కదంబకం—6 : బళ్ళారి (Ballari)
06–08–2017, ఆదివారము.
కదంబకం—6.
ఆధునిక ఆంధ్ర నాటకరంగానికి బళ్ళారి ఒక ప్రధానకీలకస్థానంగా చారిత్రికాధారాలు వెల్లడి చేస్తున్నాయి. బళ్ళారికిచెందిన ఇద్దరు మహామహులు ఆంధ్రనాటకరంగానికి ఆధునికతని ప్రసాదించిన ధన్యపురుషులు. వారిలో ఒకరు ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారు. మరొకరు కోలాచలం శ్రీనివాసరావు గారు. ఇద్దరూ 19 వ శతాబ్ది చతుర్థ పాదంలోను, 20 వ శతాబ్ది ప్రథమ భాగంలోను తమ-తమ నాటకరంగ ప్రదర్శనలతో చరిత్రని ప్రభావితం చేసేరు. వృత్తిరీత్యా యిద్దరూ న్యాయవాదులే! ప్రవృత్తిరీత్యా నాటకరంగశారదని పూర్ణదీక్షతో ఉపాసించి నాటకకళాశారదకి అనుపమాన, అలౌకిక ఆభూషణాలతో అనవరతసేవ చేసినవారే!
ధర్మవరంవారు 1853 లో జన్మించగా, కోలాచలంవారు 1854లో పుట్టేరు. ధర్మవరంవారు 59 యేళ్ళు జీవించేరు. కోలాచలంవారు 65యేళ్ళు బ్రతికేరు. వారి-వార జీవితకాలాలలో సుమారు 30 నాటకాలలోపు ఇరువురూ రచించేరు. ధర్మవరంవారు రచన,దర్శకత్వం,నటన మూడూచేసేరు. కోలాచలంవారు రచన,దర్శకత్వం నిర్వహించేవారు. ఇద్దరూ సాంఘికాలు, పౌరాణికాలు, చారిత్రికాలు కూడారచించారు.
ధర్మవరంవారు 28 తెలుగునాటకాలు, 2 కన్నడనాటకాలు, 1 ఆంగ్లనాటకం రచించారు. కోలాచలంవారు 29 తెలుగునాటకాలు రచించారు. ఆంగ్లంలో ప్రపంచనాటకరంగచరిత్ర వ్రాసేరు. వీరిద్దరూ ఆధునిక ఆంధ్ర నాటకరంగ పితామహులవంటివారు.
స్వస్తి||
Baagundi