శారదా సంతతి — 7 : వేములవాడ భీమకవివర్యుడు
శ్రీశారదా కారుణ్య కౌముదీ :—
27—08—2017; ఆదివారం.
శారదా సంతతి—7.
దక్షారామ భీమేశ్వర వరపుత్రుడు— వేములవాడ భీమకవివర్యుడు:—
నేను నాగపూర్ లో ౘదువుకునే రోజులలో కడియం గ్రామానికిచెందిన భూస్వామి శ్రీ శేషగిరిరావుగారు నాకు మిత్రులయ్యేరు. వారు డా. రావూరి దొరసామిశర్మగారు రచించిన “తెలుగులో తిట్టు కవిత్వము” పుస్తకం నాకు కానుకగాయిచ్చేరు. ఇది 1972 నాటిమాట! ఆ గ్రంథం మొదటిపుటలో యిలావ్రాసేరు.
“మీరు ఈ పుస్తకం తెరిచినప్పుడైనా మీ స్మృతిపథంలో మెదలాలని ఆశిస్తూ—శేషగిరిరావు”
నేను ఈ రోజు వ్రాస్తూన్న ఈ విషయం వారిదృష్టికి వెళ్ళగలిగితే బాగుంటుంది. ఈ రోజు వ్రాసేవిషయానికి ఆ గ్రంథం కూడా కొంత సహాయపడింది. అందువల్ల ఈనాటి ఈ రచనకి శ్రీ శేషగిరిరావుగారి పరోక్షసహాయం కొంతవుంది. వారికి, శ్రీ దొరసామిశర్మగారివంటి అనేకపండితశ్రేష్ఠులకి నా హార్దధన్యవాదాలు. ఇప్పుడు అసలు విషయంలోకి అడుగిడదాం!
వేములవాడ భీమకవి దక్షారామక్షేత్ర భీమేశ్వరస్వామివారి వరఫలంగా ఒక వితంతువు(widow)కి జన్మించేడు. అందువల్ల చిన్నతనంలో అతడు అవమానాలు పొందేడు. ఒకసారి వారి ఊరిలో ఒక పెద్ద బ్రాహ్మణకుటుంబంలో “చయనం” అనబడే విశేషవైదికవిధిని నిర్వహించేరు. చిన్నపిల్లవాడైన భీమన్న తన స్నేహితులతో వారింటికి తరలి వెళ్ళేడు. భీమన్నంటే యజమానికి చులకన. అందువల్ల
వారిని రానిస్తే కార్యక్రమగౌరవానికి భంగమని భీమనతోసహా పిల్లలందరినీ బయటకి వెళ్ళగొట్టేరు. శాపానుగ్రహసామర్థ్యాన్ని భీమేశ్వరుని నుంచి వరంగాపొందిన భీమన్నకి వారి చర్య కోపాన్ని కలిగించింది. చిన్నపిల్ల వాడైన భీమన్నకి, బ్రాహ్మణుల అరటి ఆకులలో వడ్డించబడిన అప్పాలు, అన్నం, పప్పు, కూరలు చూసేసరికి, అసలే ఆకలితోవున్నాడేమో, నోరూ ఊరింది, కోపమూ వచ్చేసింది. వెంటనే
ఆ కోపం శాపమై పద్యరూపం ఇలాగ బైటపడింది:—
“గొప్పలు చెప్పుకొంచు నను కూటికి
పంక్తికి రాకుమంచు ఈ
త్రిప్పుడు బాపలందరును తిట్టిరి
కావున ఒక్కమారు ఈ
అప్పములన్ని కప్పలయి అన్నము
సున్నముకాగ మారుచున్
పప్పును శాకముల్ పులుసు పచ్చడులున్ చిరురాళ్ళు కావుతన్ ”
అని భీమన శపించేడు. అంటే అర్థం:—
“బ్రాహ్మలంతా వారు గొప్పవాళ్ళని చెప్పుకుంటూ నన్ను “పంక్తి బాహ్యుడు” అని తిట్టి భోజనం చెయ్యనివ్వలేదు. అందువల్ల వెంటనే విస్తర్లలో వున్న అప్పాలన్నీ కప్పలుగాను, అన్నం సున్నంగాను, పప్పు-కూర మొదలైన పదార్థాలన్నీ చిన్న రాళ్ళుగాను మారిపోవుగాక!”
భీమన్న మాటకి తిరుగులేదు. ఆయన భీమేశ్వరుని కొడుకు. స్వామివారు భీమన్నకి అటువంటి వరం యిచ్చేరు.అందవల్ల అతడిశాపమహిమవలన బ్రాహ్మణుల విస్తరాకులలోని అప్పాలు కప్పలైపోయి బెకబెకమంటూ గెంతసాగేయి. అన్నమంతా సున్నమైపోయింది. మిగిలిన పదార్థాలన్నీ రాళ్ళైకూచున్నాయి. వెంటనే ఇంటి యజమాని భీమన్నని కాళ్ళావేళ్ళా వేడుకుని పిల్లలందరినీ సగౌరవంగా
భోజనానికి పిలిచి, భోజనద్రవ్యాలన్నీయథాపూర్వంగా చేయమని ప్రార్థించేడు. భీమన్నకి దయకలిగింది. వెనువెంటనే యజమానిని అనుగ్రహిస్తూ ఈ పద్యం చెప్పేడు:—
“ఘనుడీ వేములవాడ వంశజుడు
దాక్షారామ భీమెశనం
దనుడీ భీమన యంచు గుర్తెరిగి
నిందల్మాని నన్ గౌరవం
బున ఈ విప్రులు చూచిరందువలనన్
పూర్వస్థితిన్ చెంది భో
జనవస్తుప్రకరంబులన్నియు యథా
స్వస్థంబులౌ కావుతన్ “!
“భీమేశ్వరస్వామి పుత్రుడైన ఈ భీమన గొప్పవాడని తెలుసుకుని, నిందలు మానివేసి నన్ను ఈ బ్రాహ్మణులు గౌరవించేరు. అందువల్ల విస్తర్లలో వడ్డించబడిన భోజనపదార్థాలన్నీ మొదట్లోవున్నట్లే వాటి సహజరూపాలు పొందుగాక“!
అనగానే అవన్నీ మామూలు భోజన పదార్థాలుగా ఐపోయేయి. అక్కడినుండి అందరూ భయంవల్లో, భక్తిచేతో భీమన్నని లోకువగా చూడడం మానివేసి, “భీమకవి” అని గౌరవంగా పిలవడం ప్రారంభించేరు.
పెద్దవాడయ్యేక భీమకవి చాళుక్యచొక్కరాజుని దర్శించడానికి వెళ్ళేడు. తన ప్రతిభని, వాక్ప్రభావాన్నివివరించేడు. రాజు అప్పటికి తన ఉద్యానంలో మల్లెపందిరికి ఉన్న దృఢమైన ఒక కర్రరాటకి కాళ్ళు
తన్నిపెట్టికూర్చుని భీమకవిని ఏమీ గౌరవించకుండా “మీ మాటకి అంతశక్తి ఉంటే ఈ ఎండిపోయిన పందిరిరాటని పచ్చటిచెట్టుగా మార్చండి” అన్నాడు. వెంటనే భీమకవి ఒకపద్యం చెప్పేసరికి ఆ రాట సకలపుష్ప,ఫలభరితమైన మహావృక్షం ఐపోయింది. కాని రాజు పాదాలు చెట్టులో ఇరుక్కుపోయి బయటకి రాలేదు. రాజు తనతప్పుకి పరితపించి భీమకవిక్షమని పొందగానే, కవి మరొకపద్యం చెప్పడంవల్ల రాజు తన పాదాలు మామూలుగాపొందేడు.
మరొకసారి రాజకళింగ గంగుకూడా ఇలాగే భీమకవిని అనాదరించగా భీమకవి కళింగరాజు 32 రోజుల అరజాములోపల తనరాజ్యం శత్రువులకికోల్పోతాడని శపించేడు. అది ఆవిధంగానే జరిగింది.
కళింగరాజు తనతప్పుతెలుసుకుని భీమకవి పాదాలు ఆశ్రయించి కవి అనుగ్రహం పొందేడు. కవి కరుణించి మీనమాసంలోని పౌర్ణమి తరువాత షష్ఠినాటికి రాజ్యం తిరిగిపొందాలని కళింగరాజుని ఆశీర్వదించగా, అలాగే జరిగిందని చరిత్ర చెపుతోంది.
ఈ విధంగా అనేక సందర్భాలలో భీమకవి శాపనిగ్రహానుగ్రహశక్తి రుజువైనట్లు చరిత్రబద్ధం చేయబడింది. ఇంకా చాలా వృత్తాంతాలువున్నా, స్థలాభావంవల్ల ఒకే ఒక సంఘటన చెప్పి ముగిస్తాను.
పోతరాజు అనే ఒక ‘పెద్దమనిషి’ ని చూడడానికివెళ్ళిన భీమకవికి, తను ఇంట్లోవుండికూడా, భార్యచేత లేడనిపించేడు. దానితో భీమకవి ఈ క్రింది పద్యంచెప్పి వెళ్ళిపోయేడు.
“కాటికి కట్టెలు చేరెను
ఏటావల గుంపుగూడి ఏడువసాగెన్
కూటికి కాకులు వచ్చెను
లేటవరపు పోతరాజు లేడా లేడా“!
“స్మశానానికి కట్టెలు చేరేయి. ఏటి అవతలిగట్టున వున్న స్మశానంలో గుంపుగాకూర్చుని పిండంకోసం వచ్చిన కాకుకులు ఏడుస్తున్నాయి. లేటవరపు పోతరాజు ఇంట్లోలేడా లేక అసలు ఈ లోకంలోనే లేడా!”
అనేసరికి, పోతరాజుభార్య లోపలికి వెళ్ళి చూచేటప్పటికి, పోతరాజు శవమై మంచంమీదపడివున్నాడు. లబోదిబోమని నెత్తీనొరూ మొత్తుకుని బయటవీధిలోసాగిపోతున్న భీమకవి పాదాలపై పడి శరణు వేడింది. భీమకవి హృదయం కరిగిపోయింది. వెంటనే ఆవేదనతో ఆయననోటివెంట ఈ పద్యం ప్రవహించింది:—
“నాటి రఘురాము తమ్ముడు
పాటిగ సంజీవిచేత బ్రతికినభంగిన్
కాటికి పోనీకేటికి
లేటవరపు పోతరాజ లెమ్మా! లెమ్మా“!
దీని భావం సులభంగానే అందరికీ అర్థం ఔతుందికనుక వ్రాయలేదు. భీమకవికి చెందిన చాలాపద్యాలు ఈ విధంగా చరిత్రప్రసిద్ధి పొందేయి. వారు రచించిన గ్రంథాలు అనేకమని చరిత్ర చెపుతున్నా, “కవిజనాశ్రయం” ఒక్కటీమాత్రం మనకి నేడు లభ్యం ఔతోంది. అది ఛందశ్శాస్త్రగ్రంథం. దాని కర్తృత్వవిషయంలో చరిత్రలో భిన్నాభిప్రాయాలుకూడా వున్నాయి.
స్వస్తి||
Bhhemakavi goppatanam aayanaku bheemeswaruni prasaadam gaa raavadam talapunaku techharu. Baagundi
‘నిండు మనంబు నవ్య నవనీత సమానము , పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము’ అని నన్నయ గారు చెప్పిన మాట వేములవాడ భీమకవి విషయంలో సరిగ్గా సరిపోతుంది.
భీమేశ్వర వర ప్రసాదుడైన ఇతను గొప్ప వాక్ శుద్ధి, వాక్ సిద్ధి ఉన్న
వాడని తెలియచెప్పే ఈతని జీవనచిత్రం బాగా చూపించావు.
చాటువుల ద్వారా చూచాయగా మాత్రమే తెలిసే ఈయన గాథ ఇంత వివరంగా ఈ ప్రేషణం వల్ల తెలిసింది.