కదంబకం — 17 : కవిత్రయభారతం
శ్రీశారదా దయా సుధ :—
22—10—2017; ఆదిత్యవారము.
కదంబకం~17.
మా తాతగారు శ్రీ బాలాంత్రపు వెంకట కృష్ణారావుగారికి “కవిత్రయభారతం” అంటే పంచప్రాణాలూను. వారికి మహాధర్మనిష్ఠ. ధర్మప్రీతి కలవారికి భారతరతివుండడం సహజమేకదా! మా అమ్మమ్మగారికికూడా భారతం అంటే చాలా యిష్టం. అందుకని ఈ రోజు వ్యాసభారతం, కవిత్రయభారతాలలో జీవనగమన ధర్మాలు ఎలావున్నాయో చూద్దాం!
1. ” జానన్నపి చ యః పాపం
శక్తిమాన్ న నియచ్ఛతి |
ఈశః సన్ సో>పి తేనైవ
కర్మణా సంప్రయుజ్యతే “||
వ్యాసభారతం—ఆది—చైత్రరథ—11.
“ఎరుకగలడేని మరిశక్తుడేని, అన్యు
లన్యులకుహింస గావించునపుడ
దాని పూని వారింపకున్న,అప్పురుషు
డేగుహింసచేసినవారల యేగు గతికి”.
నన్నయభారతం—ఆది—7:46.
“తగిన సామర్థ్యం కలిగివుండి, తెలిసియుండి, ఒకరిని మరొకరు హింస చేస్తూవుంటే పట్టించుకోకుండా ఉపేక్షచేసేవాడు, హింసచేసేవాడు వెళ్ళే పాపమయలోకానికే వెడతాడు”.
2. “ఇహ వై కస్య నాముత్ర
చాముత్రైకస్య నో ఇహ |
ఇహ వా>ముత్ర చైకస్య
నాముత్రైకస్య నో ఇహ “||
వ్యా.భా.—వనపర్వం—183:88.
“ఈ లోకమ యగు కొందర,
కాలోకమ కొందరకుయిహంబును పరమున్ |
మేలగు కొందర కధిపా!
ఏలోకములేదుసూవె యిలకొందరకున్ “
ఎర్రన భారతం—ఆరణ్య—4:174.
“కొందరికి ఇహలోకంలో మేలు జరుగుతుంది. కొందరికి పరలోకంలో మేలు జరుగుతుంది. మరికొందరికి ఇహపరాలు రెండింటిలోనూ మేలు జరుగుతుంది. కొందరికిమాత్రం ఇహపరాలు రెండింటిలోను మేలు జరగదు”.
3. ” అనిర్వృత్తేన మనసా
ససర్ప ఇవ వేశ్మని |
ఉత్సాదయతి యస్సర్వం
యశసా స విముచ్యతే ” ||
వ్యా.భా.—ఉద్యోగపర్వం—72 : 61.
“పగయ కలిగెనేని పామున్న ఇంటిలో
ఉన్న యట్ల కాక ఊరడిల్లి
ఉండునెట్లు చిత్తమొకమాటు కావున
వలవ దధిక దీర్ఘ వైర వృత్తి “.
తిక్కన భారతం—ఉద్యోగ—3 : 20.
“మనసులో పగపెంచుకుంటే పామున్నయింట్లోవున్నట్టే! పామున్న యింట్లో ఎప్పుడూమనస్సు ఊరటతోవుండదు. అందువల్ల మనస్సులో దీర్ఘవైరభావం ఉండనివ్వకూడదు”.
4. “యథా కాష్ఠం చ కాష్ఠం చ
సమేయాతాం మహోదధౌ |
సమేత్య చ వ్యపేయాతాం
తద్వత్ భూత సమాగమాః ” ||
వ్యా.భా.—శాంతిపర్వం— 174 : 15.
“కదియున్ కాష్ఠము కాష్ఠము
నదిలో,మరికొంతసేపునకుపాయును నె
మ్మది నట్లుగ తలపగ వల
వదె పితృపుత్రాదిబంధువర్గమునధిపా”
తిక్కన భారతం—శాంతి—4 : 10.
నది(సముద్రం) ప్రవాహంలో ఎక్కడి నుంచో(వేరుగా)వస్తున్న ఎండు కట్టెలు ఒకచోటకలిసి కొంతదూరం పయనించి, మళ్ళా ప్రవాహప్రభావంవల్ల వేరు-వేరు దారులలోకి విడిపోతాయి. మానవుల కలయికలు-విడిపోవడాలు ఇలాగే ఉంటాయి”.
5. “కించిదేవ మమత్వేన
యదా భవతి కల్పితమ్ |
తదేవ పరితాపార్థం
సర్వం సంపద్యతే తదా “||
వ్యా.భా.—శాంతి— 174 : 44.
“ఇది నాయది యను ఊతన్
మది యెయ్యది పట్టుకొల్పినను వాసితమై
తుది చేటు నొంది వానికి
అది శోకము నావహించు అత్యంతంబున్ “||
తిక్కన భారతం—శాంతి— 4 : 13.
“మానవుడు మానసికంగా దేనినైనా ఊతగా అనుకుని దానియందు ఎప్పుడు ఆధారపడడం మొదలుపెడతాడో అప్పుడే తన భవిష్యత్తులో కలగబోయే దుఃఖానికి బీజం వేసుకుంటున్నాడు”.
స్వస్తి ||
భారతం గురించి నీతో తాతయ్యగారు చర్చించడం గుర్తుంది. కవిత్రయ భారతం అందునా తిక్కన గారంటే ఆయనకి మక్కువ ఎక్కువ. తన్మయ్వంతో నీతో మాట్లాడేవారు.ఇక్కడ కేవలం తెలుగు పద్యాలే కాక వ్యాస కృత శ్లోకాలు కూడా ఉదహరించడం,
అవి కావలసిన వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది.
The last two are fantastic! Thank you for such wonderful gems from one of the greatest books ever.