కదంబకం — 9 : శ్రీ సి. రామచంద్ర (C.RamaChandra)

శ్రీశారదా కారుణ్య కౌముదీ  :—
27—08—2017; ఆదివారం.

కదంబకం—9.

శ్రీమాత చిన్మయ సంగీత వీచిక— శ్రీ సి. రామచంద్ర

హిందీ చలనచిత్రసంగీతదర్శక చక్రవర్తులలో రెండవతరానికి చెందిన పరిపూర్ణ సంగీత ప్రజ్ఞావంతులలో సి. రామచంద్ర ఒకరు. ఆయన వరసలు కట్టిన పాటలు కల్పతరుప్రసూనమకరంద ధారలు;
కామధేనుక్షీరకలశాలూను. వారు మహారాష్ట్రులు. పూర్తిపేరు:— “రామచంద్ర నరహర్ చితాల్కర్ ” |

కాని లోకంలో సంగీతకారునిగా ఐతే సి. రామచంద్రగాను, ప్లేబేక్ గాయకునిగా ఐతే చితాల్కర్ పేరుతోను సుప్రసిద్ధులయ్యేరు. ముంబైలో పేరుపొందిన శ్రీ విష్ణు దిగంబర్ పలూస్కర్ గారి “గాంధర్వ
మహావిద్యాలయ” లో వి.డి.పలూస్కర్ గారి ప్రముఖశిష్యులలో ఒకరైన శ్రీ వినాయకరావ్ పట్వర్థన్ వద్ద ఉత్తరభారతీయసంగీతం నేర్చుకున్నారు. వారు కథానాయకుడిగా నటించిన మూడుమరాఠీ చిత్రాలు పూర్తిగా దెబ్బతినడంతో నటనకి కొంత దూరమై సంగీతానికి దగ్గరయ్యారు. మినర్వా మూవీటోన్ వారి సంగీతదర్శకులైన బండుఖాన్ -హబీబ్ ఖాన్ ద్వయం వద్ద హార్మొనియం సహాయకునిగా కొంతకాలం పనిచేసేరు.
ప్రారంభంలో 2—3 తమిళచిత్రాలకి స్వతంత్రసంగీతరచన చేసేరు.  తరువాత మరాఠీ-హిందీ నటుడు భగవాన్ తోకలిసి పనిచేసేరు. అది దీర్ఘకాలస్నేహంగా కొనసాగింది. భగవాన్ “అల్భేలా” చిత్రం సర్వకాల
సంగీతచిత్రవిజయాలలో స్థిరస్థానం సంపాదించింది. దానిలోని గొప్పలాలి పాట ఐన “ధీరేసే ఆజారే” సృష్టి వెనుక చాలావిశేషమైన కథ జరిగింది.

ఒక సాయంత్రం 6 గంటల సమయానికి లాలిపాట రిహార్సల్ / రికార్డింగ్ అంధేరి లోని ఒక స్టూడియో ఏర్పాటు చెయ్యబడింది. ఆ కార్యక్రమానికి పాట వ్రాసిన కవి, రాజేంద్రకిషన్ నుంచి రామచంద్రకి
సాయంత్రం 4 గంటలకి పాటకాగితం అందింది. రామచంద్ర దాదర్ నుంచి అంధేరికి తన కారులో బయలుదేరేడు. ఒకచెయ్యి స్టీరింగుచక్రంమీద, మరొక చెయ్యిలో కాగితం వుంచి “పీలూ” రాగంలో పాటని స్వర-తాళబద్ధం చేస్తూ సమయానికి రామచంద్ర గమ్యంచేరేడు. అంత అలవోకగా సంగీతరచనచేసిన లాలిపాట భారతీయచలనచిత్రరంగంలో సుస్థిరంగా నిలిచిపోయింది. తెలుగులో ఈ పాట “నీలాల కన్నుల్లొ మెలమెల్లగ నిదుర రావమ్మ రావె! నిండారరావె“! అని పాలగుమ్మి పద్మరాజుగారి కలంలోంచి “నాటకాలరాయుడు” సినిమాకోసం పుట్టింది.

అలాగే “పర్ఛాయి” చిత్రంకోసం బాగేశ్రీ(వాగీశ్వరి) రాగంలో తలత్ మహ్మూద్ కంఠంనుంచి జాల్వారిన పాట చరిత్రని సృష్టించింది. కోయంబత్తూరులో తన చిత్రాలు నిర్మించే ఎస్ . ఎం. నాయుడుగారు
రెంవారాలకాలవ్యవధిలో తన “అజాద్ “హిందీచిత్రానికి పదిపాటలు కంపోజ్ చేసిపంపవలసినదిగా నౌషదలీసాబ్ ని కోరేడు. వెంటనే నౌషద్ తాను సినిమాపాటలు తయారు చేసే కార్ఖానాని కాదని ఆఫర్ తిరస్కరించేరు. రామచంద్రని అడిగితే ఆయన సరేనన్నారు. తగినసమయంలోనే పదిపాటలు పూర్తిచేసి పంపేసేరు. అన్నీ సూపర్ హిట్టయ్యేయి. వాటిలో ఒకపాట “జా రి జా రి ఓ కారీ బదరియా” అనేది లతా సోలో పాట. బాగేశ్రీ రాగచ్ఛాయలోవుంటుంది. లతాజీ ఒక రిహార్సల్ తోను-ఒక టేక్ లోను రికార్డు చెయ్యడంకూడా ఒక గొప్ప రికార్డే! అలాగే అదే చిత్రంలో “కిత్నా హసీన్ హై మౌసం” అనేపాట లతా-చితాల్కర్ యుగళగీతం దర్బారీకానడారాగంలో ఆల్ టైం హిట్స్ లో ఒకటి. 1959 లో వచ్చిన “నవ్ రంగ్ ” 13 పాటలతోనిండిన దృశ్యమహాకావ్యం. దానిలోని మాల్ కౌస్ (హిందోళ) రాగంలో “ఆథాహై చంద్రమా రాత్ ఆథీ” అనే ఆశాభాన్స్లే-మహేంద్రకపూర్ల డ్యూయెట్ , “తూ ఛుపీ హై కహా” అదేరాగంలో ఆశా-మన్నాడేల పాట, దేష్ రాగంలో హోలీపాట ఎంత గొప్ప పాటలో నేను మాటలలో వర్ణించలేను. ఇలాగ ఎంతవ్రాసినా సి.రామచంద్రని ఆకాశాన్ని చిన్న అద్దంలో చూపించినట్లే! చివరగా ఒక్కవిషయం విన్నవించి,  విరమించుకుంటాను ఈ పెద్ద ప్రయత్నంనుంచి.

ఐ మేరె వతన్ కే లోగో” అనే లతాజీ పాట వ్రాసినవారు కవిప్రదీప్ ఐతే దానికి సంగీతరచన చేసినవారు సి. రామచంద్ర.

స్వస్తి||

You may also like...

4 Responses

  1. Chaganty RamaRao says:

    Chaalaa infformative gaa vundi

  2. సి.యస్ says:

    లతామంగేష్కర్ గొంతులోని మధురామృత ధారల్ని దోసిళ్ళతో పట్టి తాగమని సంగీతప్రియులకు జాలువార్చిన ప్రముఖ సంగీతకారులలో ఒకడైన సి.రామచంద్ర పరిచయం మనసుని పాతపాటల పల్లకిలో ఊరేగించింది. ఓ…నిర్దయీ ప్రీతమ్ అంటూ స్త్రీ సినిమాలో కూర్చిన పాటలో సి.రామచంద్ర విరహవేదనని గొప్పగా పలికించారు. తెలుగులో ‘నిజం చెబితే నమ్మరు’, అక్బర్ సలీమ్ అనార్కలి’ సినిమాలకు సంగీతం సమకూర్చారు

  3. సి.యస్ says:

    ‘ధీరేసే ఆజారే’ అంత జోర్ సే పుట్టిందనే సంగతి ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు ఆ వరుసలోని తెలుగుపాట ప్రముఖ కథా రచయిత పాలగుమ్మి పద్మరాజుగారు రాశారనేది కూడా చాలామందికి తెలియనిదే…

  4. Savitri says:

    Miricchina information Chala interesting ga vundi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *