శారదా సంతతి — 13 : శ్రీ బాలాంత్రపు వేంకటరావు వర్యులు

శ్రీశారదా దయా సుధ :—
08—10—2017; ఆదిత్యవారము.

శారదా సంతతి—13.

శారదా ప్రియ తనయులు— కవిరాజహంస, కవికులాలంకార శ్రీ బాలాంత్రపు వేంకటరావు వర్యులు.

20వ శతాబ్దం ప్రారంభంలో ఆంధ్రశారదని తమ ఉత్తమశ్రేణి కవిత్వంతోను, నవలలతోను, నాటక సాహిత్యంతోను అపూర్వవైభవంతో అలంకరించి, అర్చించి తెలుగు పాఠకుల పఠన సంస్కృతి ప్రమాణాలని ఉత్తమస్థాయికి తీర్చిదిద్దిన మహానుభావులు- కవిరాజహంస, కవికులాలంకార శ్రీ వేంకటపార్వతీశ్వర కవులు. ఈ కవిద్వయంలో ప్రథములు శ్రీ బాలాంత్రపు వేంకటరావుగారు. ద్వితీయులు శ్రీ ఓలేటి పార్వతీశంగారు.

ఈ రోజు శ్రీ బాలాంత్రపు వేంకటరావు గారిగురించి మన పరిమితులకిలోబడి సంక్షిప్తంగా తెలుసుకుందాం. శ్రీ వేంకటరావుగారి తల్లి పేరు శ్రీమతి సూరమ్మగారు. ఆమె మల్యాలవారి ఆడపడుచు. తండ్రిగారు శ్రీ బాలాంత్రపు వేంకట నరసింహంగారు. శ్రీమతి సూరమ్మ-శ్రీ నరసింహం దంపతులకి ఐదుగురు కొడుకులు, చివరగా ఒక ఆడబిడ్డ మొత్తం ఆరు మంది సంతానం. శ్రీ వేంకటరావుగారు వారి తల్లి-తండ్రులకి నాల్గవసంతానం. వారు 02—01—1881వ తేదీన పిఠాపురం దగ్గరవున్న మల్లాంగ్రామంలో పుట్టేరు. సంగీతం, సాహిత్యం, వేదాంతం, అధ్యాత్మవిద్య, రచనావ్యాసంగం మొదలైనవి ఇంటపుట్టిన దైనికవ్యవహారపరంపరలో భాగాలే! ఐతే వారు బాల్యంనుంచి సంస్కృతాంధ్ర సారస్వతాధ్యయనం గురుముఖతః క్షుణ్ణంగా చేసేరు.  రెండు భాషలలోను కావ్య, నాటక, అలంకార,వ్యాకరణ, ఛందశ్శాస్త్రాలు ౘక్కగా అభ్యసించేరు. పండితవరిష్ఠులు శ్రీ డా. దివాకర్ల వేంకటావధానిగారు చెప్పినట్లు ఆ నాటి ఆంధ్రదేశంలో పేరుపొందిన ౙంటకవులు ఎందరున్నా శ్రీ తిరుపతి వేంకటకవులు, శ్రీ వేంకటపార్వతీశ్వరకవులు వారందరిలో సుప్రసిద్ధులు.

శ్రీ కొవ్వూరి చంద్రారెడ్డిగారి ప్రాపకంలో శ్రీ బాలాంత్రపు వేంకటరావుగారు, వారికి బావగారైన శ్రీ చాగంటి శేషయ్యగారు, అన్నగారైన శ్రీ బాలాంత్రపు రామయ్యగారు, శ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణరావుగారు, శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి మొదలైనవారితో కలిసి 1911 లో “ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల” ని స్థాపించేరు. ఈ సంస్థద్వారా సుమారు రెండువందల గ్రంథములకు పైగా వచనరచనలని, పద్యరచనలని ప్రచురణ చేసేరు. ఆ విధంగా తెలుగు పాఠకులలో ఉత్తమ పఠనాసక్తిని ఆ కాలంలో ఈ ప్రచురణ సంస్థ కలిగించింది.

శ్రీ వేంకటరావుగారి ధనాభిరామ, సతీసంయుక్తాది రూపకాలు అప్పటి వారి రచనలలో పేరు పొందేయి. “అవి రసపాత్ర పోషణ, సంవాద సౌందర్యములకు ఆలవాలములు” అని డా. దివాకర్ల వేంకటావధానిగారు ప్రశంసించేరు. వారి “ఏకాంత సేవ” విశ్వవిఖ్యాతిని పొందింది. దీనిని వారి రెండవ కుమారులు డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఆంగ్లభాషలోకి “Alone with the Spouse-Divine” అను పేరుతో అనువదించేరు. తెలుగులో భావకవితా ఉద్యమానికి “ఏకాంతసేవ” ఊపిరి పోసిందని తెలుగు సాహిత్య చరిత్రని అధ్యనం చేసిన పెద్దల అభిప్రాయం. శైలి, శిల్ప విషయాలలో అది నిజమే కావచ్చు. కాని గ్రంథగత మూలవస్తువుకి సంబంధించినంతవరకు తెలుగు వాఙ్మయసర్వస్వంలోనే అది ఏకైకకావ్యం. అంతకి ముందుకాని, ఆ తరవాతకాని అటువంటిది మరొకటి లేదు.

వేంకటపార్వతీశ్వరకవుల “కావ్యకుసుమావళి” పుస్తక పరంపర, “బృందావనం“, “భావసంకీర్తనలు“, మొదలైన పద్యరచనలన్నీ మహారసనిర్భరాలై సున్నితమైన పాఠక హృదయాలని పూర్తిగా తమ వశం చేసుకుంటాయి. వారి “మాతృ మందిరము“, “ప్రమదావనము” మొదలైన వచన కావ్యాలు అద్భుత శిల్ప రామణీయకానికి శాశ్వత ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపోయేయి. వారి శివపురాణము, బ్రహ్మపురాణము వచనరచనలో ప్రామాణికమైనవి.

ఇంక ప్రత్యేకంగా చెప్పవలసిన మరొ విషయం– వారి బాలల సాహిత్య నిర్మాణం. ఈ విషయంలో వారికి రావలసినంత ప్రసిద్ధి రాలేదు. ఈ గేప్ప వాఙ్మయ కాంతిలో బాల్యాన్ని సుసంపన్నంచేసుకున్న ఆనాటి పిల్లలో నేను కూడా ఒకడిని. వారి బాలల బొమ్మల రామాయణం, భారతం, భాగవతం మొదలైన పుస్తకాలు మా వంటివారందరికి ఆ రోజులలో నిత్యబంధువులు, సత్యమిత్రాలు. రాత్రులలో ౘదివినతరవాత వాటిని పక్కలోనే పెట్టుకునే పడుకునేవాళ్ళం. తెల్లవారి లేస్తూనే పనులన్నీ తొందరగా పూర్తిచేసుకుని ౘదివిన వాటినే మళ్ళీ-మళ్ళీ ౘదువుకుంటూ ఆ పుస్తకాలతో constant companionship ని కలిగి వుండేవాళ్ళం. “బాల గీతావళి” అని తెలుగులో మొట్టమొదటిసారి నర్సరీ రైమ్సు వంటి అందమైన, అందరినీ ఆకట్టుకునే పాటలని నాకు జ్ఞాపకంవున్నంతవరకు ఐదు భాగాలుగా రచించి ప్రకటించేరు. ఆ రోజులలో బడిపిల్లలందరూ యిష్టంగా పాడుకొనే బాలలపద్యం-
అంటే నర్సరీ రైము ఒకటి నాకు జ్ఞాపకంవున్నమేరకి ఇక్కడ పొందు పరుస్తున్నాను:

రింగు రింగని తిరుగు నా బొంగరమ్ము
ఏమిటో వ్రాయుచున్నది ఇసుకలోన,
బడికి పోలేదు బలపమ్ము పట్టలేదు,
ఎౘట నేర్చెనొ ఏమొ తానింతౘదువు“.

ఎంత అందంగా, అవలీలగావుందో ఈ పద్యం!

తరవాత చెప్పుకోవలసినద “నిర్వచన రామాయణము”. ఈ రచన అసంపూర్ణంగా నిలిచి పోయింది. వేంకటపార్వతీశ్వరకవులు కృతికర్తలు మాత్రమే కాక కృతిభర్తలుకూడా అయ్యేరు. వారి షష్టిపూర్తి ఉత్సవంలో శ్రీ శివశంకరస్వామిగారు తమ కావ్యాన్ని వేంకటపార్వతీశ్వరకవులకి అంకితమిచ్చేరు. ఈ కవిద్వయానికి నరసారావుపేట ఆంధ్రసారస్వతపరిషత్తువారు “కవిరాజహంస” బిరుదునిచ్చి సమ్మానించేరు. షష్ట్యబ్దపూర్తి మహోత్సవంలో, రాజమహేంద్రిలో శ్రీ శొంఠి రామమూర్తి పంతులవారి అధ్యక్షతలో తెలుగువారు అందరూ కలిసి జంటకవులకి “కవికులాలంకార” బిరుదు ప్రదానం చేసేరు. ఆ నాటి ఆంధ్రప్రదేశంలోని అనేక సస్థానాధీశులు వీరిని వివిధ రీతులలో గౌరవించి తెలుగు సరస్వతిని సమ్మానించేరు.

శ్రీ బాలాంత్రపు వేంకటరావుగారి పెద్ద కుమారులు శ్రీ నళినీ కాంతరావుగారు కవిగా, సంపాదకులుగా, విమర్శకులుగా, ప్రాచీనాంధ్రగ్రంథ పరిష్కర్తలుగా,  సంస్కృతాంధ్రాంగ్లాలలో సమ ప్రావీణ్యం కలిగినవారిగా నాకు తెలుసు. అలాగే వారి రెండవ కుమారులు డా.బాలాంత్రపు రజనీ కాంతరావుగారి బహుముఖ ప్రతిభ సుప్రసిద్ధమూ, లోకవిదితమూను. ఇంక వేంకటరావుగారి అల్లుడు శ్రీ బుద్ధవరపు నాగరాజామాత్య కవి, నాటకకర్త. వేంకటరావుగారి మనుమడు, నళినీకాంతరావుగారి పెద్ద కుమారుడు శ్రీ బాలాంత్రపు కిరణ్ సుందర్ కవి, గాయకుడు, తాత్త్వికుడు. ఇది శ్రీ బాలాంత్రపు వేంకటరావుగారి సంక్షిప్త పరిచయం.

స్వస్తి ||

You may also like...

3 Responses

  1. సి.యస్ says:

    లేదురా నిదురలో లేదురా సుగతి,
    చూడరా కనువిప్పి చూడరా జగతి! అంటూ తెలుగు జాతిని తమ కవితా సుప్రభాతంతో మేల్కొలిపిన “బృందావన” కావ్య విహారులలో ఒకరైన శ్రీ బాలాంత్రపు వేంకటరావు గారిని గురించిన పరిచయం –భావ కవితాయుగపు తొలిరోజులను సింహావలోకనం చేసినట్లయింది. ‘ఏకాంత సేవ’ ఎంత గొప్ప గేయ కావ్యం! ప్రతి వాక్యమూ రసమయమే. బాల సాహిత్యంలో వారు చేసిన కృషి సామాన్యమైనది కాదు. ఆ రోజులలో చాలా బడులలో వీరు రాసిన కథలూ, పాటలూ పాఠ్యాంశలుగా ఉండేవిట. కాని తెలుగువారు కదా! అంతగా గుర్తింపు ఉండదు. ఏదైనా వారిని ఈ విధంగా మళ్ళీ గుర్తీ చేసినందుకు సంతోషం.

  2. Chaganty RamaRao says:

    Chaalaa manchi information. Appatloo naaku yeekanta seva loo padyaalu kanrhoopatham.

  3. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    వీవీ కృష్ణారావుకి
    దేవీకరుణాప్రదీప్త తేజోనిధికిన్
    జీవన్ముక్తున కివె స
    ద్భావన లర్పించుకొందు బాలాంత్రపు రే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *