అర్థం అయ్యిందా ?

V.V.K: రాఘవపాండవీయం, హరిశ్చంద్ర నలొపాఖ్యానం వంటి ద్వ్యర్థి(రెండర్థాలు వచ్చేవి) కావ్యాలు, యాదవరాఘవపాండవీయం వంటి త్ర్యర్థి(మూడర్థాలిచ్చేవి) కావ్యాలు చాలా గొప్పకావ్యాలు. సంస్కృత
భాషయొక్క అనుపమశబ్దార్థ ప్రదాయక మహావైభవశక్తి వలననే ఇటువంటి గొప్ప రచనలు సుసాధ్యమయ్యాయి. లేకపోతే ఇటువంటి కావ్యనిర్మాణాలు అసంభవమనే చెప్పాలి.
A.W.: కృష్ణా, “సంస్కృత భాష యొక్క అనుపమ శబ్దార్ధ ప్రదాయక మహా వైభవ శక్తి” – ఎంత బాగా వర్ణించావు, ఈ గొప్ప భాష యొక్క ఔన్నత్యాన్ని!  భేష్!! మన మిత్రుడు శ్రీ నాగేశ్వర ప్రసాద్ (సిండికేట్ బ్యాంక్) గార్కి నీ ఈ వివరణాత్మక సమాచారాన్ని ఇప్పుడే ‘ఫార్వార్డ్’ చేస్తున్నాను. మరి- “ద్వయ్ర్థి” మరియు “త్ర్యర్థి” కావ్యాలలోని ఎంపికచేసి కొన్ని శ్రేష్ఠ ప్రక్రియలు కూడా అపుడపుడూ రసజ్ఞులైన మన మిత్రులకు పరిచయం చేస్తూ పోతే- వారూ, వారితోపాటు నేనూ ధన్యులమౌతాము కదా!  ఇలాంటి సేవలు- నీ వీలు వెంబడి చేస్తూండు (మనకు అర్జoటేముంది గనక!). అలాగే, చిన్న సందేహం. “శబ్దార్ధ” అని వ్రాయడం సరియయినదా లేక “శబ్దార్థ” కరెక్టా;  నివృత్తి చేయగలవు.
V.V.K: “శబ్దార్థ” అన్నదే సరైనది. “ర” క్రింద పొట్టలో చుక్క వున్న “థ” వత్తు యివ్వాలి. ధన్యవాదాలు.
A.W.: ఈప్రకారం- “అర్ధం” (meaning) అనే సందర్భంలో కూడా “అర్థం” (పొట్టలో చుక్కతో) నే ఉండాలి కదా?
V.V.K:నిస్సందేహంగా అంతే మిత్రమా! ధన్యవాదం!
A.W.:మరిచాను; “అర్ధం” అంటే డబ్బుకి సంబంధించిన పదం కదా?  ఉదా: ‘అర్ధశాస్త్రం’. క్రింద పొట్టలో చుక్కలేకుండా.
V.V.K:ఇందుకే నేను నీ illimitable admirer ని ఐపోయాను… ఎప్పు…డో, అప్పుడెప్పు…..డో ఇలా ఐపోయాను. జ్ఞాపకం రావటంలేదు. ఆ( ! జ్ఞాపకంవచ్చేసింది. మనం V.S.M.C. లో B.Com. ౘదువుతున్నరోజులలో
B.O. classలో రామసుబ్బారావు గారు పాఠం చెపుతున్నపుడు మన  class-room తలుపుని ఎవరో ఒక అల్లరిపిల్లాడు కొద్దిగాతట్టి తలుపు కాస్త ప్రకంపనధ్వనిని కలిగించేలాగ చేసి పారిపోయేడు. చాలా serious గా
పాఠంచెప్పడం స్వాభావికమైన రా.సు.రా. గారు చాలాచిరాకుగా ఏమిటాచప్పుడు అంటూ గాండ్రించి నంతపని చేసేరు. వెంటనే నువ్వు “door quake, Sir” అన్నావు. ఆయన అర్థంకాక “ఏమిటీ” అని
రెట్టించేరు. వెంటనే నువ్వు లేచి నిలబడి అదేమాట మరింతస్ఫుటంగాఅన్నావు. దేనికీ ఎప్పుడూ నవ్వని ఆయన నవ్వేసరికి తరగతిగదిలో వున్న అందరమూ నవ్వేసేం! ఈ ఉపోద్ఘాతం దేనికంటే అర్థం
vs అర్ధం గురించి నువ్వు లేవనెత్తిన ఆసక్తిదాయకమైన చర్చ నన్నింత ముగ్ధుడిని చేసింది. అర్థశబ్దం శబ్దార్థవిషయంలోను, అర్థశాస్త్రంలోనూ రెండింటిలోనూ ఒక్కటే. “త” వర్గులో రెండవ అక్షరమే! అంటే “అర్థము” అన్నమాటకి Meaning/Wealth or money అనే అర్థాలు రెండూ వున్నాయి. ఇంక “త” వర్గులో నాల్గవ అక్షరం– “ధ” వత్తుతో కలిసిన  “అర్ధం” అనే మాటకి “సగము(half), లేక  ముక్క (piece) అని అర్థం.

ఇక్కడ సందర్భంవచ్చిందికనుక నీకు interesting వుండే ఒక విశేషం చెప్తాను. డబ్బు/సంపద అనే అర్థంలో సంస్కృతం మూడు పదబంధాలు వున్నాయి.

1.శుక్లార్థము-White wealth/money
2.శబలార్థం-Wealth earned through doubtful/mixed means
3.కృష్ణార్థం-Black money/wealth.

గమ్మత్తుగా లేదూ? మన ప్రాచీన సంస్కృతిలోని శాస్త్రగ్రంథాలలో ఈ  విభజన అప్పటికే వుంది. ఎందుకంటే మానవనైజంలో దోష/పాప/మాలిన్య భావం ఆదాము–అవ్వ కాలంనుంచే ఆరంభమయ్యిందని తాత్పర్యం. ధన్యవాదం, ఆప్తసఖా!

నా బాల్యప్రాణమిత్రుడు జనాబ్ ఎం. ఏ. వహాబ్ మియాకి, నాకు జరిగిన చర్చ పైవిధంగా సాగింది. ఇది, మన భాషకి, సాహిత్యాది ఇతరకుతూహలభరిత విషయాలకి చెందినదికనుక ఈ అభిరుచి వున్న

వారికి పంపడం జరిగింది. గ్రహించమనవి. ధన్యవాదం!

ఇంకొక్క విషయం ఇక్కడ ౙత చెయ్యాలి. “అర్ధనారీశ్వరుడు” లో పొట్టలోచుక్కలేని “త” వర్గులోని నాల్గవ అక్షరం వత్తుని ఉపయోగించాలి. కొందరు నైఘంటికులు (Lexicographers/Dictionary-Authors) ఈ పొట్టలో చుక్కలేని అర్ధశబ్దాన్ని రెండురకాలుగా విభజించి నపుంసకలింగంలో “అర్ధశబ్దానికి”చెరిసగం(divided into two equal items/pieces) అని అర్థం చెప్పి, పుంలింగంలో ఐతే అదే మాటకి ముక్క an uneven piece అని వివరణనిచ్చేరు. ధన్యవాదం.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *