సాహిత్యము-సౌహిత్యము – 24 : త్వమధునా తూర్ణం తృతీయో భవ
శ్రీశారదా వాత్సల్య మందాకినీ :—
21—10—2017; శనివారము.
సాహిత్యము–సౌహిత్యము~24.
ఈ వారం జ్యోతిషశాస్త్రసంబంధమైన విషయం ప్రధానంగా, అంటే ఆ శాస్త్రం ఆధారంగా లేక దానిని ఒక ఉపకరణంగా ఉపయోగించుకుని మూలవిషయం (main theme) ఉంటుంది. అందుకని రాశిచక్రంలోని 12 గృహాలు క్రమం తప్ప కుండా ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకుందాం:—
1)మేషం; 2)వృషభం; 3)మిథునం;4)కర్కాటకం; 5)సింహం; 6)కన్య;7)తుల; 8)వృశ్చికం; 9)ధనుస్సు;10)మకరం; 11)కుంభం; 12)మీనం.
ఇక్కడ ప్రధాన ఇతివృత్తం ప్రేయసీ-ప్రియులైన నాయికా-నాయకుల సన్నివేశ సందర్భం. ప్రేయసి ప్రేమాతిరేకంతో తీవ్రవిరహవేదన అనుభవిస్తూ వుంటుంది. ఆమె ఇష్టసఖి జ్యోతిషశాస్త్రంలో ఆరితేరినది. నాయకుడు జ్యౌతిషశాస్త్రపండితుడు. అతడికి నాయకిపై అమితప్రేమవున్నాఒక తప్పనిసరి సభాకార్యక్రమంలో నిమగ్నమైవుండి, ప్రేయసి సంగతిని ఉపేక్షిస్తాడు. ఇష్టసఖి తనస్నేహితురాలిబాధనిగమనించి, ఆమెకు మేలుకలిగిం
ౘడంకోసమూ, నాయకుడికి కాస్త విషయ ప్రాధాన్యాన్ని వివరించి సమయసందర్భాల ఔచిత్యం పాటింౘవలసిన తెలివిని కలిగింౘడంకోసమూ నాయకుడున్న సభాభవనానికివెడుతుంది.
సభలోవున్న స్త్రీ-పురుషులకి అర్థం కాకుండా, కేవలం కథానాయకుడికి మాత్రమే తెలిసేవిధంగా అతడికి- తనకిమాత్రమే పరిచయమున్న జ్యౌతిషభాషలో తాను చెప్పదలచుకున్న సందేశాన్ని ఇలా అందిస్తుంది:
“సంతప్తా దశమ ధ్వజాది గతినా
సమ్మూర్ఛితా నిర్జలా |
తుల్య ద్వాదశవత్ ద్వితీయమతిమన్
ఏకాదశాభస్తనీ |
సా షష్ఠీ శరమధ్యమా చ నవమ
భ్రూ సప్తమీ వర్జితా |
ప్రాప్నోత్యష్టమ వేదనాం త్వమధునా
తూర్ణం తృతీయో భవ” ||
ఇష్టసఖి నాయకురాలి దయనీయ విరహస్థితిని నాయకుడికి మాత్రమే తెలిసే విధంగా “జ్యౌతిష సాంకేతిక భాష” లో వివరిస్తోంది:
“(హే) ద్వితీయ మతిమన్ = ఓ సూక్ష్మ గ్రహణశక్తిలేని “ద్వితీయ” అంటే రెండవ, అంటే వృషభ మతి అంటే బుద్ధి కలిగినవాడా! అంటే ఎద్దులాగ ఏ పనిలోపడితే ఆ పనిలోనేవుండిపోయి మరొక మేలైన పనిమీద ధ్యాసలేని మందమతీ!
(సా=తవ ప్రియతమా=నీ ప్రేయసిఐన ఆమె) ఆది గతినా= మొదటి గృహం మేషం లాగ అంటే అమాయకమైన మేకవలె;
దశమ ధ్వజ సంతప్తా=దశమం అంటే మకరం–మకరధ్వజుడంటే మన్మథుడు –మన్మథ/విరహ వేదనతో వేగిపోతోంది.
తుల్య=(జ్యోతిష పరిభాషలో నాల్గు అంటే కర్కాటకం లేక పీత) పీతలాగ,
ద్వాదశవత్ = పన్నిండవరాశి మీనం అంటే చేపలాగ నిర్జలా, సమ్మూర్ఛితా= నీరు లేకపోతే అవి(పీత/చేప) మూర్ఛపోయినట్లు నీ ప్రేయసి సొమ్మసిల్లిపోతోంది.
ఏకాదశాభస్తనీ= పదకొండవది “కుంభం”. అంటే పరిపుష్టమైన స్తన సౌభాగ్యంకలిగిన సుందరి.
సా=ఆమె; షష్ఠీ=ఆరవది,”కన్య”. ఆమె నీకు తగిన కన్య.
శరమధ్యమా=”శర” అంటే ఐదు. అంటే సింహం. అంటే సింహంలాగ సన్నని నడుము కలిగినది. చ=ఆ పైన/ఇంకా
నవమ భ్రూః =తొమ్మిదవరాశి ఐన ధనుస్సువలె ౘక్కగా తీర్చి దిద్దిన కనుబొమలు కలిగినది.
సప్తమీ వర్జితా= 7వది “తుల”. అంటే ఆమెతో తుల్యమైనవారు/పోల్చదగిన వారు ఎవ్వరూలేరు.(అంతటి సౌందర్య రాశి/సుగుణ సంపన్న)
అష్టమ వేదనాం ప్రాప్నోతి=8 వృశ్చికం. అంటే తేలు కుట్టినంత విరహబాధని అనుభవిస్తోంది.
త్వం అధునా తూర్ణం= నీవిప్పుడువెంటనే
తృతీయో భవ=3 మిథునం. అంటే నీవు ఆమెను వివాహమాడి, మీరు ఇద్దరూ దాంపత్యధర్మాన్ని నిర్వహింౘడానికి గృహస్థాశ్రమం స్వీకరించు.
మొత్తం అంతా జాగ్రత్తగా అన్వయం చేసుకుంటూ ౘదువుకుంటే తాత్పర్యంౘక్కగా బోధపడుతుంది.
స్వస్తి ||
సాధారణంగా అన్ని వృత్తులలోనూ వాటికి తగ్గ సాంకేతికపదాలూ,సంబంధిత పరిభాష ఉంటుంది. వాటిని ఇతర విషయాలకి అన్వయించినప్పుడు అది ‘కోడ్ ‘భాషగా మారుతుంది. అలా చేయడం వలన ఒక్కొక్కసారి హాస్యం,మరోసారి గోప్యత లభిస్తుంది. ఉదాహరణకి సినిమా వాళ్ళు భోజనాల సమయంలో climax అని అడిగితే పెరుగన్నమాట. అలాగే పురోహితులు టీ,కాఫీలకి ఏకాక్షరి,ద్వ్యక్షరీ
అంంటూంటారు. ఇక్కడ జ్యోతిషశాస్త్ర సంబంధిత భాషతో పంపిన సందేశం భలే బాగుంది.
This episode on Sahityam souhityam is very interesting and witty. The wisdom of the sakhi in conversation with the hero is portrayed at its best.Your depth in the subject is awesome. This delicate and subtle relationships between men n women are important in today’s society with deteriorating culture .