శారదా సంతతి — 6 : శ్రీ యామునాచార్యవర్యులు

శ్రీశారదా దయా దీప్తిః :—
13—08—2017;  ఆదివారం.

శారదా సంతతి—6.

శ్రీ యామునాచార్యవర్యులు.

అది క్రీ.శ. 1150 వ సంవత్సరప్రాంతం. పాండ్యరాజులు దక్షిణభారతంలోని సువిశాలప్రదేశాన్ని శ్రీమీనాక్షీదేవి అనుగ్రహంతోనిండిన మదురైమహానగరాన్ని ముఖ్యపట్టణంగా చేసుకుని ఒకరాజుగారు పరిపాలిస్తున్నారు. దేశమంతా సుభిక్షంగావుంది. కవులు, కళాకారులు, విద్వాంసులు, వివిధవిద్యావంతులు, గురుకులాలు, పండితపరిషత్తులు అన్నీ ౘక్కగా పోషింపబడుతున్న రోజులవి.  జనసామాన్యంలోకూడా ఉత్తమ సాంస్కృతికాభిలాష వుండేది.

రాజుగారి ఆస్థానంలో అనేకవిద్యలలోను, వివిధకళలలోను, ఆరితేరినవారు సంస్థానపండితులుగా వుండేవారు. విద్వజ్జనకోలాహలుడు అనే పేరుగల గట్టి శాస్త్రపండితుడు రాజాస్థానంలో వుండేవాడు. ఆయన పాండ్యరాజ్యంలోను, చుట్టుప్రక్కల తన శాస్త్రపాండిత్యంతో అనేకపండిత ప్రముఖులని తన వాదనాపటిమతో ఓడించి అలాగ ఓడిపోయినవారినుంచి (మహారాజులు తమ సామంతరాజుల

నుంచి కప్పంవసూలుచేసినట్లు) నెలవారీ పైకం వసూలుచేసేవాడు. రాజు అండతో అలాగ పైకం ఇవ్వలేని పేదపండితులని కారాగారంపాలు చేయించేవాడు. ఈ విధానం ముఖ్యంగా గురుకులాలలో పిల్లలకి
పాఠాలుచెప్పుకునేపండితులకి పెద్దబెడదగావుండేది. మదురైనగరంలో భాష్యాచార్యులు అనే బహుళశాస్త్రమహాపండితుడు తన ఇంట్లో గురుకులవిధానంలో అనేక విద్యార్థులకి వివిధశాస్త్రాలలో విద్యని
పేదవారికి ఉచితంగాను, ధనవంతులకి విద్యాబోధానంతరం గురుదక్షిణగా వారు యిచ్చినదిపుచ్చుకుని గృహనిర్వహణచేసుకుంటున్నాడు. భాష్యాచార్యులవారి గురుకులంలో యామునాచార్యుడు అనే విద్యార్థి ౘదువుకునేవాడు. అతడితండ్రిపేరు శ్రీ ఈశ్వరముని. అతడితాతగారిపేరు పేరుపొందిన శ్రీ నాథమునిస్వామి. యామునాచార్యులది పండితకుటుంబం. క్రీ.శ. 1150 ప్రాంతంలోనే పుట్టిన
యామునాచార్యులు పుట్టుకతోనే మహాప్రజ్ఞాశాలి. గురుకులంలో బాగా చిన్న వయస్సులోనే భాష్యాచార్యుల వారి పర్యవేక్షణలో సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు.గురుకులంలోని అన్నితరగతులవారికి
వారివారి పాఠ్యాంశాలని గురువుగారు లేనిసమయంలో ౘక్కగాబోధించేవాడు. గురువుగారు ఏ పనిమీద బయటకివెళ్ళినా, గ్రామాంతరాలువెళ్ళినా గురుకుల నిర్వహణబాధ్యతని యామునాచార్యులకి అప్పగించి వెళ్ళిపోయేవారు.ఒకసారి గురువుగారులేనిసమయంలో యామునాచార్యులు గురుకులాన్ని నిర్వహిస్తున్నాడు. అప్పటికి అతడి వయస్సు 12 సంవత్సరాలు. తోడి గురుకులవిద్యార్థులందరికి వారి-వారి విషయాలలో ఎవరికితగినట్లువారికి ౘక్కగా పాఠాలు చెపుతున్నాడు. సరిగా ఆ సమయంలోనే విద్వజ్జన కోలాహలుడి బంటు భాష్యాచార్యులవారినుంచి బకాయిలు పడ్డ నెలవారీపైకాన్ని వసూలుచేసుకోవ
డానికి వచ్చేడు. అప్పుడు ఆ బంటుకి యామునాచార్యుడికి జరిగిన సంభాషణ యిది:

బంటు:—భాష్యాచార్యులవారెక్కడ?
యాము:—వారు లేరు. ఏమిపని?
బంటు:—విద్వజ్జనకోలాహలపండితుల పైకం వసూలుచేసుకోవాలి.
యాము:—మా గురువుగారు వారికి పైకం ఎందుకివ్వాలి?
బంటు:—మా విద్వజ్జనకోలాహల పండితులు సర్వపండితసామ్రాజ్యానికి మకుటంలేనిమహారాజు. మీ గురువు వంటి చిన్నపండితులు ఆయనకి సుంకంగా కొంతపైకంచెల్లించడం రివాజు.
యాము:—అలాగ చెల్లించకపోతే ఏంచేస్తారు?
బంటు:—మా పండితవర్యులతో రాజాస్థానంలో శాస్త్రచర్చచేసి, ఓడిపోతే ప్రాణాలకేముప్పురావచ్చు.
యాము:— మా గురువుగారికి సముడైన పండితుడెవ్వడూ ఈ ప్రాంతంలోలేడు. అందువల్ల మేము సుంకంకట్టవలసిన పనిలేదు.అలాగని మీ పైవారికిచెప్పు.
బంటు:—సరే! అలాగే చెస్తాను. మీ గురువుగారిని రాజాస్థానంలో మా పండితవరిష్ఠులతో వాదోపవాదాలకి, దానివలన సంభవించే తీవ్రపరిణామాలకి సిద్ధంగావుండమని చెప్పండి. అని హెచ్చరించి బంటు వెళ్ళిపోయాడు.

గురువుగారు గురుకులానికి తిరిగి రాగానే ఈ విషయాలన్నీ తెలుసుకుని రాజక్రోధానికి, పండితక్రోధానికి భయపడిపోయి నెత్తి-నోరు మొత్తుకున్నారు. నిస్సహాయంగా శిష్యుడిచేతులుపట్టుకుని “ఇలాగ
ఎందుకుచేసేవునాయనా? నా ప్రాణం మీదికితెచ్చేవుకదా! ఇప్పుడు దారి-తెన్ను తెలయటంలేదు. దేవుడా! ఎంతకఠినపరీక్షతెచ్చిపెట్టేవు? తరుణోపాయం ఏమిటి?” అంటూ బాధపడసాగేరు.
“మీరేమీ బాధపడకండి గురువుగారూ! సమస్య మీ వరకు రాదు. నేనే పరిష్కరించగలను.  అహంభావి, మహాగర్విష్ఠి ఐన ఆ విద్వజ్జనకోలాహలుడికి మీవంటి పరిపూర్ణపండితశ్రేష్ఠుడిని ఎలాగ  గౌరవించాలోనేర్పుతాను. పాండిత్యం మీలాగ లోకహితంకోసంవినియోగించడానికేతప్ప వ్యక్తగత అహంకారానికి, బాహ్యపటాటోపానికి, ఇతరపండితులని అవమానించడానికి కాదని తెలిసేలాగచేస్తాను.” అన్నాడు, గురువుగారితో యామునాచార్యుడు.

గురువుగారు భయపడినంతపనీ అయ్యింది. మరునాడే భాష్యాచార్యులవారికి, విద్వజ్జనకోలాహలుడితో రాజాస్థానంలో శాస్త్రచర్చకి ఆహ్వానం వచ్చింది. ఖిన్నుడైవున్న గురువుగారి సమక్షంలోనే యామునాచార్యులు రాజభటుడిద్వారా ఆస్థానపండితుడికి ఇలాగ వార్తపంపించేడు.

ఇంత చిన్నవిషయాన్ని నిర్వహించడానికి భాష్యాచార్యుల శిష్యుడైన యామునాచార్యుడు సరిపోతాడు. అతడు శాస్త్రచర్చకి సిద్ధంగావున్నాడు.” ఈ వార్తని భటుడు రాజాస్థానానికి విన్నవించేడు. 12 సంవత్సరాల యామునాచార్యుడికి, విద్వజ్జన కోలాహల మహాపండితుడికి చర్చ ఏర్పాటుచేయబడింది. ఆ చర్చవివరాలు, ఫలితము వచ్చేవారం తెలుసుకుందాం!

(సశేషం)

స్వస్తి||

You may also like...

3 Responses

  1. CS says:

    విద్య వివేకాన్ని, వినయాన్ని తెచ్చిపెట్టాలి,అహంకారాన్ని కాదు అనే విషయం చరిత్రలో అనేక పర్యాయాలు ఈ కోలాహలుడి వంటి వారివల్ల రుజువు అయింది. సరస్వతీ కటాక్షంతో బాలుడైన యామునాచార్యులు తన వాదనా పటిమతో ఎలా కోలాహలుడిని ఓడించాడో తెలుసుకోవడానికి ఇంకా వారం ఆగడం ఇబ్బందే. కొమ్మూరి సాంబశివరావు సస్పెన్స్ నవల అంత ఆసక్తి కలిగించాడు .

  2. Raj Tatavarthy says:

    Manchi suspense lo aaperu ee seershika ni.

  3. Meda manohar reddy says:

    Manchi vishyam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *