శారదా సంతతి — 19 : పద్మభూషణ బసవరాజ్ రాజ్ గురు.

శ్రీశారదా దయా జాహ్నవి :—
19—11—2017; ఆదిత్యవారము.

శారదా సంతతి~19.

పరమపావన గాన్ధర్వగంగా కంఠుడు— పద్మభూషణ బసవరాజ్ రాజ్ గురు.

సంపూర్ణ సంగీత విద్యాకళాకౌశలంలో మహోపాసనద్వారా పూర్ణసిద్ధిని సాధించిన శారదాంశ సంభవులలో , శ్రీ బసవరాజ్ రాజ్ గురు, అగ్రశ్రేణి గాయకోత్తములలో ఒకరు. వారు, కర్ణాటకలోని, ధార్వాడజిల్లాలో, యాళివల్ గ్రామంలో, 24—08—1920 వ తేదీన జన్మించేరు. వారిది గొప్ప పండిత కుటుంబం. జ్యోతిషశాస్త్ర ప్రవీణులకి వారి కుటుంబం పుట్టినిల్లుగా వుండేది. వారి తండ్రిగారు, తంజావూరు బాణీకిచెందిన విశిష్ట కర్ణాటక సంగీత గాయకులు.

శ్రీ బసవరాజ్ కి, బాల్యంనుంచీ, సహజ సంగీత ప్రీతివుంది. దైవదత్తమైన గొప్ప మధురకంఠం వారి సొత్తు. ఈ కారణంవల్ల, వారు చిన్నతనంనుండి నాటకరంగానికి బాగా చేరువయ్యారు. వారికి 13 సంవత్సరాల వయస్సువుండగా, పితృవియోగం కలిగింది. వారి అంకుల్ సంరక్షణలో, వారు నాటకరంగంలో రాణిస్తూవుండగా, దైవానుగ్రహంవల్ల, పంచాక్షరీ గవాయి అనే ఒక కిరానా ఘరానాకి చెందిన గానకళాకోవిదయోగిపుంగవులు, బసవరాజ్ గానం వినడం తటస్థించింది. పంచాక్షరీబువా, బసవరాజ్ గానమాధుర్యానికి ముగ్ధులై, తమ మఠంలోని సంగీతగురుకులంలో వారిని విద్యార్థిగా చేర్చుకున్నారు. రోజుకి 12 నుంచి 15 గంటల తీవ్రసాధనతో, గురువుగారి నిత్య పర్యవేక్షణానుగ్రహబలంతో, బసవరాజ్ సుమారు 12-15 సంవత్సరాల పట్టువదలని తపోదీక్షతో సంపూర్ణస్థాయి శాస్త్రీయ సంగీత గాయకకోవిదుడిగా పరిణతి పొందేరు. వారికి 16 సంవత్సరాల వయస్సుండగా, గురువుగారితో కలిసి, షుమారు 15వేలమంది శ్రోతలున్న సంగీత సభలో వారు గానంచేసేరు. వారు ఆ రోజు బాగేశ్రీ రాగం విస్తారంగా పాడేరు. ఆ తరువాత ఒక కన్నడ భక్తి వచనం పాడేరు. వేల సంఖ్యలోవున్న శ్రోతలందరూ, ముగ్ధ మోహిత మనస్సులతో, పూర్తినిశ్శబ్దంగా వినడం జరిగింది. ఆ తరువాత వారికి గురువియోగం సంభవించింది. అప్పటికి వారు నవయౌవనంలోకి అడుగు పెట్టేరు. కిరానా ఘరానాలో గొప్ప కళాకారుడు, గురువు ఐన శ్రీ సవాయి గంధర్వవద్ద కొంతకాలం శిష్యులుగాచేరి, బొంబాయిలోవున్నారు. పక్షవాతవ్యాధి బారినపడి, శ్రీ గంధర్వ, తన గ్రామం కుండ్గోల్ వెళ్ళిపోతూ, బసవరాజ్ బాధ్యతని, తన శిష్యవిద్వాంసుడైన శ్రీ సురేష్ బాబు మానేకి అప్పగించేరు. అక్కడ విద్య పూర్తిచేసుకుని, విద్యాసముపార్జనాదాహం తీరక, వారు పాకిస్తానులోవున్నఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ సాహబ్ వద్ద కొంతకాలం శిష్యరికం చేసేరు. అక్కడే లతీఫ్ ఖాన్ సాహబ్ దగ్గర ఆరునెలలు విద్యనేర్చుకున్నారు. ఆ సమయంలో దేశవిభజనకారణంగా,ఢిల్లీ వచ్చేసేరు.

వారి విద్యాదాహం అంతటితో తీరలేదు. గ్వాలియర్ ఘరానాకి చెందిన పండిత్ నీలకంఠబువా మిరాజ్కర్ వద్ద చాలా మెలకువలు నేర్చుకున్నారు. అంతేకాదు. వారు పూర్తిస్థాయి సంగీతరంగ గాయక విద్వాంసుడిగా ప్రసిద్ధిని పొందిన తరవాతకూడా, వారి విద్యాసముపార్జనా యాత్రని కొనసాగింౘడంఅనేది వారి జీవతంలోవున్న నిరుపమ లక్షణం. ఈ విషయం, పటియాలా ఘరానా సంప్రదాయానికి చెందిన, ఉస్తాద్ బషీర్ ఖాన్ సాహబ్ వద్ద, వారు ఎన్నో క్రొత్త మెలకువలు నేర్చుకోవడం వల్ల మనకి బోధపడుతుంది. మధ్యలో, వారి జీవితంలో లభించిన ఆయా అవకాశాలని సద్వినియోగం చేసుకొంటూ, బాల్యంనుంచి వారు అలా నేర్చుకుంటునేవున్నారు. చిన్నతనంలో కర్ణాటక సంప్రదాయ గానరీతులని, స్వరప్రయోగ వైలక్షణ్యాన్ని,తాళ-లయల గతిజ్ఞానాన్ని, ౘక్కగా ఆకళింపుచేసుకున్నారు. సందర్భానుసారంగా, అట్రౌలీ-జయపూర్ ఘరానాకి చెందిన పండిత్ గోవిందరావ్ తెంబె, వివిధ పద్ధతులకి చెందిన ఇనాయతుల్లాఖాన్ , రోషనాలీ ఖాన్ ,ముబారకాలీఖాన్ ,మొదలైన మహామహులవద్ద ఎన్నినేర్చుకున్నారో, ఎంత నేర్చుకున్నారో,వాటికి అవధులే లేవు.

ఇన్ని అద్భుత సంప్రదాయాలనుంచి వారు నేర్చుకున్న రమ్య సంగీత కళారీతులన్నింటినుంచి, వేరువేరు జాతుల పూలనుంచి రకరకాల మాధుర్యాల మనోహర రుచులని సేకరించి భద్రపరచే ఒక గొప్ప తుమ్మెదలాగ, బసవరాజ్ వివిధ సంగీత విద్యా రీతుల సుమాలనుంచి అనుపమాన సంగీతమకరంద సంగ్రహణం చేసేరు. అంతేకాక, వారు ఆ దివ్యద్రవ్యాన్ని తన గానకళాహృదయంలో, తన అనితరసాధ్య తపస్సుతో, పరిపక్వంచేసి, రసికశిఖామణుల సమక్షంలో సంపూర్ణంగా, తనదైన శైలిలో ఆవిష్కరించేరు. ఇన్ని రకాల మూలాలనుంచి ప్రవహించిన సంగీత సుధా గంగాప్రవాహాలు వీరి హృదయ ప్రయాగలో సంగమించి, ఏకైక లోకోత్తర రసధునిగా బహిర్గతమై, రసజ్ఞచిత్తక్షేత్రాలని రసప్లావితం చేసేయి. అంతేకాదు, వారి శిష్య-ప్రశిష్యకోటిద్వారా, శాఖోపశాఖలై లోకంలో అలౌకిక క్షమతో ప్రవహిస్తున్నాయి. This matchless musical confluence acquired a unique status of being called as “RAJGURU GHARANA” by the connoisseurs of North Indian classical music. రాజ్ గురుజీ సంగీతం యొక్క విలక్షణధర్మం దానికి “రాజ్ గురు ఘరానా సంగీతం” అనే పేరుని తెచ్చిపెట్టింది.

ఇంతవరకు రాజ్ గురుజీ సంగీత విద్యా వ్యుత్పత్తి అంటే పరిశ్రమించి పాండిత్యం సంపాదించడం గురించి మాత్రమే తెలుసుకున్నాం. అంతేకాని, వారి ప్రతిభా-పాటవాల గురించి చర్చ చెయ్యలేదు. దైవదత్తమైన వారి గాత్ర మాధుర్యం అపురూపమైనది. వారిది గొప్ప పురుష కంఠస్వరం. అందులోనూ, మధ్యసప్తకగాత్రంలోను, తారాసప్తకగాత్రంలోనువున్న ఆ కమనీయ గాన పూర్ణ కాంతి దృఢత్వం శ్రోతలకి చాలా అరుదైన శ్రవణోత్సవం! రాగాధిదేవత వారి గాత్రశోభద్వారా అపురూపమైన అలంకారవైభవంతో రసికహృదయుల అంతరంగంలో సాక్షాత్కరిస్తుంది. వారు 21—07—1991వ తేదీన, ఒక ఆసుపత్రిలో, హృద్వ్యాధివలన పరమపదించేరు. చివరిగా, వారు-వారి శ్రీమతి నచికేతారాజ్ గురుని, తంబూరా మీటమని కోరి, భార్య తంబూరా మీటుతుండగా, ఆధారషడ్జంలో తన గాత్రాన్ని లయంచేస్తూ, తన ప్రాణాలని సంగీతశారదామాతకి సమర్పించుకున్నారు.

గణపతి భట్ , పరమేశ్వర హెగ్డే, శ్రీపాద్హెగ్డే, ముద్దుమోహన్ , సంగీతా కట్టీ, పూర్ణిమా కులకర్ణి మొదలైనవారు వారిశిష్యులలో ముఖ్యులు.

కేంద్ర-రాష్ట్ర సంగీత, నాటక అకాడమీల బహుమతులు, సంగీతరత్న, సంగీత సుధాకర, సంగీతజ్ఞ, పద్మశ్రీ, పద్మభూషణ్ , మొదలైనవి ఆ అత్యుత్తమ, నిరాడంబర గానప్రపూర్ణుడిని సేవించిన కొన్ని అలంకారాలు.

వారి గానకళాకౌశలంగురించి ఈ నాటి “కదంబకం~21″లో పరిచయం చేసుకుందాం.

స్వస్తి ||

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    సంగీతంలో పుట్టి, సంగీతంలో పెరిగి, తనూ సంగీతమూ అభేదమన్నట్టుగా జీవించి ఆ సంగీతంలోనే లయమైన గాన గంధర్వుడు శ్రీ బసవరాజ్ రాజ్ గురు గారి జీవిత చిత్రణ ఓ గొప్ప సంగీత కచేరీ చూస్తోన్నట్టుగా ఉంది. ధార్వాడ జిల్లా ఎంతటి మహా సంగీత కళాకారులకు జన్మనిచ్చింది!! అంతటి ప్రజ్ఞా వంతుడు నిత్య విద్యార్థిగా ఉండడం అందరికీ అనుసరణీయ
    మైన ఆదర్శం.

  2. Devi says:

    The Biography of Sri Basavaraj Rajguru makes me feel very happy.His journey in the field of music as a pupil,even after attaining great heights is an example of his ever flowing thirst and dedication to the subject. Rajguru Gharana as said by you shows his uniqueness in Hindustani music. We feel blessed to know about this greatest jewel of Indian music today.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *