సాహిత్యము-సౌహిత్యము – 27 : సానిన్ కొల్చిన వారి కబ్బును కదా! సౌశీల్య సౌభాగ్యముల్
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
11—11—2017; శనివారము.
సాహిత్యము—సౌహిత్యము~27.
ఈ వారం, సాహిత్య సంగీత హరికథా కళా కోవిదులు, శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్య శాస్త్రివర్యుల సమస్యాపూరణం చూద్దా. ఇది మన సత్సంగ సభ్యులకి చేరడం 11—11—2017; శనివారం ఐనా, ఈ అంశాన్ని “దీపావళి” పర్వదినం రోజున, అంటే, 19—10—2017; గురువారం రోజున, ప్రాతఃకాలంలో వ్రాసి పంపుతున్నాను.
సమస్య యిది:—
“సానిన్ కొల్చిన వారి కబ్బును కదా!
సౌశీల్య సౌభాగ్యముల్ “|
“సానిని అంటే వేశ్యని సేవించిన వాళ్ళకి ౘక్కని నడవడి, సంపదలు కలుగుతాయి కదా“! అని సమస్య భావం. అదెలా కుదురుతుంది? అలా చేస్తే చెడిపోయేవి-మొదట నడవడి, సంపదలే కదా! ఈ వైరుధ్యాన్ని, కవివరులు ఎంత సమర్థవంతంగాను, ఔచిత్యసుందరంగాను, ఉపదేశపూర్ణంగాను పూరించేరోరసజ్ఞులు పరికింౘండి.:—
ఇది శార్దూలవిక్రీడిత వృత్తం.
“దీనుండన్ ,దురితాత్ముడన్ , జడుడ
నో దేవాది దేవోత్తమా!
నీ నామంబు జపించి మామక
మనో నీరేజమున్ త్వత్పద
ధ్యానాసక్తుడనై సమర్పణము చేయంబూనితిన్ , శ్రీనివా
సా! నిన్ కొల్చినవారి కబ్బును కదా!
సౌశీల్య సౌభాగ్యముల్ ” ||
పద్యం నాలుగవపాదంలోవున్న
“పూర్వాపర వైరుద్ధ్యం” భక్తిభావుకుడైన కవి పూరణ సామర్థ్యంవలన పూర్ణగౌరవం పొందింది. ఇప్పుడు భావం చూద్దాం!
“ఓ శ్రీనివాసా! నీవు దేవతలందరిలోను మొదటి దైవానివి. ఆ పైన దేవుళ్ళందరిలో శ్రేష్ఠమైన దేవుడివి. ఇంక నేను చూస్తే, దీనుడిని, పాపభూయిష్ఠమైన భావాలతో నిండినవాడిని. మందమతిని. నీ నామాన్ని జపిస్తూ, నా మనస్సనే పద్మాన్ని నీ పాదాలని ధ్యానించే ప్రీతిభావంతో, నీకు సమర్పిస్తాను. ఎందుకంటే నిన్ను పూజించినవారికి (అన్ని దుర్గుణాలు నశించి, అజ్ఞానమంతా నిర్మూలమై) ౘక్కని నడవడిక, సౌభాగ్యాలు కలుగుతాయికదా”!
స్వస్తి ||
తెలుగు నేలలో ఒకప్పుడు అవధానాలను నాలుగు చెరగులా సాహిత్య ప్రియులు అమితంగా అభిమానించేరు, ఆస్వాదించేరు
ఆదరించేరు. అందులో ‘ సమస్య’ అందరికీ చాలా ప్రీతిపాత్రమైన
ప్రక్రియ. అవధానులు తమ కల్పనా చాతుర్యంతో పాటు చమత్కార ప్రావీణ్యాన్ని కూడా చూపించే అవకాశం ఉంది.ఈ పద్యంలో అవధాని గారు “సానిన్” అనే దానికి ‘ శ్రీనివా’ అనే prefix చేర్చి ఎంత గౌరవం చేకూర్చారో. మంచి సమస్యని అందించిన నీకు జేజేలు