Fun facts – 17
శ్రీశారదా దయా చంద్రికా :—
14—10—2017; శనివారము.
వాస్తవాలు—వినోదాలు/Fun-Facts~17.
1. 1981 లో మానవుల నిద్రకి సంబంధించిన అలవాట్ల విషయంలో చాలా విస్తృతమైన పరిశోధనలు జరిగేయి. ఆ పరిశోధనలలో తేలిన విషయాలు యివి:—
l) యుక్తవయస్సు వచ్చిన మనుష్యులు ఒక సంవత్సరంలో సగటున 1460 కలలు కంటారు.
ll) సరాసరి ప్రతిస్వప్నమూ ఐదు నిమిషాల వ్యవధికి లోబడివుంటుంది.
lll) స్వప్నం లక్షణం వేగవంతమైన నయన చలనాన్ని కలిగివుండడమే! దీనినే ఆంగ్లంలో REM లేక Rapid Eye Movement అంటారు.
2. పోర్టో రీకో – Puerto Rico – లో జనాభా సమస్య చాలా ఎక్కువ! దానిని పాలించిన గవర్నరు Luis Munoz Marin, ఒకసారి ప్రజలనుద్దేశించి వారు చేసిన ప్రసంగంలో జనాభాసమస్య గురించి మాట్లాడుతూ యిలా అన్నారు:— “మన ప్రాచీనులు మనకి సామెత రూపంలో అందించిన సందేశం మీకూ తెలిసినదే! ‘మానవుడు తన జీవితంలో తప్పనిసరిగా మూడు బాధ్యతలని తప్పక నిర్వర్తించాలి. l) మొక్కలనినాటి, పెంౘడం. ll) పుస్తకాలని రచింౘడం. lll) కొడుకులని కనడం.’ నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇంక మనవాళ్ళు ఎక్కువగా చెట్లని నాటి, పెంౘడమూ, పుస్తకాలు అధికంగా రచింౘడమూ చేస్తే సరిపోతుంది”.
3. 1923లో ఆర్థర్ ఫెర్గుసన్ అనే స్కాట్లండు దేశీయుడు, లండను మహానగరంలో “కింగ్ కాన్ ” అంటే నేరసామ్రాజ్య చక్రవర్తి అనే బిరుదు సంపాదించేడు. ఆయన నిత్యకృత్యం ఏమిటంటే వెర్రిబాగుల అమెరికను పర్యాటకులని మోసగించి వేలాది పౌండ్లని వారికి కల్లబొల్లి కబుర్లుచెప్పి దోచుకోవడం. ఒక అమెరికను టూరిస్టునుంచి బిగ్ బెన్ గడియారంకోసం వెయ్యి పౌండ్లువసూలుచేసేడు మన నేరపతి. నెల్సన్స్ కాలంని మరొకరికి ఆరువేల పౌండ్లకి అమ్మేడు. బకింగ్హాం భవనంకోసం రెండువేల పౌండ్ల డిపాజిట్టు తీసుకున్నాడు. ఇలాగ ఎంతకాలంజరిగివుండేదో తెలియదు. ఒకసారి మఫ్టీ అంటే మామూలు దుస్తులలోవున్న పోలీసు అధికారికి బ్రిటిష్ పార్లమెంటు భవనసముదాయం అమ్మబోయి జైలు పాలయ్యేడు. దానితో ఆ కథ సుఖాంతమైంది.
స్వస్తి||
పోర్టో రీకో గవర్నరు ఆ చిన్న దీవిలో జనాభా సమస్య గురించే కంగారు పడితే, మన పాలకులూ, ప్రజలూ మన దేశం గురించి ఎంతో ఆలోచించాలి. ఆదేశం పేరు వినగానే, అంత చిన్న దేశమైనా,వారు ఒలింపిక్స్ లో సాధించిన పతకాలు గుర్తుకొస్తాయి. ఫెర్గుసన్ అమ్మకాలు మహా తెలివిగా ఉన్నాయి.దీని ఆధారంగానే కాబోలు,ఓ సినిమాలో చార్మినార్,రవీంద్రభారతి అమ్మకానికి పెడతాడు-తనికెళ్శ భరణి
బ్రహ్మానందానికి.