Fun facts –7

శ్రీశారదా దయా చన్ద్రికా :—
05–08–2017,  శనివారము.

వాస్తవాలు—వినోదాలు–7.

1. 1963 నుండి 1969 వరకు అమెరికా అధ్యక్షపదవిలో వున్న లిండన్ జాన్సన్ (Lyndon Johnson) 15 సంవత్సరాలవయస్సులోనే తన యిల్లు విడిచిపెట్టి ఒక్కడూ బయటప్రపంచంలోకి వెళ్ళిపోయేడుట! ఒక సంవత్సరంపాటు దేశదిమ్మరిగా తిరిగేడట! నారింజతోటలలో కూలికి నారింజ పళ్ళు యేరిపెట్టడంద్వారాను, యెంగిలిగిన్నెలు-కంచాలు శుభ్రం చేయడంద్వారాను ఆ సమయంలో తన తిండికిసరిపడ డబ్బు సంపాదించుకొనేవాడట! ఆ తరువాత కొంతకాలం రహదారి నిర్మాణంకూలిపనులవారి జట్టులో చేరి పొట్టపోసుకున్నాడట! ఆ తరవాత చదువుకోవడం ప్రారంభించేడుట. కళాశాలవిద్యనభ్యసించడంకోసం కొంతసమయం కళాశాల ద్వారపాలుడు(part-time college janitor)గా పనిచేసి తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడుట!

2. ఒకపక్షికోసం వేలంలో చెల్లించబడిన అత్యధిక మొత్తం 9,000 పౌండ్లుట! ఇంతకీ ఆ పక్షి ఎగిరేదికాదు. ఎందుకంటే అది ప్రాణమున్న పక్షి కానే  కాదు. అది ౘక్కగా తయారుచేయబడిన పక్షిబొమ్మ మాత్రమే! అసలుపక్షి ఎలావుంటుందో అచ్చంగా అలాగే ఆ బొమ్మపక్షికూడా వుంటుంది. పెయ్యకి చేటపెయ్యలాగ ఎప్పుడో మరణించిన ఆ పక్షి అసలు శరీరంలోనే తగిన ద్రవ్యాలు కూరి దానిని సజీవపక్షిగా మలచడం జరిగింది. 1971 లో ఐస్ లేండ్ నేచురల్ హిస్టరీ మ్యూజియం వారు సోత్ బే వేలంపాట కేంద్రంలో దానిని కొన్నారు. ఆ పక్షి నార్త్ అట్లాంటిక్ సముద్రసీమకి చెందిన ది గ్రేట్ ఆక్ (the Great Auk) సంతతికి చెందిన ఎగరలేని పక్షి. అన్నింటికన్న ముఖ్యమైనది ఆ జాతి 19 వ శతాబ్దిలోనే పూర్తిగా అంతరించి పోయింది. అందువల్లే అది అంత అబ్బురమైపోయింది. పైగా అంత ధర పలికింది.

3. అమెరికాదేశానికి మొట్టమొదటి అధ్యక్షుడైన జార్జ్ వాషింగ్టన్ బ్రిటిష్ వారి సైన్యంలో ఆరు సంవత్సరాలు పనిచేసి కల్నలు పదవినికూడా పొందేడుట! ఆ ఆరుసంవత్సరాల ఆంగ్లేయసైన్య ఉద్యోగ అనుభవాన్ని అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధ సైన్యాన్ని విజయం దిశగా మళ్ళించి తన పోరాటంలో సఫలీ కృతుడవ్వడానికి వినియోగించుకున్నాడు.

స్వస్తి||

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *