మాత్రమూ వదలిపెట్టకుండా భద్రాద్రిలోని శ్రీ సీతా-రామస్వాములవారిని యిరువురినీ సేవించడంవలన, గృహిణికి కడుపుపండి వారిరువురికీ సత్పుత్రప్రాప్తి కలిగింది”.
స్వస్తి||
వీరి పద్యపు నడక చాలా అందంగా ఉంటోంది. సభలో పూరణ కోసం చెప్పినట్టు కాక , ఆలోచించి రచన చేసినట్టుగా ఉంటున్నాయి, చదువుతూంటే. ఈ పద్యం భక్తి పూర్వకంగానూ,
అర్థవంతంగానూ ఉంది. ఆ మాటకొస్తే ఈ మూడు వారాలుగా పరిచయం చేస్తూన్న ఈయన పూరణ చేసిన పద్యాలు అద్భుతం గా ఉన్నాయి.