శారదా సంతతి — 14 : పండిత్ భీమసేన్ జోషి
శ్రీశారదా దయా సుధ:—
15—10—2017; ఆదిత్యవారము
శారదా సంతతి~14.
శారదా ప్రియ సుతుడు~ పండిత్ భీమసేన్ జోషి.
పండిత్ భీమసేన్ జోషి కర్ణాటకరాష్ట్రంలోని, ధార్వాడ జిల్లాలో వున్న గదగ్ లో 4—02—1922 తేదీన జన్మించేరు. తండ్రి ఆంగ్ల,కన్నడభాషలలో పండితుడు. తల్లి భజనలు ౘక్కగాపాడే ఆదర్శగృహిణి. చిన్నతనంనుంచి భీమసేన్ చాలాబాగా పాడేవాడు. ఆయన పితామహుడు భీమాచార్య గాత్రసంగీతంలో ప్రవీణుడు.
ఒకసారి, చిన్నతనంలోనే, కిరానా ఘరానాని సువ్యవస్థితంచేసిన సంగీతశారదాతనయుడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహబ్ మహామధురంగా పాడిన ఝుంఝోటి రాగంలోని “పియా బిన్ నహీ ఆవత్ చైన్ ” ఠుమ్రీ బాలభీమ వినడం జరిగింది. అంతే! ఆ చిన్నారి మనసుమీద ఆ పాట ఎంత గాఢమైన, తీవ్రమైన ప్రభావాన్ని కలిగించిదంటే, ఆ పాటే మనవంటి సంగీతప్రేమికులకి పండిత్ భీంసేన్ జోషి వంటి మహాగాయకసార్వభౌముడిని ప్రసాదించింది.
అనేకసందర్భాలలో ఆయన ఏదో ఒకవంకని ఇంట్లొనించి సంగీతం నేర్చుకోవడానికి పారిపోయేవారు. ఎంతో కష్టపడి తలిదండ్రులు వారిని వెదికి తెచ్చుకునేవారు. ఒకసారి తండ్రిగారు గ్రామాంతరం వెళ్శినసమయంలో, భోజనంచేస్తూ, తల్లి తానుకోరినంత నెయ్యి అన్నంలో వెయ్యలేదని, ఆవంకతో మళ్ళీ ఇంటి నుంచి పారిపోయేరు. ఈసారి ఎక్కువ కాలమే ఇల్లువదిలి వెళ్ళిపోయేరు. ఆయనకి కావలసినసంగీతం వారికి మనస్సులో స్పష్టంగా తెలుసు. ఆ సంగీతం లభించేవరకు ఆయన దేశంలోని అనేకస్థానాలలోవున్న అనేక సంగీతకళాకారులైన మహానుభావుల వద్ద శిష్యరికంచేసి, ఎన్నోబాణీలలో అనేకరాగాలలోని కృతులనెన్నో నేర్చుకున్నారు. చిన్నపిల్లవాడిగాచేసిన ఆ కాలంనాటి రైలుప్రయాణాలలో టిక్కట్టులేకుండానే తన సంగీతవిద్యాశిక్షణయాత్రని కొనసాగించేరు. బీజపూరు, పూణే, బొంబై, గ్వాలియరు తన సంగీతాన్వేషణయాత్రలోభాగంగా దర్శించి ఆయాస్థలాలో కొందరు మహాసంగీతకళాకిరులకి సేవచేసి, వారి ఇళ్ళల్లోవుండిపోయి శిష్యరికంచేస్తూ ఎన్నో రాగాలలో పాఠాలు నేర్చుకున్నారు. గ్వాలియరులోవుండగా పండిత్ కృష్ణారావు శంకర్ పండిత్ , రాజాభయ్యా పూఛ్వాలె లవద్ద నేర్చుకున్నసంగీతం వారికి రుచింౘలేదు. సేనీయఘరానా సరోదు కళాకారులైన ఉస్తాద్ హఫీజ్ ఆలీ ఖాన్ (ఉస్తాద్ అంజద్ ఆలీఖాన్ గారి తండ్రి) గారి వద్ద కొంతకాలం శుశ్రూషచేసి చాలా కష్టమైన “మార్వా” రాగం పూర్తిగా నేర్చుకున్నారు.
అక్కడినుంచి ఖరగ్ పూర్ , కలకత్తా, ఢిల్లీలలో కొంత-కొంతకాలంవుండి జాలంధర్ చేరుకున్నారు. అక్కడ ఆచార్య మంగత్ రాం దగ్గర భీంజీ కొంతకాలంస్థిరంగావుండి సంగీత సాధన చాలాబాగా చేసేరు. అక్కడ ప్రతిసంవత్సరమూ పెద్దఎత్తునజరిగే “హరివల్లభ సంగీతోత్సవం” కార్యక్రమాలకి ఆ సంవత్సరంకూడా గొప్ప-గొప్ప కళాకారులు ఎందరో విచ్చేసేరు. పండిత్ వినాయకరావు పట్వర్థన్ కూడా ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆయన యువకళాకారుడైన జోషీ సంగీతంవిని, జోషీజీ సంగీతవిద్యకి, ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహబ్ ప్రథమశ్రేణి శిష్యుడైన పండిత్ సవాయిగంధర్వ మాత్రమే అన్నివిధాలాతగినగురువని సలహాయిచ్చేరు. సవాయిగంధర్వ అసలుపేరు రాంభావు కుండ్గోల్కర్. కుండ్గోలుగ్రామం, జోషీజీ గ్రామమైన గదగ్ కి ప్రక్కగ్రామమే! అందువల్ల ఆయన వెంటనే తనవూరు చేరుకున్నారు. తండ్రి గురురాజ్ జోషి కొడుకు భీంని సవాయి గంధర్వవద్దకి తీసుకువెళ్ళి ఆయన దగ్గర శిష్యరికానికి కొడుకుని అప్పజెప్పేరు. భీం గాత్రంవిని గురువుగారు సంతోషించినా, ఒక షరతు విధించేరు. అంతవరకు భీం నేర్చిన విద్యగురించిమర్చిపోయి గురువుగారి వద్ద క్రొత్తవిద్య నేర్చుకోవాలి. భీం అందుకు అంగీకరించి గురువుగారి దగ్గర సుమారు ఐదుసంవత్సరాల కఠిన గురుశుశ్రూషలో ౘక్కగా తన విద్యని నేర్చుకున్నారు. 21సంవత్సరాల వయస్సులోనే పెద్ద సభలలో మహామహులైన శ్రోతలని మెప్పించేస్థాయికి సంగీతం కచేరీలలో పాడగలిగిన గొప్ప కళాకారుడిగా ఆయన గుర్తింపు గడించేరు.
వారికి భారతదేశకేంద్రప్రభుత్వంవారు క్రమంగా పద్మశ్రీ నుండి పద్మవిభూషణ్ వరకు అన్ని బిరుదుల ప్రదానంచేసి, అత్యున్నత పౌరపురస్కారం ఐన “భారత రత్న” ఇచ్చి గౌరవించేరు.
అజరామరమైన వారి గాత్రసంగీతం భారతదేశ శాశ్వత సంపదలలో ఒకటిగా నిలిచిపోయింది. శ్రీమతి వత్సలాజోషి వారి భార్య. వారికి ముగ్గురు కుమారులు. వారి శిష్యులు చాలా మందివున్నారు. వారు తమ సంగీతాన్ని కేవలం కిరానా ఘరానాకి మాత్రమే పరిమితం చెయ్యకుండా జైపూర్ -అట్రౌలీ, పటియాలా, రాంపూర్ -సెహస్వా మొదలైన ఇతర ఘరానాలలోని ప్రత్యేక అలంకారాలని, అందాలని తన గానశైలిలో సుందరంగా కూర్చి రసికసంగీతజ్ఞులకి అందించేరు. అందువలన వారి గాయనశైలిని మనం భీంసేన్ జోషీ ఘరానా అని పిలవాలి.
ఈ శారదాతనయుడి అపారప్రతిభకి నతమస్తకులమై నమస్కరిద్దాం!
స్వస్తి ||
_/\_.
ఈ సంక్షిప్త జీవన చిత్రం, శ్రీ భీంసేన్ జోషి సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించింది. వారి సంగీత సాధనా మార్గంలో తమ లక్ష్య సాధన కోసం ఎన్ని మలుపులు తిరిగారో, ‘భారతరత్న’గా ఎలా ఎదిగారో హృద్యంగా ఈ రచన కళ్లముందు నిలిపింది. ఇది చదివితే, తన్మయత్వంతో కళ్ళుమూసుకుని, మెడ కొంచెం పక్కకి తిప్పి, కుడిచేయి అనంతాకాశంలోకి చూపిస్తూ సంగీతాలాపన చేస్తూన్న శ్రీ భీంసేన్ జోషి జ్ఞాపకానికొచ్చారు.
Introduction of the greatest Hindustani musician Sri Bhimsen Joshi is really a feast to our hearts today dear Mavayya. Going through the lives of these legends is a true tribute we really can pay to them. Looking forward to more such treats from you😊