సాహిత్యము-సౌహిత్యము – 17 : అమ్మకు కూడ భార్య కల దామెను ఏమని పిల్వగా తగున్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
02—09—2017; శనివారం.

సాహిత్యము—సౌహిత్యము–17.

ఈ సారి డా.మొవ్వ వృషాద్రిపతిగారి సమస్యాపూరణం మన విషయం. వృషాద్రిపతిగారు గొప్ప విద్వత్కవి. పద్యాన్ని శ్రావ్యంగా ౘదవడంలో దిట్ట. మంచి నటులు. సాహిత్యవ్యాఖ్యానకళలో అందెవేసినచేయి. చక్కని వక్త. ఆదర్శ అధ్యాపకులు, స్నేహశీలి. ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞావంతులు. వారికివ్వబడిన క్లిష్ట సమస్య యిది:—

అమ్మకు కూడ భార్య కల దామెను
ఏమని పిల్వగా తగున్ “?

ఇప్పుడు సమర్థవంతమైన సమస్యా పూరణని పరికిద్దాం!

ఇమ్ముగ మోహినీతనువు నెత్తిన
శ్రీపతికిన్ పురారికిన్
సమ్మతి ఆత్మజుం డయిన స్వామి-
అయప్ప స్వమాతకై వికుం
ఠమ్మునకేగి శ్రీ, నలిననాభుల గాంచి
తలంచెనిట్లు మా
అమ్మకు కూడ భార్య కలదామెను
ఏమని పిల్వగా తగున్ ? (వలెన్ ?)“.

పద్యభావం గ్రహిద్దాం.

“మనోజ్ఞమైన మోహినీదేవిగా అవతరించిన మురారి(హరి)కి,  పురారి(శివుడు)కి పరస్పరప్రీతి కలగడం వలన వారిరువురికి స్వామి అయ్యప్ప ఉదయయించేడు. స్వామివారికి వారి తల్లిని చూడాలనిపించి వైకుంఠం వెళ్ళేరు. తన తల్లి ఐన శ్రీహరికి అక్కడ లక్ష్మీదేవి భార్యగా ఉంది. ఆ సన్నివేశం చూడగానే అయ్యప్పస్వామివారు తనలో ఇలా అనుకుంటున్నారు:
‘హరహరీ! ఇదేమి సమస్య? మా అమ్మకికూడా భార్య ఉందే! ఈమెని ఇప్పుడు నేను ఏమని పిలవాలి’?“.

జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న పురాణకథ ఆధారంగా ఎంతఅందంగా వృషాద్రిపతిగారు ఈ సమస్యని పూరించేరో చూడండి. చక్కని ఔచిత్యం. పెద్దనాదుల కవిత్వ నిర్మాణం
వంటి పొంకమైన పద్యం పోకడ! పవిత్రతతో కూడిన సుకుమారభావన. ఇటువంటి శారదాతనయులమధ్య మనం ఉండగలగడం మన సుకృతం.

స్వస్తి||

You may also like...

3 Responses

  1. సి.యస్ says:

    సమస్యలో ఉన్న చమత్కారానికి తగినట్టుగా సరైన అంశం స్వీకరించి ఎంత అందమైన పూరణ చేసారు కవిగారు! పద్యపు నడక నువ్వు చెప్పినట్లు ప్రబంధకవుల పోకడని తలపిస్తోంది.ముందుముందు మరిన్ని మంచి సమస్యలని ప్రేషణం చేయగలవని ఆశిస్తున్నాను.

  2. Nishanth says:

    This was also given In Sanskrit by Sri appayya dikshithar.in vijayanagara at that time there was temple of Sri Ayyappa where he sits with a finger on his lip.legend was that if somebody could tell the reason for it, correctly,he would come to his normal position.tathacharyulavaru being a little narrow in his thinking,gave the Poorna as ,being born to mahavishnu, I am the heir to vaikunta then why should I be burdened with this bhootanatha post.the idol was unmoved.sri appayya Dikshitulu varu gave the solution akin to the above poem and lo behold Ayyappa Swamy assumed his normal posture.this was recounted by mahaswami varu in his lectures.

  3. వ.వెం.కృష్ణరావు says:

    డా. నిశాంత్ అందించిన ఈ ౘక్కని సమాచారము చాలా కుతూహలదాయకమూ, ఎంతో సంతోషదాయకమూ ,
    రమ్యంగానూ వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *