Fun facts – 6

వాస్తవాలు—వినోదాలు—6.

29—07—2017; శనివారము.

1. 1961లో ఇండోనీషియాలోని ఇంద్రమయునగరం అలవిమీరిన ఎలుకలబెడదతో తల్లడిల్లిపోయింది. ఈ బెడదని నిరోధింౘడానికి సతమతమౌతున్న స్థానికప్రభుత్వం ఒక విచిత్రమైన ప్రణాళికని ప్రవేశ

పెట్టడానికి ఆలోచన చేసిందట. వివాహంకోసం ప్రభుత్వం అనుమతిని మంజూరుచెయ్యాలంటే దరఖాస్తు దారులు ప్రభుత్వాధికారికి 25 ఎలుకతోకలు సమర్పించుకోవాలట. ఆదేశంలో అది జరిగిందో లేదో తెలియదుకాని, అదే మనదేశంలో ఐతే నకిలీ ఎలుకతోకలవ్యాపారం 30 ఎలుకలు- 60 తోకలుగా ముప్పొద్దులా జరిగివుండేది. అంతేకాక ప్రభుత్వకార్యాలయం ముందుగుమ్మంనుంచి మామూలుగా వచ్చిన ఎలుక తోకలు వెనుకగుమ్మంద్వారా రాజలాంఛనాలతో నిష్క్రమించి వుండేవి.

2. 17 వ శతాబ్దిలో బ్రిటిష్ వారి సముద్రనావికావిభాగంలో ఒక మూఢవిశ్వాసం రాజ్యమేలుతూ వుండేదట. నావికులు, యితర సిబ్బంది శుక్రవారంరోజున ఓడ ప్రయాణానికి పూర్తిగా విముఖంగా వుండేవారట. శుక్రవారం ఓడప్రయాణం ప్రారంభించడం అత్యంతప్రమాదకరం అని, ప్రాణాలకే ముప్పని కూడా వారునమ్మేవారు. ఈ గుడ్డినమ్మకాన్ని నిర్మూలించాలని బ్రిటిష్ ప్రభుత్వప్రముఖులు ఒక పెద్ద ప్రణాళికని చేపట్టేరు. HMS Friday అనేపేరుతో ఒక సరికొత్త గట్టి ఓడని నిర్మించి (బహుశః హేతువాదులైన) సిబ్బందితో శుక్రవారంరోజునే ఆ ఓడని సముద్రప్రవేశం చేయించేరు. పాపం, ప్రభుత్వంవారి ప్రయోగం ఆ ఓడ, సరిగ్గా ఒకవారానికి, అంటే పై శుక్రవారంనాడు, సముద్రమధ్యంలో సిబ్బంది, సరుకులతోసహా ములిగిపోయింది. మూఢవిశ్వాసానికి మరింతబలమైన పునాది ఏర్పడింది.

3. “టాటర్ ” లేక  “టార్టర్ ” (Tatar or Tartar) అంటే  “బరితెగించి పగతోను,  క్రోధంతోను ఘోరంగా ప్రవర్తించే వ్యక్తి” (మగ లేక ఆడ మనిషి) అని అర్థం.  13 వ శతాబ్దిలో మధ్య ఆసియాలోని ఒక ప్రాంతాన్ని పాలిస్తున్న ఒక టార్టర్  కుటుంబసభ్యురాలైన “ఐయవుక్ ” (Aiyavuk) అనే యువరాణియొక్క తీవ్రచేష్టలవల్ల ఈ “టార్టర్ ” అనే మాట ప్రయోగంలో స్థిరపడిందని కొందరు భాషావేత్తల అభిప్రాయం. ఆమె తనని కుస్తీపోటీలో జయింౘ గలిగినవాడే తనని పెళ్ళిచేసుకోవడానికి అర్హుడని ప్రకటించిందట. ఆ పోటీలో ఓడిపోయిన యువకుడు 100 గుర్రాలు యువరాణికి సమర్పించుకోవాలి. ఆమె ఒకయింటిది అయ్యేలోగా

10,000 గుర్రాలని సంపాదించిందట.

స్వస్తి||   (సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *