కదంబకం — 19 : రాగ్ జోగియా

శ్రీశారదా దయా సుధ :—
05—11—2017; ఆదివారము.

కదంబకం~19.

ఈ వారం ఇంతవరకు మనం చర్చింౘని ఒక ప్రత్యేక విషయం పరిచయం చేసుకుంటున్నాం! “శారదా సంతతి”లో రచయితలని పరిచయం చేసుకుంటే, వారి రచనలలోని కొన్ని భాగాలని “కదంబకం”లో ౘవి చూస్తున్నాం. ఈ రోజు, “శారదా సంతతి”లో ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహిబ్ గురించి పరిచయంచేసుకున్నాము. ఉత్తరభారత సంగీత ప్రపంచంలో “కిరానా ఘరానా”కి ఒక విశిష్టస్థానం, గౌరవం, ప్రజాదరణవున్నాయి. ఆ అద్భుత కిరానా ఘరానా ప్రపంచంలో, ఖాన్సాహబ్ ఏకైక ఎవరెస్ట్ శిఖరం!

He’s one among the very few towering music-personalities such as Pandit Balakrishnabua Ichalkaranjikar, Ustad Alladiya Khan, Pt Bhaskarbua Bakhle, Ustad Fayyaz Khan, Ustad Amir Khan, Ustad Rehmat Khan & so on who sing in Hindustani style and all of whom ever tantalise and intimidate me to write on them, simultaneously.

ఐతే, మా మేనకోడలు, శ్రీమతి దేవి రామచంద్ర, హైదరాబాదునుంచి ఫోన్ చేసి పండిత్ భీంసేన్ జోషి పరిచయం చాలా నచ్చిందని చెప్పింది. ఆ సందర్భంలో అబ్దుల్ కరీంఖాన్ సాహబ్ వారి ప్రస్తావన వచ్చింది. వారి పరిచయంకూడాచేస్తే చాలా బాగుంటుందని, వ్రాయమని అంది.  ఒక్కరు ౘదివి సంతోషించినా నాకు చాలు, శారదామాత అనుగ్రహం నాకు లభిస్తుంది. అందుచేత ఖాన్ సాహబ్ వారి పరిచయం చేసేను. వారు పాడిన సంగీతం ఒక అమృతమయ మహాసాగరం. ఆ “సుధాసముద్రం”నుంచి ఒక చిన్న పంచపాత్రలో కొంచెం అమృతం గ్రహించి, దానియందు భక్తిప్రపత్తులు కలిగిన రసజ్ఞులకి, తలొక ఉద్ధరిణి తీర్థం ఇవ్వవచ్చని ఈ నాటి “కదంబకం”లో ఖాన్ సాహబ్ పాడినవి, నా సంగీత సంగ్రహాలయంలోవున్నవి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

రాగ్ జోగియా” :— ఇది ఒక మహనీయ రాగం. ఇది హిందుస్తానీ “భైరవ్ ” థాట్ (మేళకర్త) జన్య రాగం. కర్ణాటక సంగీతంలో 15వ మేళకర్త ఐన మాయామాళవగౌళకి భైరవ్ సమానం. ఈ జోగియారాగం, మన సావేరికి దగ్గరగావుంటుంది. ఐతే సావేరి ఉపాంగరాగం; అంటే అన్యస్వర ప్రయోగంవుండదు. కాని, జోగియా, ఠుమ్రీ అంగ రాగం అవ్వడంవల్ల రంజకత్వంకోసం, సాహిత్యభావరస స్ఫూర్తికోసం అన్యస్వరప్రయోగం వుంటుంది. జోగియా ఆర్తిభావాన్ని, విరహాన్ని, ఆశాలేశంతోకూడిన నిరాశని మొదలైనమనోభావాలని సమర్థవంతంగా వ్యక్తంచేస్తుంది. ఐతే, కళాకారుడి కంఠంలోని సహజమార్దవం, తనవిద్యలో పరిణతితోకూడిన ప్రతిభ, స్వరశ్రేణిప్రయోగ వైదగ్ధ్యం, ఇటువంటి అనేక ఫలవంతప్రావీణ్యాలతోబాటు, అన్నింటినీమించి రాగాధిదేవత అపార అనుగ్రహం ఉంటేనే అట్టి కళాకారుడు, ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహిబ్ ఔతారు. వారు జోగియారాగంలో పాడిన “పియాకె మిలన్కీ ఆస్ “, అంటేనా ప్రియుడు/ప్రేయసిని కలిసే ఆశ నాకు అలాగేవుంది అని అర్థం.

ఈ రాగంలోని పాటని ఎత్తుకుంటోనే, ఖాన్జీ ఒక్కసారిగా రాగరసాతిరేకస్థాయిలోకి, సాహిత్యభావానుభవపరిపక్వతతో  శ్రోత హృదయాంతరాళంలోకి చొచ్చుకుని వెళ్ళిపోతారు. క్రమంగా లౌకిక ప్రేయసీ-ప్రియభావంలోంచి, జీవ-దేవభావ ఆరామాంతర్భాగంలోకి,శ్రోతని తన రాగ-తాళ మాధ్యమం ద్వారా ఐంద్రజాలికుడిలాగ తీసుకు వెళ్ళిపోతారు.

ఇదే కృతిని భీంసేన్ జోషీజీ కూడా తనదైన విలక్షణశైలిలో పాడి శ్రోతకి ఇటువంటి దివ్యానుభూతిని కలిగిస్తారు. వారికి వారి గురువు, సవాయి గంధర్వజీ ఆశీస్సులతోబాటు, జోషీజీ పరమగురువు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్సాహబ్ ఆశీస్సులుకూడా పుష్కలంగావున్నాయి. ఖాన్సాహబ్ పాడిన బసంత్ , భీంపలాస్ , ఝింఝోటి, శంకర, లలిత్ , గుర్జరీతోడి, మార్వా, పఠదీప్ ,  ఆభోగీ కానడా, దర్బారీ కానడా, తిలంగ్ , ఆనందభైరవి, ఖరహరప్రియ మొదలైన అనేక రాగాలలోని- ఖయాల్ , ఠుమ్రీ, తరానా, భావగీతాలు, మొదలైనవి ఎన్నో “యుట్యూబ్ ” లోవున్నాయి. రసజ్ఞులు భక్తి-శ్రద్ధలతోవిని పరవశించి, తరింౘవచ్చు.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    రాగ్ జోగియా ప్రాశస్త్యం గురించి చెప్పడమే కాదు, ఇంకా అన్య రాగాలూ, సంగీత శాస్త్ర విషయాలూ కూడా తెలియపరిచావు.
    ఇక అబ్దుల్ కరీంఖాన్ గారి లాంటి ప్రతిభా సంపన్నుల గురించి
    చదివినప్పుడు, దైవశక్తి అలాంటి వారి ద్వారా అభివ్యక్తం అవుతుందా అనిపిస్తోంది.

  2. Devi says:

    Thank you very much Mavayya for this special episode on Raag Jogiya and Ustad Abdul Karim khan.I have no words to express my joy and ecstasy knowing about these Hindustani legends. Raag jogiya,its purpose and Presentation by Khan saheb that mesmerizes the audience to the top most level is expressed by you to such heights that we can taste the melody and experience its beauty right now .Thank you once again for giving the details of other Ragas also in which Khan saheb excelled.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *