సాహిత్యము-సౌహిత్యము – 18 : భార్యలు మువ్వురా పరమ పావనుడౌ రఘురామమూర్తికిన్
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
09—09—2017; శనివారం.
సాహిత్యము—సౌహిత్యము~18.
కళాప్రపూర్ణ డా. కొండూరి వీరరాఘవ ఆచార్యవర్యుల “సమస్యాపూరణం” ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. ఇది మన సుకృతం. “సాహిత్య, శిల్ప, యోగ శాస్త్రాలలో వారికిగల ప్రసిద్ధి లోకవిదితం” అని డా. ప్రసాదరాయ వర్యులు వారి “కవితా మహేంద్రజాలం” లో వీరరాఘవాచార్యుల ప్రతిభను గురించి మనకి వివరించేరు. ఈనాటి “సమస్య”, కవితా మహేంద్ర జాలంనుంచే మనం తీసుకున్నాం.
సమస్య:—
“భార్యలు మువ్వురా పరమ పావనుడౌ
రఘురామమూర్తికిన్ ” ||
“పరమపావనుడైన రఘురామునికి భార్యలు ముగ్గురు” అని దీని అర్థం. ఏ ప్రామాణిక రామాయణంలోనైనా ఏకపత్నీవ్రతం రామావతార ప్రధాన లక్షణాలలో ముఖ్యమైనది. మరి ఈ జటిల సమస్యని ఆచార్యవర్యులు ఎంత అందంగాను, అద్భుతంగాను పరిష్కరించెరో మహాకావ్యపాకంలో కూర్చబడి ఈ రమ్యపద్యంలో చూద్దాం!
“శౌర్యమెలర్ప రావణుని ౘంపి అయోధ్యకు పుష్పకమ్ముపై
భార్యను తమ్మునిన్ కలిసి భాను
కులాగ్రజుండు రా, మనో
హార్య విశిష్ట గీతముల హారతులిచ్చిరా
సోదరావళీ
భార్యలు మువ్వు, రా పరమపావనుడౌ
రఘురామమూర్తికిన్ ” ||
తాత్పర్యం:—
“గొప్ప శూరత్వంతో రావణోద్ధరణ చేసి పుష్పకవిమానం మీద భార్యసీత, అనుజుడు లక్ష్మణుడు తోడురాగా అయోధ్యకి విచ్చేసిన పరమపవిత్రుడైన రఘురాముడికి,మనోహరమైన మంగళహారతి పాటలు పాడుతూ, అతడి ముగ్గురు తమ్ముల “భార్యలు మువ్వురు” ( ఊర్మిళ, మాండవ్య, శ్రుతకీర్తి), మంగళహారతులు సమర్పించేరు” ||
ఇటువంటి సమస్యాపూరణాల అందచందాలు పదికాలాలపాటు మన మదిలో పదిలం చేసుకుందాం.తరతరాలకి తరగని ఈ సాహిత్య సంపదని మన తరువాత తరంవారికి అందించే పవిత్ర ప్రయత్నం
చేద్దాం||
స్వస్తి||
Chaalsa baagA puurinchAri
సమస్యలో ఉన్న స్వారస్యానికి చక్కని సన్నివేశం కల్పించుకుని,సమర్థవంతంగా పూరణ చేసిన కవిగారి సమయస్ఫూర్తికి జోహార్లు.ఈ శీర్షిక చాలా ఆసక్తిదాయకంగా నడుస్తోంది