Fun facts – 19
శ్రీశారదా దయా చంద్రికా :—
28—10—2017; శనివారము.
వాస్తవాలు—వినోదాలు/Fun-Facts~19.
1. ప్రపంచ ప్రఖ్యాత విషాదాంత చలనచిత్ర మహారాజ్ఞి, ఫ్రెంచినటి ఐన శారా బెర్న్ హార్డ్ట్ చిన్నతనం నుండి ఒక విచిత్రమైన మానసిక భ్రమతో కొట్టుమిట్టాడేది. తాను ఎక్కువ కాలం బ్రతకనని, చిన్నతనంలోనే హఠాత్తుగా మరణిస్తానని అంటూవుండేది. అలా ఉన్నా ఫరవాలేదు. 18 సంవత్సరాల వయస్సు రాగానే, తల్లిని వేధించి ఒక శవపేటికని కొనిపించింది. తరుచుగా దానిలోనే నిద్రించేది. తన నిరుపమ నటనా కౌశలంతో ఆమె “డివైన్ శారా” గా లోకవిఖ్యాతి గడించింది. 1844 లో పుట్టిన ఆవిడ 1923 లో మరణించింది. అంటే సుమారు 79 సంవత్సరాలు బ్రతికింది.
2. భూగోళ ఉత్పత్తి, వికాసం మొదలైనచరిత్ర లెక్కలలోకివెడితే 4.5 బిలియన్ సంవత్సరాల విస్తృతకథలోకి వెళ్ళవలసిందే. మనం సూక్ష్మం లో మోక్షం లాగ అంతటి విశాల ఘన చరితని ఒకే ఒక్క సంవత్సరంలోకి కుదించివేసేం అనుకోండి. అప్పుడు భూమికి-మనిషికి బంధం ఏర్పడిన
మొట్టమొదటి ముహూర్తం, డిసెంబరునెల 31వ తేది రాత్రి సుమారు గం.8—30ని.ల కి అని చెప్పవచ్చుట!
3. ఇంగ్లండులోని గ్లామొర్గాన్ కి చెందిన ట్రఫారెస్టు గాయకుడు, టాం జోన్సు అమెరికాలో లాస్ వేగాస్ లో స్థిరపడ్డాడు. ప్రారంభంలో అతనికి ఇంటిబెంగ పట్టుకుంది. ఎలాగైనా దానిని వదిలించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించేడు. తన ఊరి వీధిమొగలో ఒక రెడ్ టెలిఫోన్ బాక్స్ ఉండేది. దానిని అమెరికాకి వచ్చేలాగ ఏర్పాటుచేసి, తనపెద్ద విల్లాహోం ఆవరణలో ఇన్ స్టాల్ చేయించుకున్నాడు. దానికి ఆ రోజులలో $5,000; ఖర్చుపెట్టేడు. ఏమైతేనేం, మనశ్శాంతిని కొనుక్కున్నాడు.ఒక్కొక్కసారి మనశ్శాంతి వెల అధికంగాకూడా ఉండవచ్చు, మరి!
ఒక ఊరితోను, వస్తువులతోనూ అటాచ్ మెంట్, సెంటిమెంట్ పెట్టుకోడం వాళ్ళకీ ఉందనమాట. టామ్ జోన్స్ ఇంగ్లాండు నుంచి అమెరికా టెలీఫోన్ తెచ్చుకోవడం చిత్రంగా ఉంది.