కదంబకం — 18 : అతి సర్వత్ర వర్జయేత్

శ్రీశారదా దయా సుధ :—
29—10—2017; ఆదిత్యవారము.

కదంబకం~18.

ఈ వారం సంస్కృతలోకోక్తులు కొన్ని చూద్దాం. ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే ఈ లోకోక్తుల మూల శ్లోకాలని కూడా పరామర్శిద్దాం!

1. “అతి సర్వత్ర వర్జయేత్ “||

“ఎక్కడైనా అతి అంటే సంగతి-సందర్భాలని మించి ప్రవర్తింౘకూడదు” అని పెద్దల సలహా!

దీని మూలశ్లోకం:—

అతిదానాత్ హతః కర్ణః
త్వతి లోభాత్ సుయోధనః |
అతికామాత్ దశగ్రీవః
త్వతి సర్వత్ర వర్జయేత్ ” ||

దానాలు అతిగాచేసి కర్ణుడు నాశనం ఐపోయేడు. పరద్రవ్యాన్నికూడా స్వంతం చేసేసుకోవాలనే అతి లోభ బుద్ధివల్ల సుయోధనుడు నశించేడు. అతిస్త్రీవ్యామోహం కారణంగా రావణుడు మరణించేడు. అందువల్ల అతిగావుండడం దేనిలోనూ పనికిరాదు”.

ఇదే అర్థంవచ్చే మరొక శ్లోకంకూడా ప్రచారంలోవుంది. అదీ ఇది:—

అతిదానాత్ బలిః బద్ధః
హ్యతిమానాత్ సుయోధనః |
వినష్టో రావణో లౌల్యాత్
అతి సర్వత్ర వర్జయేత్ ” ||

“మితిమీరిన దానం వల్ల బలిచక్రవర్తి బంధింౘబడ్డాడు. మేరమీరిన స్వాభిమానం దుర్యోధనుణ్ణి నాశనంచేసింది. అదుపుతప్పిన (స్త్రీ)లోలత్వం రావణాసురుడిని రాలిపోయేలాగ
చేసింది. (అందువల్ల) అతి దేనిలోనైనా పనికిరాదు”.

2. “పునర్దరిద్రః పునరేవ పాపీ” ||

“మళ్ళీ దరిద్రుడయ్యేడు, మళ్ళీ పాపాత్ముడయ్యేడు”.

అదాన దోషేణ భవేత్ దరిద్రో
దరిద్ర దోషేణ కరోతి పాపమ్ |
పాపాత్ అవశ్యం నరకం ప్రయాతి
పునర్దరిద్రః పునరేవ పాపీ” ||

“దానధర్మాలు చెయ్యకపోవడం వల్ల దరిద్రుడుగా పుడతాడు. దారిద్ర్య దోషం వల్ల పాపం చేస్తాడు. పాపం చేయడం వల్ల నరకానికి వెడతాడు. ఆ విధంగా మళ్ళీ దరిద్రుడై మళ్ళీ
పాపాత్ముడౌతాడు”.

3. “అనామికా సార్థవతీ బభూవ” |

“అనామిక పేరుసార్థకం అయ్యింది”.

పురా కవీనాం గణనాప్రసంగే
కనిష్ఠికాధిష్ఠిత కాలిదాసా |
అద్యాపి తత్తుల్య కవేః అభావాత్
అనామికా సార్థవతీ బభూవ” ||

“పూర్వం కవుల లెక్క సందర్భంలో చిటికినవేలున కాళిదాసుతో ప్రారంభించి లెక్కపెట్టబోతే, ఆయనకి సాటి ఐన కవి నేటికీ లేకపోవడంవలన ఆ తరువాత వేలు అనామిక పేరుతో సార్థకమై
పొయింది”.

4. “అర్థస్య పురుషో దాసః” |

“మనిషి డబ్బుకి దాసుడు”. (డబ్బుకి లోకం దాసోzహం)

అర్థస్య పురుషో దాసః
దాసస్త్వర్థో న కస్యచిత్ |
ఇతి సత్యం మహారాజ!
బద్ధః చార్థే చ కౌరవైః” ||

“ధనానికి మనిషి దాసుడు. ధనం ఎవ్వరికీ దాస్యం చెయ్యదు. ఓ మహారాజా! నేను ధనం వలననే కౌరవులకి కట్టుబడివున్నాను”.

5. “కాకః కాకః పికః పికః” ||

“కాకి కాకే! కోకిల కోకిలే!”.

కాకః కృష్ణః పికః కృష్ణః
త్వభేదః పిక కాకయోః |
ఆయాతా మధుయామిన్యః
కాకః కాకః పికః పికః” ||

“కాకీ నలుపే! కోకిలా నలుపే! రెండింటికీ తేడా ఏమీ లేదు. కాని వసంత రాత్రులు రాగానే కాకి కాకే! కోకిల కోకిలే!”.

స్వస్తి ||

You may also like...

3 Responses

  1. Sampath Kumar says:

    Nice sir.

  2. సి.యస్ says:

    అనామిక పేరు ఎలా సార్ధకమైందో చెప్పిన లోకోక్తి మంచి చమత్కారంగా ఉంది. పూర్తి శ్లోకాలు చూస్తే చాలా అర్థవంతంగా
    ఉన్నాయి. ముఖ్యంగా ‘పునర్దరిద్ర:’ అనేది.

  3. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    మొదటిసామెతకి (నేను విన్న) ఇంకొక పాఠాంతరం:

    “అతిరూపాత్ హృతా సీతా2తిగర్వాత్ రావణో హతః |
    అతిదానాత్ బలిః బద్ధః అతి సర్వత్ర వర్జయేత్ ” ||

    రెండోది, అదాన దోషానికి చిట్కాగా “దానేన అదానం తర” అంది సామ వేదం (“సేతూన్స్తర…” అని రాగాలు తీస్తూ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *