సాహిత్యము-సౌహిత్యము – 20 : అన్నను భర్తగా గొనిన అన్నులమిన్న అదృష్ట రాశియే
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
23—09—2017; శనివారము.
సాహిత్యము—సౌహిత్యము~20.
ఈ వారం సమస్యాపూరణం సహజ ప్రజ్ఞావంతులైన శ్రీ పి. యస్ . ఆర్ . ఆంజనేయప్రసాద్ గారిది. వారికి ఇవ్వబడిన సమస్య ఇది:—
“అన్నను భర్తగా గొనిన అన్నులమిన్న
అదృష్ట రాశియే“! ||
“అన్నగారిని పెళ్ళిచేసుకుని అతడిని పెనిమిటిగా పొందిన అందమైన ఆడది భాగ్యవంతురాలు” అని దీని భావం. ఇది ఉత్పలమాల వృత్తపాదం. అవధానివర్యులు ఎంత చక్కగా సమస్యని పూరించి దీనీలోవున్న అనుచితభావాన్ని ఎలాగ సముచిత సుందర అర్థాన్నిచ్చే పద్యంగా మలచి సభాగౌరవానికి అక్షరనీరాజనం అర్పించేరో గమనిద్దామా?
“పన్నుగ పార్వతీ రమణి పాపము!
భర్తగ బిచ్చగాడు సాం
బన్నను పొందె; — కాననము పాలయి
కష్టములందె మున్నురా
మన్నను పొంది సీత; — జగమందున
పూజలులేని వాని బ్ర
హ్మన్నను పొందె వాణి, అని అన్నివిధంబుల ఈ యుగమ్ములో
ఎన్నిక గన్నవాడనుచు ఇంతుల
మేలలమేలుమంగ వెం
కన్నను భర్తగా గొనిన అన్నులమిన్న
అదృష్టరాశియే“!
“ఒప్పులకుప్ప, అందాలరాశి ఐన పార్వతీదేవి, పాపం ‘ఆది భిక్షువు’ ఐన శివన్నని పతిగా పొందింది. పూర్వం రామన్నని పెళ్ళిచేసుకుని సీతాదేవి అడవులపాలై కష్టాలు అనుభవించింది. సరస్వతీదేవి లోకంలో పూజలులేని బ్రహ్మన్నని భర్తగాచేసుకుంది. ఈ పూర్వవివాహాలలో రకరకాల
బాధలనుభవించిన గృహిణుల చరిత్రలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి స్త్రీలలో శ్రేష్ఠురాలైన అలమేలుమంగమ్మ కలియుగంలో అన్ని విధాలుగాను ఉత్తమవరుడుగా నిశ్చయించుకుని ఏడుకొండల ఏలిక ఐన “వెంకన్నస్వామి” లేక “ఎంకన్నసామి”ని పతిగా పరిగ్రహించి పరమభాగ్యవంతురాలయ్యింది”.
“అన్నుల మిన్న” అంటే సామాన్యార్థం, స్త్రీలలో గొప్పది అని. “భార్యలలో శ్రేష్ఠురాలు” అని విశేషార్థం.
ఈ ఉత్పలమాల “షట్పది” గా కూర్చబడింది. అంటే ఈ పద్యానికి ఆరు పాదాలున్నాయి. సామాన్యంగా పద్యాలు “చతుష్పదులై” ఉంటాయి. అంటే నాలుగు పాదాల కూర్పుతో ఉంటాయి. కాని దాటరాని విధి ఏమీ కాదు. అవసరాన్నిబట్టి నాలుగుకి తగ్గకుండా ఎన్నిపాదాలైనా పెట్టుకోవచ్చు. ఉదాహరణకి మన తెలుగు సాహిత్యంలో “ఉత్పలమాలిక”, “చంపకమాలిక”, మొదలైన మాలికాప్రక్రియలో12 లేక 16 మొదలైన పద్యపాదసంఖ్యలో అనేకకవులు సందర్భానుసారంగా పద్యాలుకూర్చడం అరుదు కాదు.
స్వస్తి ||
Baagundi puuranam
పద్యం నడకలో మంచి లయ ఉంది. పూరణ అలా ఉండడం వల్ల అవధానికి చివర ధారణ సులువవుతుంది. ‘ అన్న’ ను సమర్థించుకోడానికి ఏదో ఒక అన్న చాలు. కాని, అన్నన్న ! అవధాని గారు నలుగురిని పట్టుకొచ్చారు. చాలా అందంగా పూరించారు.
ఈ పద్యం” షట్పది”. అంటే ఆరు పాదాలున్న “ఉత్పలమాల”. పొరబాటున పంచపది అనడం
జరిగింది. శీర్షిక నిర్వాహకుడు క్షంతవ్యుడు.