కదంబకం — 7 : శ్వయువమఘోనామతద్ధితే
13—08—2017; ఆదివారం.
కదంబకం—7.
ఈ వారం సంస్కృతవ్యాకరణంతో ముచ్చటలాడే రెండు రమ్యమైన చాటుశ్లోకాలలోని చమత్కారాలని వివరించుకుందాం.
మొదటి శ్లోకం యిది:—
“కాచం మణిం కాంచనమేకసూత్రే|
గ్రథ్నాసి ముగ్ధే! కిము చిత్రమత్ర |
అశేషవిత్ పాణినిరేకసూత్రే |
శ్వానం యువానం మఘవానమూచే||”
ఒక పండితుడు తనముందు ఒక ఆడపిల్ల ఒకమంచిదారానికి గాజుపూసని, మణిపూసని, బంగారు పూసని గుచ్చుతూ వుండడం గమనించాడు. ఆ అమ్మాయిచేసేపని ఆయనకి ఆశ్చర్యం కలిగించింది.
“ఏమీతెలియని అమాయకబాలా!
విలువలో ఒకదానితోమరొకటి పొసగని గాజుపూసని, మణిపూసని, బంగారుపూసని ఒకేదారంలో గుచ్చుతున్నావేమిటి? అది తగినపనేనా?”
అని మృదువుగా మందలింపు ధోరణిలో అన్నాడు. వెంటనే ఆ అందమైన ఆడపిల్ల తనపనినిచేసుకుంటూనే యిలా అంది:
“అనంతప్రజ్ఞావంతుడైన సంస్కృత
వ్యాకరణవేత్త పాణినిమహర్షి తన
వ్యాకరణసూత్రాలలో కుక్కని, యువకుడిని, దేవరాజైన ఇంద్రుడిని
ఒకే సూత్రంలో చెప్పేడుకదా!”
సంస్కృతంలో “సూత్రం” అనేమాటకి ‘త్రాడు లేక దారము’ అని, ‘సంక్షిప్తంగా చెప్పబడే శాస్త్రవాక్యం, అని రెండర్థాలు ఉన్నాయి. అందువలన యిక్కడ సూత్రం అనేమాట పూసలుగుచ్చేదారం గాను, పాణినివ్యాకరణసూత్రంగాను రెండు అర్థాలని యిస్తుంది. పాణిని తన వ్యాకరణసూత్రాలలో
“శ్వయువమఘోనామతద్ధితే” శ్వన్ = కుక్క, యువన్ = యువకుడు, మఘవన్ = మహేంద్రుడు అనే మూడు మాటలని ఏకసూత్రంలో నిబద్ధంచేసి చెప్పడం నిజమే!
ఐతే ఇక్కడ శబ్దసారూప్యమే ప్రధానం. అర్థంవల్లవచ్చే తారతమ్యాలని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఏమాత్రమూలేదు. ఐనా తేటైన తెలివికలిగిన ఆ అమ్మాయి ప్రదర్శించిన అనుపమ
ఇప్పుడు రెండవశ్లోకం చూద్దాం!
“నపుంసకమితి జ్ఞాత్వా
ప్రియాయై ప్రేషితం మనః |
తత్తు తత్రైవ రమతే
హతాః పాణినా వయమ్ “||
“మనస్సు నపుంసకలింగానికి చెందిన మాట అని పాణినిమహాశయుడు తన వ్యాకరణంలో చెప్పేడు. ఆ మాట నమ్మి నా మనస్సుని నా ప్రేయసివద్దకి నా పరిస్థితిని వివరించడానికి పంపించేను. నా మనస్సు నాకుమేలుచెయ్యడానికి బదులు నా ప్రియురాలితో కాపురం పెట్టి నన్ను దగాచేసింది. మొత్తానికి పాణినిగారు నా కొంప కూల్చి పుణ్యం కట్టుకున్నాడు“.
ఇక్కడి సారస్యం ఏమిటంటే ప్రియుడి మనస్సు ప్రియురాలిని విడిచిరానని భీష్మించుకుని కూర్చుంది. మనస్సుని ప్రియురాలి ముంగిట పారవేసుకున్న ప్రియుడు, తనబాధేదో తను పడడం మానేసి, తను వ్యాకరణంనేర్చుకున్న పాపానికి పాణినిగారి పరువుని బజారుపాలుచేసేడు.
స్వస్తి||
Baagundi.
పై శ్లోకాల్లో మంచి స్వారస్యం , చమత్కారం ఉన్నాయి.అయితే వాటితో పాటు పూర్వం విద్యావిధానం ఎలా ఉండేదో కూడా తెలుస్తుంది.ఆట పాటల్లో వ్యాకరణం లాంటి కొరుకుడు పడని విషయాలు ఎలా సులువుగా బోధించేవారో గ్రహించగలం
వాహ్. బావున్నాయి. Thank you. పాణిని సూత్రాలతో పైకి లాగిన చమత్కారాలు తియ్యగా ఉన్నాయి. తియ్యగా, తియ్యగా, ఇంకా ఎన్ని వస్తాయో !
పనిలో పని “శ్వయువమఘోనా మతద్ధితే” అన్న సూత్రాన్ని విడమరచి చెప్పితే బావుంటుంది – ఉదాహరణతో సహా.