కదంబకం — 15 : శ్రీరామ వనవాస గమనము
శ్రీశారదా దయా సుధ :—
08—10—2017; ఆదిత్యవారము.
కదంబకం—15.
ఈ రోజు శ్రీ వేంకటపార్వతీశ్వరకవుల “నిర్వచన రామాయణము” లోని అయోధ్యాకాండము లోవున్న “శ్రీరామ వనవాస గమనము” ఘట్టం గురించి సక్షిప్తంగా చూద్దాము!
ఆ సమయంలో అంతఃపురస్త్రీలు హాహాకిరాలతో దుఃఖిస్తూ ఇలా అంటున్నారు:
“ఎటకేగుచున్నాడొ హీనదీనానాథ
తాపసోద్ధారి మా తండ్రి యిపుడు
ఎటకేగుచున్నాడొ కుటిలకోపనివృత్తి
సమవర్తి యైన రాకొమరుడిపుడు
ఎటకేగుచున్నాడొ ఈ తల్లి కౌసల్య
కనునట్లె మముకన్న తనయుడిపుడు
ఎటకేగుచున్నాడొ యింతికగ్గంబైన
రాజాజ్ఞ లోకశరణ్యుడిపుడు
సర్వజీవహితుడు సత్యవ్రతుండు స
ద్ధర్మ నిరతు డత్యుదార చరితు
డైన రాము వీడనాడి తా నిపుడెంత
బుద్ధిహీనుడయ్యె భూమిజాని!”
“హీనులని, దీనులని తండ్రిలా దయచూచేవాడు, తపస్సు చేసుకునే వారిని ఉద్ధరించేవాడు, దుర్మార్గమయమైన కోపంకలిగిన వారిని అదుపులో పెట్టేవాడు, ఏ విధమైన పక్షపాతబుద్ధిలేకుండా అందరినీ సమానప్రీతితో చూచేవాడు, కౌశల్యామాత ఆయనని కొడుకుగా ఏ విధంగా కన్నదో అదేవిధంగా మమ్మల్నందరినీ కన్న తల్లి/తండ్రి తానే ఐనవాడు, ఆడదానిమాటకిలోబడిన రాజాజ్ఞని అనుసరించి లోకానికంతటికీ శరణాగత రక్షకుడైన రాజకుమారుడైన శ్రీరాముడు మా తండ్రి ఇలా ఎక్కడికివెళ్ళిపోతున్నాడు, ఈ సమయంలో? అఖిలజీవజాలానికి మేలుచేసేవాడు,
సత్యవాక్యపాలనాస్వభావి, గొప్ప ఉదారచరితుడు ఐన శ్రీరాముడిని విడిచిపెట్టిన అయోధ్యానగర రాజు పూర్తిగా మతి చెడినవాడు.”
ఆ తరవాత అయోధ్యలోని స్థితి-గతులు కవిద్వయంవారు ఇలా వర్ణిస్తున్నారు:
“అధిపసుతుడురాముడడవికేగినచింత
వేల్వ రైరి వేది విప్ర వరులు,
వంటమానిరింటివారలు; తమపనుల్
జనులు వీడి రంత నినుడు గ్రుంకె.
పాలుగుడుపవయ్యెపసిలేగలకుగోవు
లేమి మేయ వయ్యె సామజములు;
ఎలమి పొందదయ్యె తొలిచూలి మగబిడ్డ
కనిన సతియు నపుడు వనట కుంది“.
“దశరథమహారాజు కొడుకైన శ్రీరాముడు వనవాసానికి వెళ్ళి పోయేడనే బాధతో అయోధ్యలోని బ్రాహ్మణులు తమనిత్య అగ్నిక్రియని చెయ్యలేదు. స్త్రీలు నిత్యమూ చేసే వంట మానివేసేరు. రోజూ చేసే పనులనన్నీ ఆయాజనులు విడిచిపెట్టేసేరు.ఆవులు వాటిలేగదూడలకి పాలు చేపలేకపోయేయి. ఏనుగులు మేత మెయ్యడంలేదు. బాధతో క్రుంగి పోయిన తొలికాన్పు తల్లి బిడ్డ పుట్టేడన్న సంతోషం లేకుండావుంది”.
“మెల్లగ వీవదు తెమ్మెర
ౘల్లగ వెలుగంగబోడు చంద్రుడు!సెగలం
ౙల్లడు పవలిటిదొర, యిటు
లెల్లజగము నొల్లబోయెనినకులుడెడలన్ !
పిల్లలు తలపరు తల్లుల,
ఇల్లాండ్రను పతులుతలపరేబంధువులే
నొల్లరు తలపగ నొండొరు,
నెల్లరహృదయములు రామునే
వెనుకొనుటన్ “||
రాముడులేని ఆ అయోధ్యా వర్ణన ఇంత హృదదయవిదారకంగాను, సునిశితంగాను, కోమలంగాను చేసేరు మన కవిద్వయ వరిష్ఠులు.
వారికి హార్దిక నత మస్తకులమై అంజలి ఘటిద్దాం.
స్వస్తి ||
వేంకట పార్వతీశ్వర కవుల నిర్వచన రామాయణం గురించి తెలిసినవారు ఈ కాలంలో ఎవరూ లేరు.కనక ఇలాంటి వ్యాసాల అవసరం ఎంతైనా ఉంది. గీత పద్యాలూ, కంద పద్యాలూ అలవోకగా నడిచి, భావయుక్తంగా పాడుకునేలా ఉన్నాయి. ఈ ఘట్టంలో వాల్మీకి హృదయం చక్కగా ఆవిష్కరింపబడింది. నీ వివరణ రసస్ఫోరకంగా ఉంది.
_/\_.