శారదా సంతతి — 16 : శ్రీ యనమదల పెంటయ్య

శ్రీశారదా దయా సుధ :—
శారదా సంతతి~16.

29—10—2017; ఆదిత్యవారము.

శారదా ప్రియ తనయుడు ~ శ్రీ యనమదల పెంటయ్య.

తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలోని మా అమ్మమ్మ-తాతగారి ఇంట్లోకి పెంటయ్య ఎప్పుడు, ఎలాగ వచ్చేడో మాకేకాదు, మా తల్లి గారికే ప్రత్యక్షంగా తెలియదు. మా అమ్మగారు పసిపిల్లగావున్నప్పుడు, 5—6సంవత్సరాల వయస్సున్న పెంటయ్యని ఇంట్లో ఏ పనికైనా సహాయంగావుంటాడని తాతగారు చేరదీసేరు. అమ్మమ్మయింట్లో నిప్పులు కడిగేటంత మడి, తడి, ఆచారమూను. పెంటయ్యది సెట్టిబలిజ కులం. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఒక ఉత్తమ అధ్యాత్మ విద్యా సాధకుడు తన సాధనని సంపూర్ణ సత్సాంగత్య ప్రభావంతో, పరిపూర్ణ మానవ ప్రయత్నంతో, శివమయమైన ఈశ్వర అనుగ్రహంతో తన ఇంట్లో ధర్మపత్నియొక్క సహకార మహిమతో, అన్నిప్రతికూల అంశాలని దాటి, అధ్యాత్మవిద్యకి అనుకూల అంశాలని ౘక్కగా సమకూర్చుకుని తన జీవితాన్ని ఒక్క జన్మలోనే ఎలాగ తరింపజేసుకోవచ్చోపెంటయ్య జీవితం నిలువెత్తు సజీవ
ఉదాహరణ.

వ్యక్తి, కుల, వర్గ, సమాజ, జాతి, మతాది అనేకస్థాయిలలోవున్న సంస్కారాలు మనిషి ఐహిక-ఆముష్మిక స్థితి-గతుల గుణగణాలని నిర్ణయించడంలో కీలకపాత్రని పోషిస్తాయి. పెంటయ్య అధ్యాత్మ గతికి గ్రాఫ్ తయారుచేసి, దానిని అగ్రకులంలో పుట్టిన అధ్యాత్మసాధకుడి గ్రాఫ్ తో పోలిస్తే పెంటయ్య ఒక్క జీవితంలో ఏమి సాధించేడో, ఎంత సాధించేడో కొంత బోధపడుతుంది. పెంటయ్య గ్రాఫు నెగెటివ్ జోన్ లో ప్రారంభమై, పాజిటివ్ జోన్ లో ఉత్తమస్థాయికి చేరిపోతుంది. పెంటయ్యకి ఆహార-విహార-పానాదులలో శాస్త్రం ప్రకారం విధి-నిషేధాలు కనీసస్థాయిలోవుంటాయి. అంతేకాదు, అతడి చుట్టుప్రక్కల వాతావరణం అధ్యాత్మయానానికి ఏమాత్రమూ అనుకూలమైనది కాదు. ఆ పైన ప్రతికూలమైన అంశాలు ఎన్నోవుంటాయి. అందువల్ల పెంటయ్య ఇంచుమించు యౌవనప్రభావం జీవితం మీద సడలిపోయేవరకు అంతర్గతంగా వున్న తన అధ్యాత్మమార్గ ఉచిత సంస్కారాలకి, తనకి పరిసరాలవల్ల వచ్చిన అలవాటులకి మధ్య జరిగిన తీవ్రసంఘర్షణలని ఎలాగ అనుభవించేడో, తట్టుకున్నాడో తెలియదు. అమ్మమ్మగారి ఇంటినుంచి తన భోజనానికి కావలసిన కూరలు మొదలైనవి ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఆహారంలో పెంటయ్య మొదటి మార్పుచేసుకున్నాడు. క్రమంగా పూర్తి శాకాహారిగా మారిపోయేడు. జరదాకిళ్ళీమొదలైన అలవాట్లన్నీ క్రమంగాతగ్గించి పూర్తిగా మానివేసేడు. తాతగారియింట్లో జరిగే పూజలు, నోములు, వ్రతాలు మొదలైనవాటికి పూర్తి శ్రద్ధాసక్తులతో అన్ని ప్రాధమికమైన ఏర్పాట్లు చేసేవాడు. ఆ యింట ఆతిథ్యం స్వీకరించే మహాత్ములకి భక్తితో సేవచేసేవాడు. ఊళ్ళోని శివాలయంలోజరిగే హరికథలు, పురాణాలు, పుణ్యకార్యాలు మొదలైనవన్నీ అమ్మమ్మ, తాతగారు, పెంటయ్య ప్రమేయంలేకుండా జరగడం ఆ రోజులలో అసంభవం.

హరికథలు/పురాణప్రవచనాలు అన్నీశ్రద్ధగావిని చివరిలో మంగళహారతి పళ్ళెం పట్టుకుని అందరిదగ్గర దక్షిణలు వసూలుచేసి ఆ మొత్తానికి తనదక్షిణ కూడాచేర్చి హరికథదాసుగారికి/పౌరాణికులకి భక్తితో అందజేసేవాడు. అందువల్ల మా ఊరికివచ్చిన అటువంటి పెద్దలందరూ- అమ్మమ్మ,,తాతయ్యలతోబాటు పెంటయ్యని కూడా గుర్తుంచుకుని, అభిమానించే వారు. పెంటయ్యకిి, యుక్తవయస్సు రాగానే, తాతగారు, తాము ఉపాధ్యక్షులుగావున్న ఊరి సహకారబేంకులో ప్యూనుగా ఉద్యోగం వేయించేరు. పెంటయ్య ౘదువుకోలేదు. ఆ ఉద్యోగంతోనే పెంటయ్య తన కుటుంబాన్ని పోషించుకుని వృద్ధిలోకి తెచ్చుకున్నాడు. అంతేకాక చేతనైనంత దానధర్మాలు చేసేడు.

తాతగారియింట్లో సరుకులు/సామానులు ఎప్పుడూ పెంటయ్యే తెచ్చేవాడు. తాతగారు తమ ఇంటి నిర్వహణకి అయ్యే ఖర్చులన్నీ లెక్కవ్రాసేవారు. పెంటయ్యకి కొంత డబ్బు యిచ్చి వారం-పది రోజులకి పెంటయ్య చెప్పిన వివరాలప్రకారం పద్దులు వ్రాసుకుని, మళ్ళీ పెంటయ్యకి డబ్బు యిచ్చేవారు తాతగారు. ఇంట్లొ ఎవరికి ఏమి కావలసివచ్చినా పెంటయ్యకే చెప్పాలి. అంతే! అంటే, ఇంచుమించు పెంటయ్య ఇంటి ఆర్ఠికమంత్రి అన్నమాట! 40—50సంవత్సరాల పెంటయ్య ఆర్థికమంత్రిత్వంలో ఒక్కసారికూడా ఏవిధమైన తేడాలురాలేదు.

తొంభైసంవత్సరాలు పైన జీవించిన పెంటయ్య, చివరి 30సంవత్సరాలు నిత్యమూ శివాలయయంలోని అగస్త్యేశ్వరస్వామిని, బాలాత్రిపురసుందరిని, సీతారాములని, సత్యనారాయణస్వామివారిని, ఇతర దైవాలని దర్శింౘడమేకాక, గుడిలో శివనామాన్ని బిగ్గరగా అరగంటసేపు స్మరించేవాడు. పెంటయ్య శివనామోచ్చారణతోనిండిన గొప్ప కంఠధ్వని దశదిశల మారుమ్రోగి భక్తులని పరవశింపచేసేది.

మా తరంవాళ్ళం అందరమూ చిన్నతనంలో పెంటయ్యకి చాలా సన్నిహితంగా వుండేవాళ్ళం. తన సైకిలు మీద ముందు కూర్చోపెట్టుకుని మమ్మల్ని ఊళ్ళో దేవాలయాలన్నింటికీ తిప్పేవాడు. అడిగిన చిరుతిళ్ళు కొనిపెట్టేవాడు. ఐనా ఎప్పుడూ అతిౘనువు తీసుకోలేదు. కొంచెం పెద్దవాళ్ళంకాగానే మమ్మల్ని “మీరు” అనే సంబోధించేవాడు. వద్దన్నా వినే
వాడుకాదు. పెంటయ్య ప్రేమాభిమానాలు, గౌరవాదరాలు మరువలేనివి.

నాకు సుమారు 25 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు పెంటయ్య తన యింటికి రమ్మని నన్ను పిలిచేడు. అప్పుడు పెంటయ్యకి 52 సంవత్సరాల వయస్సువుండవచ్చు. తనకి తెలిసిన రిక్షాలో నన్ను తీసుకువెళ్ళేడు. ఇంట్లోకి వెళ్ళేను. ఇల్లు చిన్నదైనా ౘక్కగా పొందికగావుంది. తన దేవుడిగదికి తీసుకునివెళ్ళి చూపించేడు. నా ఆశ్చర్యానికి అంతులేకపోయింది. అక్కడ నాకు దర్శనం యిచ్చిన సన్నివేశం అంతా తాతగారి యింటికి జెరాక్సు కాపీలావుంది. ఆ దేవుడి సింహాసనం, పటాలు, ఇత్తడి కుందులు, హారతి రేకు,
రాగి పంచపాత్ర, ఉద్ధరిణి, హరివాణం, నైవేద్యంపళ్ళెం అన్నీ ఏ ఒక్కటీ తక్కువాలేదు-తేడాలేదు. ఆ గదికి పరిమితమైతే తాతగారి యింట్లోవున్నట్లే! ఏమిటిదంతా, పెంటయ్యా? అన్నాను, ఆశ్చర్యాన్నిఅదుపుచెయ్యకుండాను. పెంటయ్య కంటి వెంట కన్నీరు వస్తోంది. కష్టపడి ఆపుకుంటూ’ “ఏమీతెలియని వయస్సులో ఇలాంటివాడిని చేరదీసి కన్నబిడ్డలా చూసుకునే అమ్మమ్మగారి నుంచి, తాతగారినుంచి ఈ మాత్రమైనా నేర్చుకోకపోతే ఇంక ఈ బతుకు అనవసరం అండి, కృష్ణబాబుగారూ“!అన్నాడు. ౘక్కగా, సలక్షణంగావున్నఅతని భార్య, ఒకప్రక్కనించి ఇలాఅంది: “మీ పెంటయ్య మీ అందరికీ మంచోడేనండి, బాబూ! మీ బామ్మర్ల మళ్ళూ, బోజనాలు అలవాటై నన్ను కాల్చుకు తినేత్తన్నాడండి. మా వోళ్ళందరూ ‘ఇదేంగొడవే? ఇయన్నీ మనింటా-వొంటాలేయే’ అంటున్నారండి” అంది. పెంటయ్య ఏమీ మాట్లాడలేదు. నేనే బయటకి వచ్చేస్తూ ఇదంతా మీ పెద్దల పుణ్యం అని రిక్షా యెక్కి యింటికి వచ్చేసేను. అప్పటికీ-ఇప్పటికీ ఆ దృశ్యం నా కన్నులకి కట్టినట్టేవుంది.

తాతయ్యగారు-అమ్మమ్మ అందరికీ పెంటయ్య వారి పెద్దకొడుకు అనే చెప్పేవారు. పెంటయ్య వారిద్దరిని కేవలం తలిదండ్రులుగానేకాక, గురువులుగాను, దైవాలుగాను భావించి గౌరవించేడు. వారిద్దరితరవాత పెంటయ్యని మేమందరమూ మా కుటుంబసభ్యుడిగానే ఆదరించి గౌరవించేము. ముఖ్యంగా మా మేనమామగారు, డా.బి.ఎస్ .ఆర్ .రావుగారు, వారి భార్య శ్రీమతి శేషప్రభావతి, పెద్దకొడుకు శ్రీ బి.ప్రభాకర్ , చిన్నబ్బాయి శ్రీ బి.వి.కృష్ణరావు, వారి కుటుంబ సభ్యులందరూ పెంటయ్యని పూర్తి ప్రేమాదరాలతో చూసేరు. ఒకేఒకజీవితంలో ఒక ఉత్తమ సాధకుడు కనిష్ఠస్థాయినుంచి శ్రేష్ఠస్థితికి పరిణతి చెందవచ్చునని తన జీవితంద్వారా నిరూపించిన మా శ్రీ యనమదల పెంటయ్య వర్యుడికి వినమ్రంగా నమస్కరిస్తున్నాను.

స్వస్తి ||

You may also like...

11 Responses

  1. Sampath Kumar says:

    Great memories sir.

  2. జోగన్న says:

    పెంటయ్యకి మా నమస్కారములు.అతన్ని అలా తీర్చి దిద్దిన తాతగారికి అమ్మమ్మగారికి పాదాభివందనాలు

  3. సి.యస్ says:

    ‘పెంటయ్య కృష్ణారావు గారింట్లో పనిచేసేవాడు,
    పెంటయ్య రోజు గుళ్ళో కని పించేవాడు, మంచి భక్తుడు.
    పెంటయ్య కోపరేటివ్ బ్యాంక్ లో పనిచేస్తుండేవాడు’ ఇలా సామాన్యంగా అందరూ అతన్ని గురించి అనుకునేది. కానీ పెంటయ్య జీవన శైలీ, దాన్ని అతను తీర్చి దిద్దుకున్న తీరు చాలా మందికి తెలియదు. చాలా చక్కగా ఆ కోణాన్ని ఆవిష్కరించావు.
    బ్యాంక్ లో పనికి వెళ్లిపోయిన తరువాత తాతయ్య గారింటికి రావలసిన పనిలేదు పెంటయ్యకి…..ఏదో ఎప్పుడైనా చూడ్డానికి తప్ప! అయినా రోజూ బాధ్యతగా వచ్చేవాడు. ఇంటి బాధ్యతలు చూసేవాడు. ఒక్కటే మాట… తాతయ్య గారి కుటుంబ సభ్యుల
    ఫొటోలో పెంటయ్య లేకుండా లేదు. ధన్యజీవి మన పెంటయ్య.

  4. Nishanth says:

    Reminds me of latoo maharaj

  5. Srinivas says:

    Pentaiah gurinchi malli chala kalam taruvata gurthu chechavu .. Krishna annaiah

  6. Devi says:

    Pentayya is known to me as a loyal,affectionate and faithful person showing great respect to Tatagaru and Ammamma. My mother and uncles told me of his dedicated services to the family.But today as you present his biography as to what his true personality is my eyes overflowed with tears. His spiritual life as he shaped it on his own overcoming all personal and social issues is a great message for all of us. I bow myself in reverence to the divine soul.

  7. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    పెంటయ్యగారి చరితం
    వింటే, అధ్యాత్మ చిత్తవృత్తుల మడిగా
    వుంటే బతుకే వెన్నెల
    పంటే నని తెలియవచ్చు బాలాంత్రపు రే!

  8. వ.వెం.కృష్ణరావు says:

    పెంటయ్య మీద పద్యం
    బింటను, బయటను, విడువక యెంతో వెదుకన్ |
    ఒంటిగ, ‘సుందర ‘ కందము
    పంటించును భావియందు, బాలాంత్రపు రే!

  9. CS says:

    దుష్ట గుణగణముల, దూరాన వర్జించి,
    సద్గుణములనెంచి, చాల నేర్చి
    ‘పెంట’తనము బాపి, పెంటయ్య పేరుకు
    పేర్మి తెచ్చిపెట్టె పెద్దలలర!

  10. అవును పెంటయ్య మట్టిలో మాణిక్యం. సత్సంకల్పం తో.. సత్సంగంలో…తనను తాను అందంగా చెక్కుకున్న… అద్భుత శిల్పం. జీవితంలో తెలుసుకున్న విషయాన్ని… మహానుభావులు మాత్రమే ఆచరించి చూపరులను. అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. సాధారణ మానవ జీవితం లోని అనేక అంశాలను, భిన్నమైన కోణాలలో దర్శించి తాను అనుభూతి చెందుతూ, ఆ అనుభూతులకు అందమైన అక్షర రూపం ఇవ్వడం కృష్ణ కే సాధ్యం. మానవ మేధతో సంబంధం లేకుండా వారి వారి పూర్వజన్మ సంస్కారాలతో ఏర్పడుతుంది తాత్విక చింతన అనడాని చక్కని నిదర్శనం శ్రీమాన్ పెంటయ్య జీవితం. వీర జీవితం చదువుతున్నపుడు నాలోకి నేను తొంగి చూచుకోవాలనిపిస్తోంది. ధన్యోస్మి కృష్ణ.. ధన్యోస్మి…. జయశీలరావు.

  11. Srvalliseshasai says:

    Bavundhi..konchem gurthunnadu naku

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *