కదంబకం — 21 : మధూకర సరణి

శ్రీశారదా దయామృతము :—
19—11—2017; ఆదిత్యవాసరము.

కదంబకం~21.

ఈ వారం, “శారదా సంతతి~19″లో, లోకోత్తర గాయన కళా ప్రపంచ చక్రవర్తి, పరమ పుణ్యశ్లోకుడు, మహామధురగాత్రుడు, శారదా పూర్ణ అనుగ్రహపాత్రుడు, అమిత శిష్య వాత్సల్య చరిత్రుడు, సత్త్వ గుణ పవిత్రుడు- ఐన “పద్మభూషణ్ బసవరాజ్ రాజ్ గురు” గురించి చాలా సంక్షిప్తంగా తెలుసుకున్నాం. వారి గానశైలి విశిష్టమైనది, ఎందుకంటే, అనేక మహా గాన సంప్రదాయాలలోనుంచి, వారి అలౌకిక మధుర గాత్రధర్మానికి అనువైన అనేక మనోజ్ఞ లక్షణాలని, తనకంఠంలో రసరమ్యంగా లీనంచేసుకుని, శ్రోతృమనోరంజకంగా పాడడంలో వారికి వారే సాటి. దీనిని Eclectic style లేక collecting the best out of everything లేక “మధూకర సరణి” లేక తేనెటీగ పూలన్నింటినుంచి, ఆయా పూవుల సారమైన తేనెని గ్రహింౘడం వంటి రసగ్రహణపారీణత అనవచ్చు.

వారి గాత్రమాధుర్యానికి, వారి గాన రీతికి, ఆ గానంలో మధ్య-తారా సప్తకాలలో వారి కంఠంచేసే అద్భుత సంచార సౌలభ్య ప్రాభవానికి, వారి సంగీత దివ్యానుభవ వ్యక్తీకరణ పరిణతికి, శాస్త్రీయ సంగీత గాన కళాంతర్గత వివిధ అలంకరణాంశాల ప్రయోగంలోని ఔచిత్య వైదగ్ద్యానికి నేను దాసానుదాసుడినైపోయి, వారి పవిత్ర పాద పద్మాలముందు మోకరిల్లడం తప్ప నేనేమీ చెయ్యలేను. సుమారు ఐదు దశాబ్దాలపైగా వారి గానమాధుర్యానికి పరవశించి, వారికి వశుడనైపోయేను. ఒక్క నేనేమిటి? ఎందరెందరో శ్రోతలు వారి సంగీతానికి దాసులైపోయేరు. వారు సంగీత రసిక జన మనోzభిరాములు.

78 RPM లో వారు పాడిన అహీర్ భైరవ్ రాగంలోను, మధ్యమాద్ సారంగ్ రాగంలోను పాటలు నేటికీ బహులజన ఆదరణీయంగావున్నాయి. అహీర్ భైరవ్ లోని “అల్ బేలా సజన్ ఆయొ రే” అనే పాట ఏదో ఒక హిందీ సినిమాలో ఉస్తాద్ రాషిద్ ఖాన్ సాహబ్ పాడగా, విన్న గుర్తు. రాజ్ గురుజీ కంఠంలో, కేవలం 3 నిమిషాలపైన, ఆ పాట ఎన్నెన్నో స్వరాలంకారాలతో,  ఇంకెన్నో జతుల గతులలో చెప్పలేనన్నిసొగసులని వెలార్చింది. విని తీరవలసిన పాటయిది! వారి చాందినీకేదార్ , సారఙ్గ్ , శహానాకానడా, హంసకల్యాణ్ , శంకర, బహార్ మొదలైన రాగాలు మాటలకి అందక, మనసుతో దోబూచులాడే మధుర అనుభవాలకి మాత్రమే పరిమితాలు.

వారు పరమపదించిన తరువాత, HMV సంస్థవారు “SWAR SMRITI” (స్వర స్మృతి) పేరుతో 4 కేసెట్ల ‘సెట్ ‘ని శ్రద్ధాంజలిగా విడుదల చేసేరు. ఆ టేపులలో అద్భుతమైన అంశాలలో  కొన్ని వాౘవిగా తెలుసుకుందాం. భటియార్ ,అల్హైయా బిలావల్ , జోగియా ఆసావరీ, భూపాలీ తోడి, బిలాస్ఖానీ తోడి, పఠదీప్ ,కొన్ని రాగాలు.

ఈ “స్వర స్మృతి” సమాహారం మొత్తం అంతా పూర్తిగా రమ్యరసమయమైనదే!

ఐతే రెండవ కేసెట్ లో, “ఏ”వైపు, మొదటి పాట “భూపాలీ తోడి” రాగంలో ఒక మధ్య లయ ఖయాల్ కృతి, రూపక్ తాళ్ కి నిబద్ధం చేయబడింది. ఇది సుమారు పావుగంటకి లోపు వుంటుంది.ఇది ఉత్తరభారత సంగీతశాఖలో “భైరవి” థాట విభాగానికి చెందినది, ఇది ఔఢవ-ఔఢవ జాతి రాగం. ఆరోహణ-అవరోహణలు రెండింటిలోను మన మోహనరాగానికి లాగే, మ-ని వర్జిత స్వరాలు. మన భూపాలంరాగానికి, భూపాలీ తోడి Hindustani version. ఐతే మన సంగీత సభలలో భూపాలం ప్రధాన రాగంగా ఎవరూ పాడరు. ఎందుకంటే భూపాలంలో చాలా పరిమిత సంచార ప్రయోగాలేవుంటాయి. భూపాలీతోడిలో చాలా విస్తృతసంచార వైపుల్యంవుంది. అందువల్ల సంగీతవిదుషి శ్రీమతి వీణా సహస్రబుద్ధే వంటి మహా గాయనీ, గాయకులు సభలలో గంటసేపుకి పైన భూపాలీతోడీ గానంచేసేరు.

మన రాజ్ గురుజీ పాడిన భూపాలీ తోడి రాగంలోని “నైయా మొరి పార్ ” మధ్యలయ ఖయాల్ కృతి నేను ఎన్ని వందలసార్లు విన్నానో లెక్కేలేదు. ఈ కృతి అంటే నాకు ఎంత ఇష్టమంటే, నా ప్రాణోత్క్రమణ సమయంలో నేను ఈ రాజ్ గురుజీ పాటనివింటూ ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగితే ఎంత బాగుంటుందోకదా! అని అస్తమానూ అనుకుంటూంటాను. ఇది వినగలిగిన వారు ధన్యులు. ఇది అంత సంపూర్ణ పుణ్యమయ గీతమేకాక, అంతకు మించిన గానమని నా అనుభవం నాకు అర్థమయ్యేలాగ చెప్పింది. నాకు చాలా ప్రియమైన పండిత్ జితేంద్ర అభిషేకీ, పండిత్ గణపతి భట్, పండిత్ ప్రభాకర్ కారేకర్ వంటి అనేక మహావిద్వాంసులెందరో యిది పాడేరు. అవి అన్నీ నేను చాలా యిష్టంగా విన్నాను. ఐనా రాజ్ గురుజీ గానం, అనుపమమూ, అలౌకికమూ, దివ్యానుభూతి ప్రదాయకమూను!

స్వస్తి ||

You may also like...

4 Responses

  1. సి.యస్ says:

    ఈ వ్యాసం ద్వారా బసవరాజ్ వారి గాన ప్రతిభా పాటవాలు మాత్రమే కాక ఆ కృతులు కూర్చబడ్డ రాగాలూ, అవి దొరికే సంస్థలూ, ఆ రాగాలు పాడిన ఇతర కళాకారులు తెలుస్తున్నాయి.
    అంతే కాకుండా వారి గానకళా కౌశలం కృష్ణని ఎంత తన్మయత్వం లో మునకలేయించిందో కూడా తెలియచేసింది.

  2. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    Just one doubt:
    संस्कृत – मधु उकारान्त नपुंसकलिङ्ग शब्द.
    అయితే ఇది మధుకర సరణి కాకండా మధూకర సరణి ఎలా అయింది?

  3. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    రెండవ సందేహం: : పువ్వులనించి తేనె తాగేది తేనెటీగా, తుమ్మెదా? మధుకరము అంటే తేనెటీగా తుమ్మెదా? తేనెటీగ అంటే honey-bee కదా? మధుమక్షిక అంటే తేనెటీగ, మధుకరం అంటే తుమ్మెదా కాదా? I am confused about this.

  4. Devi says:

    Thank you Mavayya for these musical articles every week. I was thrilled and overjoyed reading about Sri Rag guru’s music. Albela Sajan Aayo Re song from the Hindi movie Hum Dil De Chuke Sanam is my all time favourite. Today I heard this song by Sri Rajguru in the you tube. It mesmerized me and I was speechless for some time. As you rightly said no words can express this joy but can only be experienced. Other Ragas presented by Rajguruji as detailed by u are a feast for us to be enjoyed. We join you in prostrating before the Saraswati Putra with all respect and reverence.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *