శారదా సంతతి — 12 : శ్రీ చాగంటి శేషయ్యమహోదయులు

శ్రీశారదా కారుణ్య కామధేనువు :—
01—10—2017; ఆదివారం

శారదా సంతతి — 12.

శారదాప్రియతనయుడు — శ్రీ చాగంటి శేషయ్యమహోదయులు.

తెలుగు సాహిత్యంతో గాఢసాన్నిహిత్యం కలిగినవారందరికి “ఆంధ్రకవితరంగిణి” తో అంతో-ఇంతో స్నేహం-అంటే companionship- ఉండడం అరుదైన విషయం కాదు. ఈ మహాగ్రంథ రచయిత శ్రీ చాగంటి శేషయ్యగారు. వారి తండ్రి కృష్ణయ్యగారు, తల్లి సుబ్బమ్మగారు. వారి తల్లి-తండ్రులకి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడబిడ్డలు. పెద్దకొడుకు శ్రీ అనంతరామయ్యగారు. రెండవకొడుకు శ్రీ శేషయ్యగారు. శ్రీ శేషయ్యగారు 23—7—1883 వ తేదీన వల్లూరులో జన్మించేరు. వారి తల్లి సుబ్బమ్మగారు పట్టమట్టవారి ఆడపడుచు. పట్టమట్టవారివంశ మూలపురుషులు, శ్రీ పట్టమట్ట సరస్వతీసోమయాజివర్యులు “పృథుచరిత్ర” ని రచించిన మహాత్ములు. శేషయ్యగారు సంస్కృతము, తెలుగు గురుముఖతః అభ్యసించేరు. ఆంగ్ల, బెంగాలీ భాషలు వారు కేవలమూ స్వయంకృషితో నేర్చుకున్నారు. కొంతకాలం నిడదవోలులోను, ఆ పైన కపిలేశ్వరపురంలోను వారు ఉన్నారు. శ్రీ కొవ్వూరి చంద్రారెడ్డిగారి ప్రాపకంలో నిడదవోలులో వారు అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యకలాపాలు దక్షతతో నిర్వహించేరు.

1911లో “ఆంథ్ర ప్రచారిణీ గ్రంథమాల“ని నిడదవోలులో రెడ్డిగారి సహాయసహకారాలతో, మరికొందరు బంధు-మిత్రుల ప్రేరణతోను శేషయ్యగారు స్థాపించేరు. వారు స్థాపించిన ఈ సంస్థ పురోభివృద్ధి కోసం బంకించంద్ర ఛటర్జీ రచించిన “దుర్గేశనందిని“, “నవాబునందిని“, వంగభాషాగ్రంథాలని ఆంధ్రీకరించి ఈ సంస్థ పేరున ప్రచురించేరు. ఆ రోజులలో ఆ పుస్తకాలు ఎనలేని ప్రజాదరణని చూరగొని పునర్ముద్రణలు పొందేయి. ఈ ప్రోత్సాహంతో వారు స్వయంగా, “శ్రీ“, “రాధారాణి“, “శృంగారవల్లి“, “చంద్రసేనుడు“, “విశ్వప్రయత్నము” అనే నవలలు రచించి ప్రకటించేరు. వారి రచనలన్నీ ఆనాటి సులభగ్రాంథికభాషలోనే కూర్చబడ్డాయి. అప్పటి మధ్యతరగతి గృహిణులు హాయిగా చదువుకోవడానికి అనువైన మనోహరశైలిలో ఉన్న గ్రంథాలవి.

ఆనాటి మధ్యతరగతి తెలుగువారిలో, ముఖ్యంగా గృహిణులలో గ్రంథపఠన రుచిని కలిగించడంలోను, ఆ అభిరుచిని పెంపొందించడంలోను వారి రచనలు ప్రతిభావంతమైన ప్రభావపాత్రని సమర్థవంతంగా పోషించేయి. ఇంతటి సువ్యవస్థిత సాహిత్యసేవ వారి జీవితానికి ఒక ప్రధానపార్శ్వం మాత్రమే. ఐతే వారి సాహిత్యసేవకి “ఆంధ్ర కవితరంగిణి” మకుటాయమానమైనది. ఆ గురుతమకార్యం ఒక వ్యవస్థమాత్రమే చెపట్టవలసినదే కాని ఒక వ్యక్తికి అందుబాటులోవుండే విషయమేమీ కాదు. ఐతె వారు శారదా ప్రియతనయులు. కారణజన్ములు. బాహ్యంగా వారు వ్యక్తిరూపంలోవున్నా, ఆంతరికంగా వారు శ్రీశారదాశక్తిపూరిత వ్యవస్థ. కందుకూరి వీరేశలింగంగారు, గురజాడ శ్రీరామమూర్తిగారు మొదలైన వారు రచించిన ఆంధ్రకవిజీవితకథలు ఇంచుమించు 350 మందికి పరిమితంఅయ్యేయి. కాని శేషయ్యగారి రచనలో సూమారు 1300 తెలుగుకవుల చరిత్రలు చోటుచేసుకున్నాయి.

ఇంక వారి లౌకిక ఉద్యోగం ఆయనయొక్క ప్రత్యేకప్రతిభారంగానికి తెరని తీస్తుంది. వారు కపిలేశ్వరపురం సంస్థానాధీశులు శ్రీ శ్రీబలుసు సర్వారాయ బహద్దరు వారి దివాణంలో సచివులుగా తమ పదవిని పరిపూర్ణ దక్షతతో నిర్వహించేరు. దివాణం ఎస్టేటుకిచెందిన న్యాయవ్యవహారాలు పరిశీలించేసందర్భంలో భారతీయ న్యాయశాస్త్ర అంశాలని కూలంకషంగా అధ్యయనం చేసేరు. “హిందూ లా” (సమష్టి కుటుంబ వ్యవస్థ ౘట్టము) ని, మదరాసు కో-ఆపరేటివ్ ఏక్ట్ ని, తెలుగుచేసేరు. ఈ అనువాదాలకి ఆ రోజులలో పూర్తి ప్రామాణికత ఉండేది. 1930—40 లలో “లోకల్ బోర్డ్ ” అనే మాసపత్రికని గ్రామపంచాయతీల ప్రయోజనార్థం స్వయంసంపాదకత్వం లో నిర్వహించేరు. స్థానిక స్వపరిపాలన- Local self-government- భావన గ్రామప్రజల పంచాయతీలలో చక్కగా పాదుకోవడానికి ఈ పత్రిక తోడ్పడింది. వారు ఎస్టేటు న్యాయవ్యవహారాల పరిష్కారానికి అప్పటి మదరాసు హైకోర్టుకి వెళ్ళవలసివచ్చినపుడు జమీందారీ న్యాయవాదులైన అల్లాడి కృష్ణస్వామి అయ్యరు, పప్పు సోమసుందరం వంటి గొప్ప న్యాయవాదులని కలిసేవారు. ఆ సమయాలలో కోర్టుకి సమర్పించవలసిన పత్రాలకి తగిన డ్రాఫ్టుని తానే తయారుచేసి వకీలుగారికి యిచ్చేవారట. వారి దస్తూరి, వారి ఆంగ్లభాషశైలి గమనించి అల్లాడివారు ఆశ్చర్యంతో ఆనందించే వారట. వారి ప్రతిభా-పాటవాలకి ముగ్ధులైన అల్లాడివారు వెంకటగిరి ఎస్టేటుకి శేషయ్యగారిని దివానుగావెళ్ళడానికి ప్రోత్సహించేరుట. మదరాసు కోర్టువ్యవహారాలకి వెళ్ళిన సందర్భంలోనే వారు వీలుచూసుకుని తంజావూరు సరస్వతీమహలు ప్రాచీన లిఖితపుస్తకభాండాగారాన్ని దర్శించి అక్కడ తనకి కావలసిన ప్రాచీనకవుల వివరాలని నకలువ్రాసుకుని తెచ్చుకునే వారట.

ఈ విధంగా వారు అనేకరంగాలకి శారదాదత్తమైన తమ ప్రజ్ఞాప్రాభవాలని చిరస్మరణీయంగా అంకితంచేసి 73 ఏళ్ళ వయస్సులో భువినివిడిచి దివికి చేరేరు. 1956 వ సంవత్సరంలో ఆయన తెలుసుకున్న ఒకరోజున అన్ని ఏర్పాటులూ చేయించి, ఎవరెవరికి ఏమేమి చెప్పాలో అవన్నీచెప్పి అందరివద్ద వీడ్కోలు తీసుకుని తమ పెరటిలో పరిపించుకున్న తాటాకుచాపమీద శయనించి  తన ఉపాస్యదైవధ్యానమగ్నులై దేహాన్ని స్వసంకల్పంగా పరిత్యజించిన పూర్ణపురుషవరిష్ఠులు, శ్రీ చాగంటి శేషయార్యమహోదయులు. వారు స్వయంగా మా పిన్నిగారి మామగారు. వారి మూడవకుమారుడు శ్రీ చాగంటి గోపాలకృష్ణమూర్తిగారు “హేమమాలి” కావ్యకర్త. పైన సమర్పించబడిన వివరాలకి మాడా. పోచిరాజు శేషగిరిరావుబాబయ్య గారి “శారదామంజీరాలు” ముఖ్య ఆధారం. కొన్ని విషయాలు నేను స్వయంగా మా కుటుంబాలలో పెద్దలద్వారా విన్నవి, ఇక్కడ పొందుపరిచేను.

శ్రీ చాగంటి శేషయార్యులవారి “ఆంధ్ర కవి తరంగిణి” మహాగ్రంథం గురించి పెద్దలు అన్న కొన్ని మాటలు ఈ దిగువ పొందుపరచడం జరిగింది.:—

“కవి జీవిత చరిత్రకారులు అడుగు పెట్టలేని గహనములలో వీరు రాౘ బాటలు వైచినారు”.
—  ఆచార్య శ్రీ పింగళి లక్ష్మీకాంతం.

“కల్హణుని ‘రాజ తరంగిణి’ ని గుర్తు చేయుచున్నది”.
—ఆచార్య శ్రీ రాయప్రోలు సుబ్బారావు.

“శాస్త్రీయపద్ధతిలో కవుల చరిత్రలు వ్రాసినది వీరే”!
—డా. కట్టమంచి రామలింగారెడ్డి.

“కవి జీవితచరిత్రకు సూత్రకారులు కందుకూరివారైతే, చాగంటివారు భాష్యకారులైనారు”.
—శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి.

శ్రీ పి.వి.రాజమన్నారు, శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ మొదలైన విశ్వవిఖ్యాతప్రజ్ఞావంతులు తమ అమూల్య అభిప్రాయపరంపరలతో “ఆంధ్రకవితరంగిణి”ని ఉచితరీతిలో వసివాడని పూలపల్లకిలో ఊరేగించి సత్కరించేరు.

చాగంటి శేషయ్యగారు మా చిన్న తాతగారు. వారికి మనుమలమైన మేము అందరము ఎన్నో జన్మల పుణ్యఫలంగా వారికి మనుమలమయ్యే యోగ్యతని పొందేము. వారియందు మా భక్తిని ఈ శ్లోకంలో సమర్పించుకుంటున్నాము. :—

చాగంటి శేషయార్యాయ
ప్రజ్ఞాsనేక మనీషిణే |
శారదా ప్రియ పుత్రాయ
చాస్మాకం దండవత్ నమః” ||

శ్రీశారదాదేవి ప్రియ పుత్రులును, బహుముఖ ప్రతిభా సంపన్నులును, ఐన శ్రీ చాగంటి శేషయ్యగారికి మా అందరియొక్క సాష్టాంగ ప్రణామం సమర్పించుకుంటున్నాము“.

స్వస్తి ||

You may also like...

6 Responses

  1. Dakshinamurthy M says:

    కొత్త పరిచయం బాగుంది
    ధన్యవాదములు..

  2. సి.యస్ says:

    చాలా సమగ్రంగా స్వర్గీయ శ్రీ చాగంటి శేషయ్యగారి జీవిత చిత్రాన్ని, కళ్ళకు కట్టినట్టుగా మాముందుంచావు. చదువుతోంటే చిన్ననాటి, రామచంద్రపురంలో రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆరోజులలో ‘ఆనందతీర్థ ప్రెస్ ‘ లోనూ, మీ అందరిళ్ళల్లోనూ ఆయన రాసిన నవలలతో పాటు ‘ఆంధ్రకవి తరంగిణి’ బీరువాల్లో కనపడేవి. తరువాతి తరంలో కవుల చరిత్ర ఎవరు రాసినా, వారికి ఆంధ్ర కవితరంగిణే ఆధారం.(ఆరుద్రతో సహా) నీ రచనా విధానం చదవడానికి ఆసక్తికరంగా ఉంది.

  3. Srinivas says:

    Chala kalam taruvatha tatagarigurinchi maa bamma gurinchi chaduvutomte chala anandamga vundi chaganty srinivas

  4. M.V. lakshmanarao says:

    Asesha prajnavantulaina Sri Chaganti seshaiah gari Jeevitha visheshalu vari rachanala Pai peddalu, vidyamsula matalu ento spurtini santoshanni Kaluga chesai. Inta auinnatyamaina varasatyvam kaligi undatam chala adrustam.
    Vari nunchi Bhavi taralavaru ento nerchukovalsi vundi.

  5. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    _/\_.

  6. Chaganty Srinivas says:

    Tata garini mariokkasari eeroju gurthu chesukunnanu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *