సాహిత్యము-సౌహిత్యము – 25 : కన్యకు నీకు ఇంక పది కావలె, కస్తురి రంగనాయకా
శ్రీశారదా వాత్సల్య గఙ్గ :—
28—10—2017; శనివారము.
సాహిత్యము–సౌహిత్యము~25.
ఈ వారంకూడా జ్యోతిషశాస్త్ర సంబంధమైన విషయమే చూద్దాం. ఒక తెలుగు పద్యం పరికిద్దాం.
“కన్యకు ఐదు జంఘలును కన్యకు
ఆరు కుచంబు లెన్నగా,
కన్యకు నాల్గు కన్బొమలు కన్యకు
ఏడు విశాల నేత్రముల్ ,
కన్యకు ద్వాదశంబు ఉలికౌనును
కల్గు సులక్షణాఢ్య కా
కన్యకు నీకు ఇంక పది కావలె,
కస్తురి రంగనాయకా“!
మామూలు శబ్దార్థజ్ఞానంతో ఈ పద్యానికి తాత్పర్యంచెపితే అది విపరీతంగావుంటుంది. అలాగ చెపితే ఎలాగవుంటుందో చూద్దాం.
“(వివాహము కావలసిన) కన్యకి ఐదు పిక్కలున్నాయి. ఆమెకి ఆరు వక్షోజాలు ఉన్నాయి. నాలుగు కనుబొమలు ఉన్నాయి. ఆరున్నొక్క విశాలమైన నయనాలున్నాయి. సన్నని నడుములు పన్నెండున్నాయి. ఇలాంటి మంచి లక్షణాలన్నువున్న ఆ గొప్ప వధువు నీకు అన్ని విధాలా తగినది కనక, ఓ కస్తూరి రంగనాయకా! నీవు ఆ కన్యని వివాహంచేసుకుంటే నీకు అన్నివిధాలా అనువైన దాంపత్యంస్థిరపడుతుంది-అని కవిగారి మాట.
మొహమాటం పడడానికి, వరుడు కస్తూరి రంగనాయక ప్రభువు. ఆయనకి అన్నీ తెలుసు. కవిహృదయం బాగా తెలుసు. కవి చమత్కారాల ముసుగులు ఆయనదగ్గర ప్రక్కకి తప్పుకుని దండంపెడతాయి. అప్పుడు ఆయా మాటలన్నీ ఆయనకి తమ అసలు-సిసలైన అర్థాలనన్నీ అందంగా బోధపడేటట్లు విన్నవించుకుంటాయి. ఆ అర్థాలిప్పుడు చూడవచ్చు.
ఇక్కడ కన్యకి అంటే, జ్యోతిషశాస్త్సపరంగా-కన్యారాశికి- అనే అర్థం తీసుకుంటే పెడర్ఠాలన్నీ మాయమైపోయి, అసలు అర్థాలు ప్రత్యక్షమౌతాయి.
“కన్యకి ఐదు జంఘలు= కన్యారాశికి ఐదవస్థానమైన మకరం/మొసలి ఆకారంవున్న అందమైన పిక్కలు,
కన్యకు ఆరు కుచంబులు=కన్యారాశికి ఆరవస్థానం-కుంభం-అంటే పుష్టీవంతమైన వక్షోజాలు,
కన్యకు నాల్గు కన్బొమలు=కన్యకి 4—ధనుస్సు, విల్లు రూపంలో కనుబొమలు
కన్యకు ఏడు విశాలనేత్రముల్ =కన్యకి-7—మీనం- అంటే చేప రూపమున్నఅందమైన విశాల నయనాలు,
కన్యకు ద్వాదశంబు ఉలి కౌను=కన్యకి-12— సింహం,ఉలి కౌను=సన్నని నడుము—అంటే సింహంలాగ సన్నని నడుము కలది;
సులక్షణాఢ్య=శుభలక్షణాలు కలిగిన వారిలో గొప్పది,
కన్యకు నీకు ఇంక పది కావలె, కస్తురి రంగనాయకా!= కన్యకు—10—మిథునం ఓ కస్తూరి రంగనాయకా! అటువంటి దివ్యగుణశోభితమైన ఆ కన్యకి-నీకు
దాంపత్యం ఏర్పడేలాగ చేసుకో స్వామీ!
పై విధంగా అన్వయం చెప్పుకుంటే విషయం వివరంగా బోధపడుతుంది.
స్వస్తి ||
ఆరోజుల్లో కవులు మహా మేధావులు. కేవలం కవిత్వం అల్లడమే కాదు, వారికి అనేక శాస్త్రాలలో గాఢమైన ప్రవేశముండేది. కవిత్వాన్ని ఆలంబనగా చేసుకుని తమ శాస్త్రప్రకర్షని ప్రదర్శి స్తూండేవారు.ఇక్కడ కవి ఎలాంటి కన్యతో వివాహం కావాలో
ఆశీర్వదిస్తూ, చమత్కారంగా జ్యోతిష శాస్త్రాన్ని వాడుకున్నాడు.
ప్రజలు, ప్రభువులూ అంతే సరసులు కనక ఇలాంటి కవిత్వం వర్ధిల్లింది.మంచి పద్యం!
Bhale Bhale.