సాహిత్యము సౌహిత్యము – 12 : గరుడుడు గణపతికి తండ్రి కావలె సుమ్మీ

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
29—07—2017; శనివారము.

సాహిత్యము—సౌహిత్యము.

ఈ రోజు కొప్పరపు సోదరకవులకి ఒక అవధానంలో ఇవ్వబడిన ఒక జటిలసమస్యని మహాప్రతిభావంతులైన ఆ సోదరకవులు ఎంతబాగా పూరించేరో గ్రహించి ఆనందిద్దాం!

సమస్య కందపద్యపాదం. కందం చిన్నపద్యాలకోవకి చెందినదని మనకి తెలుసు. ఇంతకీ సమస్య యిది:—

గరుడుడు గణపతికి తండ్రి కావలె సుమ్మీ“!

అర్థం తేటతెల్లంగానేవుంది. గరుత్మంతుడు గణపతికి తండ్రి కదా! అని ఈ సమస్యభావం.

ఏ పురాణ కథలలోను ఇటువంటి వృత్తాంతం ఏమాత్రమూలేదు. మరి ఈ అసంబద్ధమైన సమస్యని ఎలాగ సమన్వయించాలి? సమస్యలో యివ్వబడిన మాటలని అవధానులు తమపూరణలోని

భావానికి అనుకూలంగా విడగొట్టి అర్థవంతంగా సమస్యని పూరించాలి. కొప్పరపు సోదరకవులు సమస్యని ఎంత ౘక్కగాపూరించేరో చూద్దాం!

హరుడు గణపతికి పోలెన్ 
సరసీజాక్షుండు నాభిజన్మునకు వలెన్ 
గురుకీర్తి కన్న ఆ సా 
గరు డుడుగణ పతికి తండ్రి కావలె సుమ్మీ“!

గణపతికి హరుడు(శివుడు)లాగ,
బ్రహ్మ(నాభిజన్ముడు)కి విష్ణువు (సరసీజాక్షుండు)లాగ,
ప్రసిద్ధి(గురుకీర్తి)పొందిన సముద్రుడు (సాగరుడు) నక్షత్రాధిపతి(ఉడుగణపతి  అంటే ఉడు=నక్షత్ర, గణ=సమూహం, నక్షత్రాలసమూహానికి పతి=రాజు, అంటే మొత్తంమీద “చంద్రుడు” అని అర్థం. చంద్రుడు లక్ష్మీదేవితోబాటు పాలకడలిలోనించి పుట్టేడుకదా! ) తండ్రి ఔతాడు. అని ఆ విధంగా సమస్యని అర్థవంతంగా పూరించేరు.

ఇక్కడ “గరుడుడు గణపతికి తండ్రి ఔతాడు” అనేవాక్యంలోవున్న అసంబద్ధతని పద్యంమూడవపాదం చివర “సా” అనే ఒక్క అక్షరంచేర్చి, ఆ “సా” ని “గరుడుడు” లోని ముందు మూడు అక్షరాలతో కలిపేసరికి “సాగరుడు” అయ్యింది.  తరవాత “ఉడుగణపతి” అంటే “చంద్రుడు” అని ముందు వివరించుకున్నాం. చివరికి సాగరుడు, ఉడుపతికి అంటే సముద్రుడు, చంద్రుడికి తండ్రి కావడం పురాణప్రసిద్ధమేకనక అసంబద్ధత తొలగిపోయి అందమైన అర్థం సిద్ధించింది.

స్వస్తి|| (సశేషం).

You may also like...

1 Response

  1. Raj Tatavarthy says:

    What a wonderful solution to the seemingly impossible statement ! I bow with respect to the Kavi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *