ఆలస్యాత్ అమృతం విషం
శ్రీశారదా వాత్సల్య సుధ :—
10—10—2017; మంగళవారము.
ఇతరములు
చాలాకాలంతరవాత “ఇతరములు” లోగిలిలోకి అడుగుపెడుతున్నాం. మిగిలిన “కక్ష్య”లలో సంచరింౘడం ఎక్కువైపోయి తగినంత తీరికలేక పోవడంవల్ల ఈ కక్ష్యని ఉపేక్షింౘడం జరిగింది. అంతేకాదు. కొన్ని కక్ష్యలకి ఖచ్చితమైన కాలవ్యవధి/fixed periodicity ఉంది. అది దీనికి లేదు. లేకపోతే వ్రాయవలసిన అంశాలు చాలానేవున్నాయి. అంటే ఈ కక్ష్యలో వ్రాయవలసినవి అన్నమాట.
ఈ రోజు శ్రీ కిరణ్ సుందర్ బాలాంత్రపు స్పృశించిన అంశాలు చర్చిద్దాం!
“కదంబకం—14” లో కొన్ని సంస్కృతలోకోక్తులు చూచేం! వాటిలో ఒకటి “ఆలస్యాత్ అమృతం విషం” అన్నది. ఆలస్యంవలన అమృతం విషం ఔతుంది-అని దీని అర్థం.కాని మనకి తెలుగులో వాడుకలో “ఆలస్యం అమృతం విషం” అనే బాగా ప్రచారంలోవుంది. ఈ రెండింటిలో ఏది సరైనది అని ప్రశ్న.
అసలు తేడా ఎందుకువచ్చింది అని కూడా ఆలోచించాలి. సంస్కృతభాషని దేశవ్యాప్తంగా అన్నిప్రాంతాలవారూ వాడతారు. మన తెలుగుభాష మన ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాలు రెండింటిలో వేరువేరు ప్రాంతాలలో భిన్న-భిన్నంగా వాడుకలోవుండడం మనందరికీ తెలిసినదే. మరి అలాగే సంస్కృతభాషానూ! ఐతే ఇప్పుడు యింక తేలవలసినది “ఆలస్యాత్ అమృతం విషం” సరైనదా? “ఆలస్యం అమృతం విషమ్ ” కరెక్టా? చూడాలి.
రెండూ సరైనవే. ఎలాగ? ఇప్పుడు చూద్దాం!
పైరెండు వచనాలలోను క్రియాపదం లోపించింది. క్రియాపదాన్ని అన్వయించుకునేతీరు మారుతుంది.మొదటి వచనంచూద్దాం.
1. ఆలస్యాత్ అమృతం విషం భవతి = ఆలస్యము వలన అమృతము విషము అగును అని అర్థం చెపుతాము. అంటే “ఆలస్యం” అనే నపుంసకలింగ, ఏకవచన, పంచమీ విభక్తి రూపాన్ని తీసుకుంటే “భవతి” అనే ప్రథమపురుష ఏకవనంలోని “భూ-సత్తాయాం” అనే ధాతువుయొక్క “లట్ “వర్తమానకాల క్రియని ఉపయోగించేం! ఇక్కడ ఇది అకర్మక-intransitive-క్రియ.
2. ఆలస్యం అమృతం విషం కరోతి = ఆలస్యం అమృతాన్ని విషం చేస్తుంది అని చెప్పాలి. ఇక్కడ “అమృతం” అన్నది ద్వితీయా విభక్తిలో-accusative/objective case-లోవుంది. డుకృఞ్ కరణే – అనే తనాదిధాతుగణం యొక్కప్రథమపురుష ఏకవచనంలో ఈ క్రియవుంది.ఈ రకంగా రెండూ సరైనవే! “కరోతి” అనేక్రియ సకర్మకక్రియ- transitive verb. అంతే తేడా. తాత్పర్యంలో మార్పు లేదు.
స్వస్తి||
వ్యాకరణం మీద పట్టు ఉంటే, భాషా ప్రయోగం కరతలామలకం ఔతుంది.
చాలా బావుంది. Thanks. The question, which of the two is the authentic/original & Textually-supported one still remains.
Chaalaa baagundi explanation
Captain M.W.Carr గారి “ఆంధ్రలోకోక్తిచంద్రిక”(1868)లోను, శ్రీ గొల్లపూడి శ్రీరామ శాస్త్రిగారి గ్రంథంలోని
“సంస్కృత లోకోక్తులు” విభాగంలోను, ఆచార్య శ్రీ రవ్వా
శ్రీహరిగారి “సంస్కృత లోకోక్తులు” పుస్తకంలోను,
ఇంకా రెండు-మూడు పుస్తకాలలో
“ఆలస్యాత్ అమృతం విషమ్ ” అని మాత్రమేవుంది.
ఇంతవరకు నేను ఏ ముద్రిత గ్రంథాలలోను
“ఆలస్యం అమృతం విషమ్ ” అని చూడలేదు.
అది మనప్రాంతంలోనే చిన్నప్పటినుంచీ వినడం
జరిగింది. అంతే!
Thank you so much!