సాహిత్యము-సౌహిత్యము – 16 : పతిని పరిత్యజించి ఒక భామ పతివ్రత అయ్యె ఇమ్ముగన్
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
26—08—2017; శనివారం.
సాహిత్యము—సౌహిత్యము~16.
ఈ సారి కవివర్యులు శ్రీ కావూరి పూర్ణచంద్రరావుగారు. ఆలిండియారేడియో, విజయవాడవారు, ఆహూతులైన ప్రేక్షకుల సమక్షంలో యివ్వబడిన సమస్య యిది:—
“పతిని పరిత్యజించి ఒక భామ
పతివ్రత అయ్యె ఇమ్ముగన్ “|
చంపకమాల వృత్తంలో యివ్వబడిన సమస్య యిది. పాదభావం ౘక్కగా తెలుస్తోంది. పతిని వొదిలిపెట్టి ఒకామె పతివ్రత అయ్యింది అని దీని భావం. ఈ భావంలో పరస్పర వైరుద్ధ్యం వుంది. దీనిని కవిగారు తొలగించి, నలమహారాజు-దమయంతీదేవి కథని ఆధారం చేసుకుని అందంగా సమస్యని పూరించేరు. పూరణం యిది:—
“మతి విభవంబులుట్టిపడ మాకు
సమస్యనొసంగినారు భా
రత ధరియిత్రిలోన నలరాజు మతిన్
తలపోసి యెవ్వరే
గతి వచియించినన్ వినక కమ్ర గుణాఢ్య తనంత పూర్వదిక్
పతిని పరిత్యజించి ఒక భామ
పతివ్రత అయ్యె ఇమ్ముగన్ ” ||
పద్యం మొదటి పాదంలో సమస్యనిచ్చినవారి తెలివితేటల ఘనత స్తుతించ బడింది. తరువాత మనోహరమైన గొప్ప గుణాలుకలిగిన(కమ్రగుణాఢ్య) ఒక యువతి(స్వయంవరంలో) ఎవరేమిచెప్పినా వినకుండా, తూర్పుదిక్కుకి అధిపతి(పూర్వ దిక్ పతి ఐన ఇంద్రుడిని కాదని (పరిత్యజించి) తనమనస్సులో అంతకుముందే తాను నిశ్చయించుకున్న నలమహారాజుని వరించింది” అని దీని భావం.
ఆ విధంగా వరించి వివాహమాడి ఆ తరువాత మనందరికీ తెలిసిన కథులోని కష్టాలన్నీ అనుభవించి స్వశక్తితో తన దాంపత్యాన్ని ౘక్కగా నిలబెట్టుకుని పతివ్రతగా శాశ్వత లోకప్రసిద్ధి పొందింది.
స్వస్తి||
సమస్య బాగుంటే అవధానానికొచ్చిన శ్రోతలు ఆ సమస్యనిచ్చిన వారిని మెచ్చుకుంటారు సాధారణంగా. ..అయితే ఇక్కడ ఆ మెచ్చుకోలు అవధానిగారే చేసి తెలివిగా ఒక పాదం పూర్తి చేసుకున్నారు. పతిని ‘దిక్పతి ‘ చేసి అవధానిగారు అందమైన పూరణ చేసేరు. అందరికీ తెలిసున్న సమస్యా పూరణలు కాక అరుదైనవి తెలియచేస్తోన్నందుకు వేయి మంగిడీలు.
Baagundi. Puuranam simple gaaa. Paadaala virupulu atukulee puuranaalu