సాహిత్యము-సౌహిత్యము – 26 : మరలందున్నది నాతి యోర్తు దివిషన్మాన్య ప్రభావమ్మునన్
శ్రీశారదా వాత్సల్య మందాకినీ :—
04—11—2017; శనివారము.
సాహిత్యము—సౌహిత్యము~26.
ఈ వారం సమస్య యాంత్రికంగా వున్మట్లు కనిపించినా పూరణలోని గొప్పతనంవలన దేవతాస్తుతిగా మారి మాన్యతని పొందింది.
సమస్య యిది:—
“మరలందున్నది నాతి యోర్తు
దివిషన్మాన్య ప్రభావమ్మునన్ “||
“అంటే యంత్రాల మధ్యవున్న ఒక స్త్రీమూర్తి దేవతల పూజింపబడతగిన దివ్యత్వాన్ని కలిగివుంది”.
మత్తేభవిక్రీడితం ఛందస్సులోని పద్యపాదమిది. ఇప్పుడు పూరణని చూద్దాం!
“కరుణాపూరము జిమ్ము కన్నుగవతో,
కస్తూరికారమ్య భా
సురఫాలస్థలరేఖతో, కఠిన వక్షోజాత
విస్ఫూర్తితో
హరికిన్ పట్టపు రాణియై, మరునకమ్మై,
లోకముల్ ప్రోవ, తా
మరలందున్నది నాతియోర్తు, దివిషన్మాన్య ప్రభావమ్మునన్ ” ||
“దయతోనిండిన కన్నులతో, నుదుట కస్తూరితో అందంగా వెలుగులీనుతున్న బొట్టుతో, పూర్ణ సంపత్స్వరూపమైన పాలిండ్లతో దివ్యకాంతితో శ్రీహరికి పట్టపురాణియై, మన్మథుడికి మాతయై, లోకాలనన్నీ సర్వసంపదలతో కాపాడడానికి తామరపూవులమధ్య నివసిస్తున్న ఒక దివ్యస్త్రీరూణి(ఐన లక్ష్మీమాత) వివిధ దేవతల పూజలు స్వీకరిస్తూ మహావైభవంగావుంది“.
అందరూ రోజూ శ్రీలక్ష్మీదేవిని ప్రార్థించుకోవడానికి అనువైనంత అందమైన పద్యం యిది. ఈ పద్యంలో దేవతా స్తుతియోగ్యమైన గొప్ప వర్ణనలు అన్నీ ౘక్కగావున్నాయి. అవికూడా స్థూలంగా పరికిద్దాం.
1. దేవతాకారుణ్యమయమైన పూర్ణ ప్రసన్నతా ప్రతిపాదనతో పద్యం ప్రారంభం అయ్యింది.
2. ఫాలభాగప్రకాశిత తిలక వర్ణన ద్వారా దేవతా సౌభాగ్యత్వం నిరూపింౘబడింది.
3. సర్వసృష్టికి ఆహారాది అఖిల సంపదల ప్రదానవిభూతి ప్రాధాన్యం ప్రకాశితం చేయబడింది.
4. జగత్పాలకదైవ మూలశక్తిగా ప్రకటింౘబడింది.
5. జగన్నిర్వహణకి చోదనశక్తియైన తృతీయ పురుషారుషార్థ ప్రదాయక తత్త్వానికి మాతృస్వరూపంగాను, తద్ద్వారా జగజ్జననిధర్మశీలరూపిణి గాను ప్రదర్శింపబడింది.
6. చివరగా, అన్నింటికీ ముకుటప్రాయమైన, శ్రీహరి శక్తిమూర్తిగా లోక రక్షణ నియతి(లోకముల్ ప్రోవ=రక్షించుటకు) రుజువుచేయబడింది.
ఇవి పైకి కనబడేవి మాత్రమే. ఈ మనోజ్ఞ బాహ్య సౌందర్యంలోపల ఎంతో అంతస్సౌందర్యం దాగివుంది. దానిని వర్ణింౘడానికి ఇక్కడ అవకాశం లేదు.
స్వస్తి ||
‘తామరలందుండెడి ముద్దరాలు’ ని వర్ణిస్తూ సమస్యని పూరించిన ఈ కవి ఎవరో కానీ, ఈ పద్యం మాత్రం ముందు చెప్పినట్టుగా నిత్యపఠనీయమైనదానిగా కూర్చారు. కేవలం పద్యభావం కాకుండా నువ్వు వివరించిన విశేషాంశాలు ఎంతో విలువైనవి.
అంతర్ముఖ సమారాధ్యా, బహ్జిర్ముఖ సుదుర్లభా…