సాహిత్యము-సౌహిత్యము – 21 : వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
30—09—2017; శనివారము.

సాహిత్యము—సౌహిత్యము~21.

ఈ వారం “నాయన” గా సుప్రసిద్ధులైన గణనాయక వర పుత్రులు, గణేశాంశ సంభూతులు ఐన శ్రీ కావ్యకంఠ గణపతిమునివర్యుల సంస్కృత సమస్యాపూరణాలు రెండు చెప్పుకుందాం! ఆయన 14 సంవత్సరాల ప్రాయంలోనే సంస్కృతంలో ఆశువుగా కవిత్వం చెప్పేవారు. వారు నవయౌవనంలో ఉండగా బెంగాలురాష్ట్రంలోని “నవద్వీపం” వెళ్ళేరు. సంస్కృతవిద్వత్తుకి నవద్వీపం ఒక పేరుపొందిన ఊరు. అక్కడి పండితపరిషత్తు వారికి కొన్ని పరీక్షలు పెట్టింది. ఆ పరీక్షలలో భాగం ఐన రెండు సమస్యలు మనం నేడు చర్చించుకుందాం!

1. మొదటి సమస్య:—

వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి” ||

“ఏడాదికి ఒకసారి పార్వతీదేవి తన భర్తముఖం చూడదు” అని ఈ సమస్యకి అర్థం. ఇది ఆదిదంపతుల అన్యోన్య ఆత్మీయ అనురాగ బంధానికి, వారి దాంపత్యనిర్వహణ ధర్మంద్వారా లోకాదర్శానికి భంగం కలుగుతోంది. దానిని గణనాయక అంశతో పుట్టిన గణపతిమునిగారు సమన్వయించాలి. ఎందుకంటే వారి వలననే వారి అసలు తలిదండ్రులైన గౌరీశంకరుల మధ్య ఈ “పొరపొచ్చం”గా కనిపిస్తున్న చిక్కు ‘సమస్య’ తలెత్తింది. లేక గౌరీదేవిని పతిముఖం నుంచి తలతిప్పుకునేలాగ అంటే విముఖురాలిగా చేస్తోంది. పైగా ప్రతి సంవత్సరమూ ఈ సమస్య తలెత్తి, ఆదిదంపతుల “శబ్దార్థ” తుల్యమైన అన్యోన్యతని తలదించుకునేలాగ చేస్తోంది. దానికి కారణం గణపతే కనక వారు సమస్యాపూరణం ఇలా చేసేరు:—

భాద్రశుద్ధ చతుర్థ్యాం తు
చంద్ర దర్శన శంకయా |
వత్సరస్యైకదా గౌరీ
పతి వక్త్రం న పశ్యతి” ||

“భాద్రపదశుద్ధ చతుర్థి రోజున ‘వినాయక ౘవితి’ పండగ. ఆ రోజు చంద్రదర్శనం చేస్తే దోషం. అందువల్ల గౌరీదేవి శఙ్కరముఖం చూస్తే ఆయన తలపై ప్రకాశించే చంద్రుడిని చూడవలసివస్తుందేమోననే శంకతో ఏడాదికి ఒకసారి భర్త ముఖంవైపు చూడదు”.

ఇంక రెండవ సమస్యని చూద్దాం! దీనిలో అశ్లీలత ఉంది. దానిని తొలగించి, పతివ్రతాధర్మపరంగా ఈ సమస్యని పూరించాలి.

2. “స్తన వస్త్రం పరిత్యజ్య వధూః
శ్వశురమిచ్ఛతి” ||

“వక్షస్థలంమీది పైటని తొలగించి కోడలు మామగారిని కోరుకుంటోంది (లేక ఆహ్వానిస్తోంది)” అని ఈ సమస్య అర్థం.

సమస్యాపూరణం:—

హిడింబా భీమదయితా
నిదాఘే ఘర్మ పీడితా |
స్తన వస్త్రం పరిత్యజ్య
వధూః శ్వశురమిచ్ఛతి” ||

“భీముని భార్య హిడింబ(రాక్షస స్త్రీ). వేసవికాలంలో ఉక్కపోతకి తట్టుకోలేక తన పైటని తొలగించి గాలికోసం (మామగారైన వాయుదేవుడికోసం) ఎదురు చూస్తోంది లేక సతమతం ఔతోంది అంటే గాలిని కోరుకుంటోంది”.

ఇంత అందంగా రెండు సమస్యలు పూరించి నవద్వీప పండితుల మన్ననకి యువగణపతివర్యులు పాత్రులయ్యేరు.

స్వస్తి ||

You may also like...

6 Responses

  1. Devi says:

    Very beautifully said by Sri Ganapathi Muni. But I only know about Him as connected to Sri Ramana n Arunachala.But u have told us today of his poetic genius.Happy to know this.

  2. Chaganty RamaRao says:

    Mahaanu bhaavudee alaa puurincha galadu.

  3. సి.యస్ says:

    కావ్యకంఠ గణపతి మునివారు బహుముఖ ప్రజ్ఞావంతులు. ఆయన జీవిత చరిత్ర చాలా రసవంతంగా ఉంటుంది. వీరు సంస్క్రతాంధ్ర భాషలలో అసమాన ప్రతిభావంతులు. ఇక్కడ ఉదహరించిన సమస్యా పూరణలు వారి కవితా స్వారస్యాన్ని తెలియజేస్తున్నాయి. రెండవ సమస్యని పూరించడంలో సద్యఃస్ఫూర్తి, చమత్కారం గోచరిస్తున్నాయి.

  4. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    బావుంది. ‘వాగర్థా వివ సంపృక్తౌ…’

  5. Nishanth says:

    It is said that when nayana went for an interview in Varanasi university,VC of the university was ambica dutta.the legend goes nayana on being pestered by him came out saying,tvam dattah,aham ourasaha

  6. Nishanth says:

    Above story courtesy of Dr SrinivaS sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *