శారదా సంతతి – 4 : శ్రీ గుండేరావు హర్కారే
శ్రీశారదా దయా చంద్రికా :—
30—07—02017; ఆదివారము.
శారదా సంతతి — 4.
ఇక్కడినుంచి “శారదా ప్రతిభాన కోవిదులు” అనేశీర్షికని “శారదా సంతతి” గా మార్చడమౌతూంది.
ఇంతవరకు శారదామాతవైభవ స్వరూపమైన సంగీతప్రపంచానికి చెందిన 1. వారణాసి రామసుబ్బయ్య గారు; 2. విదుషీమణి శ్రీమతి గౌహర్ జాన్ ; 3. తిరుక్కోడికావల్ కృష్ణయ్యరు గారల సంగీత కళాకౌశలం, వైదుష్య విభవం గురించి సంగ్రహంగా తెలుసుకున్నాం. ఈ వారం సాహిత్య, శాస్త్ర కోవిదులైన మహానుభావులు శ్రీ గుండేరావు హర్కారేగారి గురించి కొంతలో కొంతైనా తెలుసుకునే చిన్నయత్నం చేద్దాం.
శ్రీహర్కారేమహోదయులు 13-4-1887 లో హైదరాబాదులో పుట్టేరు. చిన్ననాటి నుంచే ౘదువు, సంధ్యలలో అపార కౌశలాన్ని కనబరిచేవారు. ఆనాటి వారి విద్యావైదుష్యానికి వారు చిన్నవయస్సులోనే న్యాయస్థానంలో గుమాస్తా(Clerk)గా ఉద్యోగంలోచేరేరు. ఒకప్రక్క ఉద్యోగవిధులని అనాయాసంగాను, అనితరసాధ్యంగాను నిర్వహిస్తూనే, మరొకవంక వివిధభాషలలోను, ప్రాచీన ఆధునిక విద్యలలో ఆనాటి వేర్వేరు ప్రాంతాలలోవున్న వివిధ పండిత పరిషత్తులలోని వివిధభాషా, శాస్త్రాల లోను వారు ప్రధమశ్రేణిలో పట్టాలు పొందేరు.
ఆ రోజులలో వారి ఉద్యోగానికి అవసరమైన అరబ్బీయభాషలోమౌల్వీ ఆలం పట్టా, పారసీకంలోమున్షీ ఆలం పట్టా, సంస్కృతంలో సాహిత్యశిరోమణి-న్యాయ(Logic) శిరోమణి పట్టాలు, సంస్కృతంలోనే
సారస్వతవిమర్శశాస్త్రంలోను, హిందూధర్మశాస్త్రంలోను, పి.ఓ.యల్ ., పట్టాలు, తెలుగుభాషలో విజ్ఞానచంద్రిక పట్టా, ఇవేకాక ఉద్యోగసంబంధమైన భూమి ఆదాయ(Land Revenue) పరీక్షలో పట్టా, న్యాయశాస్త్రం (Jurisprudence)లో పట్టా, గణకశాస్త్రం(Accountancy)లో పట్టామొదలైనవాటిలో ఒకమనిషికి ఒకజన్మలో సాధ్యంకానన్ని పరీక్షలలో వారు ఉత్తీర్ణులయ్యారు. ఇంతేకాక వారు మనం పైన తెలుసుకున్న భాషలైన అరబ్బీ, ఫారిసీ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం లోనేకాక హిందీ, ఉర్దూ, మరాఠీ, మొదలైన అనేక భాషలలో కూలంకషపాండిత్యంతో కూడిన సంపూర్ణకౌశలాన్ని అవలీలగా
సంపాదించేరు.
ఒకవంక యివన్నీ సాధిస్తూనే ఉద్యోగరంగంలో గుమాస్తాపదవినుండి న్యాయస్థాన అనువాదకులుగాను, తరవాత హైకోర్టులో ఉద్యోగిగాను, హైకోర్టుజడ్జికి పెర్సనల్ సెక్రటరీగాను పనిచేసేరు. ఆపైన గద్వాలసంస్థానానికి జడ్జిగా పనిచేసేరు. అక్కడే మేజిస్ట్రేటుగా, జిల్లాజడ్జిగా, పనిచేసి డిప్యూటీకలెక్టరై ఆ హోదాలో రిటైరయ్యేరు. ఆ పైన హైకోర్టులో న్యాయవాదిగా కొంతకాలం బాగా ప్రేక్టీసుచేసి వృత్తి
విరమణచేసి వివిధభాషలలో అనేక విషయాలమీద ప్రామాణిక రచనలు, ప్రసంగాలు, రేడియోప్రసంగాలు చేసేరు. వారి బహుభాషావైదుష్యంద్వారా వారు వివిధభాషాశారదలకి ఎంతో వైభవపూర్ణసేవ చేసేరు.
షేక్స్పియరు ఆంగ్లనాటకాలు హేమ్లెట్ , ఎ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ రెండిటిని వారు సంస్కృతంలోకి అనువదించేరు. సంస్కృతం “హేమ్లెట్ “లోని ప్రిన్స్ హేమ్లెట్ విశ్వవిఖ్యాతస్వగతం అందరికీ తెలిసినదే:
“To be or not to be; that is the question”
అని ఆంగ్లంలో అంతర్మథనం చేసిన హేమ్లెట్ , సంస్కృతంలో యిలాగ మనసులో మథనపడతాడు:
“ప్రశ్నోsయం సముపస్థితో మమ పురోజీవామ్యజీవామి వా” |
అని శార్దూలవృత్తశ్లోకపాదంలో లోలోపల అలజడిపడతాడు. ఖురాన్ -ఎ-షరీఫ్ లో మొదటి ఐదుభగాలకి సంస్కృతానువాదం చేసేరు. మస్నవీ, మౌలానా రూమీ, దీవానే మగ్రబీ అనే గొప్ప సూఫీత్త్వగ్రంథాలని కూడా సంస్కృతంలోకి అనువాదం చేసేరు. అలాగే సంస్కృతగ్రంథాలు కొన్ని ఉర్దూలోకి, తెలుగువి మరాఠీలోకి, మరాఠీ-ఉర్దూ సాహిత్యవిషయాలని తెలుగులోకి అనువదించేరు.
వారి పాండిత్యప్రతిభకి నీరాజనం సమర్పిస్తూ నవద్వీపం, అయోధ్య, హృషీకేశం, బెల్గాం వంటి ప్రముఖ విద్యా,శాస్త్ర ప్రాచీన పరిషత్తులు వారికి “వాచస్పతి”, “విద్యాభూషణ”,”విద్యాభాస్కర” మొదలైన బిరుదులతో సమ్మానించేయి.
ఇటువంటి శారదాతనయుడికి నతమస్తకులమై శ్రీశారదావైభవాన్నిఆరాధనచేద్దాం!
స్వస్తి|| (సశేషం)
Thanks a lot for shedding light on such wonderful personalities babaii. Immensely fortunate to know them