సాహిత్యము-సౌహిత్యము – 15 : గుట్టుగ చెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
19—08—2017; శనివారము.

సాహిత్యము—సౌహిత్యము- – -15.

ఈ వారం సమస్యాపూరణం శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్య గారిది. అసమానప్రతిభాసంపన్నులు, కారణజన్ములు, కుర్తాళంపీఠాధిపతులు ఐన శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందజీమహరాజ్ వారు
పూర్వాశ్రమంలో డా. ప్రసాదరాయ కులపతివర్యులు. వారి “కవితా మహేంద్రజాలం” గ్రథంనుంచిసేకరించబడిన పద్యమిది. వారు శ్రీ ఉత్పలవారి గురించి “ఉత్పల పరిమళం”లో వ్రాసిన పరిచయవాక్యాలనే యిక్కడ పొందుపరుస్తున్నాను.

(శ్రీ ఉత్పలవారు) కవిగా, పండితుడుగా, నవలా రచయితగా, కథానికాకర్తగా, సినిమా రచయితగా, వ్యాసకర్తగా, పురాణతత్వవ్యాఖ్యాతగా బహుముఖీనమైన ప్రజ్ఞాప్రాభవాలు ప్రదర్శించిన వ్యక్తి-…
శ్రీ ఉత్పలవారికి హైదరాబాదు, శంకర మఠం సభలో ఇవ్వబడిన సమస్య:—

గుట్టుగ చెప్పికొన్న పలుకుల్
బహిరంగములౌను వెంటనే“.

కవిగారి సమస్యాపూరణం యిది:—

జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొనియుందురక్కునన్
కట్టడి పాపరేడు, అలికంబున అగ్ని,
శివుండు పార్వతీ
పట్టపుదేవితో సరసభాషణ కేనియు
నోచుకోడటే!
గుట్టుగ చెప్పికొన్న పలుకుల్
బహిరంగములౌను వెంటనే”! ||

ముందు సమస్య అర్థం చూద్దాం! మాటలు, వాటి అన్వయమూ తేటతెల్లంగానేవున్నాయి. గుట్టుగ అంటే ఏకాంతంలో రహస్యంగా అనుకునే మాటలుకూడా వెనువెంటనే బహిరంగంగా అందరికీ తెలిసిపోతున్నాయట! ఇదీ దీని భావం.

దీనిని శివపరంగా పూరించి దీనికి ఎక్కడాలేని సొగసులు కూర్చారు, శ్రీ ఆచార్యులవారు. ఎంత సునిశిత దృష్టి? ఎంత సున్నితమైన భావన? ఎంత సులభమనోజ్ఞ శైలి? ఎంత సులలితపదప్రయోగం? ఎంత సుకర అన్వయం? ఇదంతా వారి సొమ్ము! వారికే చెల్లింది. ఇప్పుడు పద్యభావం సుతారంగా పట్టుకునేయత్నం చేద్దాం!

శివుడి తలమీద ఒకప్రక్క గంగమ్మతల్లి, మరొకవైపు చంద్రుడు, వక్షస్థలంలో వ్రేలాడే వాసుకి(పాపరేడు=సర్పరాజు), నుదుటిమధ్య(అలికంబున) అగ్ని ఉన్నారు. ఆ ఉన్న అందరూ ఎప్పుడూ మెలకువగా ఉండేవారూ, శివపరమాత్మని ఒక్కక్షణమైనా వీడనివారూను. పాపం పశుపతి తన పట్టపురాణితో ఏకాంతంగా సరససల్లాపం చేసుకోవడానికే అవకాశం ఉండదు. “వాక్కు-అర్థములాగ” ఎప్పుడూ
ఎడబాయక ఉండే ఆ దంపతులిద్దరికి “ప్రైవసీ” అన్నది మచ్చుకికూడా లేకుండా పోయింది.
ఐనా ఎలాగో ఒకలాగ కాస్త “గుట్టు”గా ఏదైనా “క”భాషలాంటి కోడ్ లాంగ్వేజ్ లో మట్లాడుకుందామన్నా పరువుదక్కడం కష్టం. ఎందుకంటే చంద్రుడు తారానాథుడు. నక్షత్రాలకి భర్త. తన విశ్వమాధ్యమంద్వారా “కలైనేశన్ “వంటి వార్తాప్రసారాలలో తగినంత మసాలాజోడించి అంతా బట్టబయలు చేస్తాడు. గంగమ్మ “ఛానల్ ” ఆవిడకి వుంది. సవతులని భర్తైన సాగరుడి సమక్షంలో కలిసినవెంటనే శంకరుల సంసారం గుట్టు రట్టు చేస్తుంది. వాసుకి క్రిందిలోకాలప్రసారాలు తను చూసుకుంటాడు. అగ్ని దేవలోకంతోసహా పైలోకాల ప్రసారాలని స్వయంగా దగ్గరవుండి నడిపిస్తాడు. ఇది మన ప్రియమైన విశ్వనాథుడి కాపురం పరిస్థితి. పిసరంతైనా ఏకాంతంలేని కైలాసవాసి సంసారం ఇంత అందంగా సాగుతోందిమరి!

స్వస్తి||

You may also like...

3 Responses

  1. Kasu says:

    Chaalaa bagundi

  2. Sampath Kumar says:

    Bhale Bhale.

  3. సి.యస్ says:

    సమస్యని అందంగా పూరించడంలో ఆ సమస్య ఇచ్చినవారి ప్రతిభ కూడా ద్యోతకమౌతుంది.ఇక్కడ అది నిదర్శనమైంది. పృచ్ఛకునికి, అవధానిగారికీ జోహార్లు. వివరించడంలో సమకాలీన సంగతులతో పాటు సునిశిత హాస్యం తోడైంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *