సాహిత్యము-సౌహిత్యము – 22 : దంష్ట్రల మీద శంకరుడు తాండవ మాడెను రాము కైవడిన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
07—10—2017; శనివారము.

సాహిత్యము—సౌహిత్యము~22.

ఈ సంచికలో చాలా క్లిష్ట ప్రాసతో కూడిన సమస్యాపూరణం చూద్దాం!

దంష్ట్రల మీద శంకరుడు తాండవ
మాడెను రాము కైవడిన్ “.

దీనిని పూరించిన మహానుభావుడు సుప్రసిద్ధ కందుకూరి రుద్రకవి. ఆయన తన అపార సంస్కృతభాషా వైదుష్యంతో ఈ జటిలసమస్యని పూరించి అవధానపండితలోకంలో అమేయకీర్తిని ఆర్జించుకున్నారు. ఈ పద్యం ఉత్పలమాల ఛందస్సులో ఇవ్వబడింది.

రుద్రకవిగారి అజరామరపూరణ యిది:

రింష్ట్రహి ఏమిటన్ కరచు? ఋక్షము
లెక్కడ ఉండు? అంధకున్
సంష్ట్రను చేసె ఏ విభు డనంతరమం
దతడేమి చేసెనో
రుంష్ట్రఖిలాత్ముడైన లవు రూప మదే
గతినుండు? చెప్పుమా?
దంష్ట్రల, మీద, శంకరుడు, తాండవ
మాడెను, రాము కైవడిన్ “||

ఒకప్రక్క దుష్కరప్రాసలని అవలీలగా అధిగమించడమేకాకుండా, క్రమాలంకారప్రయోగంద్వారా ఈ పద్యంలో సమన్వయం సాధించబడింది. ప్రాస సమస్య బాహ్యమైన క్లిష్టత. దానిని భాషపై ప్రభుత్వంద్వారా పరిష్కరించిన కవివర్యులు, భావసమస్యకి క్రమాలంకారంద్వారా ౘక్కని సమాధానం సమకూర్చేరు. ఇప్పుడు సమన్వయాలు చూద్దాం!

రింష్ట్రహి ఏమిటన్ కరచు = కరిచే (లక్షణమున్న) పాము వేటితో కరుస్తుంది? = దంష్ట్రల(తో)
ఋక్షములెక్కడ ఉండు?=నక్షత్రాలు ఎక్కడుంటాయి? = మీద(ఆకాశంలో)
అంధకున్ సంష్ట్రను చేసె ఏ విభుడు = అంధకాసురుణ్ణి ఏ ప్రభువు ౘంపేడు? = శంకరభగవానుడు.
అనంతరమందతడేమిచేసెనో? = ఆ తరవాత ఆయన(శంకరుడు) ఏమి చేసేరు? = తాడవం చేసేడు(ఆడేడు).
రుంష్ట్రఖిలాత్ముడైన లవు రూపమదేగతినుండు?= రోషస్వభావం కలిగిన లవుడి రూపం ఎవరిలాగ ఉంటుంది?=రాము కైవడిన్ = రాముడిలాగ ఉంటుంది.

పరిపూర్ణ భావనా బలం, అకళంక పాండితీ ప్రతిభ, అపూర్వ సమయస్ఫూర్తి, శారదామాత అనుగ్రహం లేకపోతే ఇటువంటి సమస్యలని ఇంత అద్భుతంగా ఎవ్వరూ పూరింౘలేరు.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    చాలా కఠినమైన ప్రాసతో కూడిన సమస్య. పైగా బిందుపూర్వక మైనది. కవి వాగ్దేవిని ఉపాసించిన వాడు కాకపోతే, ‘పాదం’ నడవదు. ఇటువంటి పద్యాలు అరుదుగానే లభిస్తాయి. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  2. Kasu says:

    Chaala baagundi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *