శ్రీ శిక్షాష్టకమ్ – మొదటి శ్లోకం

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః

(21-5-17):

ఇప్పుడు శ్రీమాత వ్రాయించబోయే విషయం మన డా.శ్రీనివాస్ కి అత్యంతప్రియవిషయం. వెళ్ళినపుడల్లా మళ్ళీమళ్ళీ తనకి తెలిసినదే ఐనా అంతే! శ్రీకృష్ణచైతన్యమహాప్రభువులుశ్రీ శిక్షాష్టకమ్ ” అనే ఒక పరమరమ్యమైన అష్టకం ఒక్కటే రచించారు. అది సర్వవేదాంత తత్త్వసారం. తిక్కనగారు తమ తెలుగు భారతంలో వ్యాసభగవానుని వర్ణించే రెండు సందర్భాలలో ఇలా అన్నారు:

1.”ఆగమ పుంజ పదార్థ తత్త్వ నిస్సంశయకారుడు“.
2.”నిర్వాణ దాన క్రియా శీలుడు“.

ఈ రెండు విశేషణాలు మహాప్రభువుకి కూడావర్తిస్తాయి. అంటే అష్టాదశపురాణాలు, భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలు వంటి అనేక అలౌకిక అపూర్వ రచనల సంపూర్ణ సార స్వరూపమే ఈ “శిష్టాష్టకం”!
ఈ పరమ పవిత్ర గ్రంథంలోని మొదటి శ్లోకం మనం చర్చించుకోబోతున్నాం!

చేతో దర్పణ మార్జనం
భవమహా దావాగ్ని నిర్వాపణం|
శ్రేయః కైరవ చంద్రికా వితరణం
విద్యా వధూ జీవనమ్ |
ఆనందాంబుధి వర్ధనం ప్రతిపదం
పూర్ణామృతాస్వాదనం|
సర్వాత్మస్నపనం పరం విజయతే
శ్రీకృష్ణ సంకీర్తనమ్ “||ప్రతి పదార్థము:
చేతోదర్పణమార్జనం=మనసు అనే (తరచు ఏదో ఒక కారణంగా మకిలి పట్టే లక్షణం ఉన్న) అద్దాన్ని ౘక్కగా (ఎల్లప్పుడూ) శుభ్రం చేసేది,
భవమహా దావాగ్ని నిర్వాపణం= సంసార వికారం కలిగిన జీవుడి చావు-పుట్టుకల పరంపర అనే దావానలాన్ని నిర్మూలించ గలిగినది,
శ్రేయః కైరవ చంద్రికా వితరణం= కృష్ణానుగ్రహప్రాప్తికోసం తపించే భక్తమనస్సులనే కలువలకి నిత్యానందక్షేమం అనే వెన్నెల వెలుగుల ౘల్లని ప్రసారమైనది,
విద్యా వధూ జీవనం= కృష్ణదేవునియందు ఎడతెగని పరాభక్తి అనే దివ్యవిద్యావధువుకి ప్రాణస్వరూపమైనది,
ఆనందాంబుధి వర్ధనం= కృష్ణప్రీతి అనే  ఆనంద సాగరాన్నినిరంతరం ఉప్పొంగచేసేది,
ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం= అడుగడుగులోను దివ్యానందామృతసేవనం చేయించేది,
సర్వాత్మస్నపనం=కృష్షునియందు నిత్యనిర్మలస్నేహభావాన్నిపెంపొందింపచేసేది,
విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం=అయిన అటువంటి శ్రీకృష్ణసంకీర్తనం ఎల్లప్పుడు సర్వోత్కృష్ట స్థితిని పొందుతోంది.

 

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :
(26-5-17)

“చేతో దర్పణ మార్జనం…” 2వ భాగం:
తాత్పర్యం:
శ్రీకృష్ణ నామ సంకీర్తనం మన చిత్తం అనే అద్దాన్ని (మాలిన్యం లేకుండా) శుభ్రపరిచేది, (చావు-పుట్టుకలతో కూడిన) సంసారమనే కార్చిచ్చును నిర్మూలింపజేసేది, (నిరంతర కృష్ణసాన్నిధ్యమనే)శ్రేయస్సు అనెడి తెల్లకలువలను వికసింపజేసే వెన్నెల ఐనది, (పరాభక్తినికలిగించే)విద్య అనే వధువుకి ప్రాణస్వరూపమైనది, (ఆత్మ)ఆనంద సముద్రాన్ని పొంగి పొరలేటట్లు చేసేది, అడుగడుగునా పూర్ణమైన అమృతాన్ని యిచ్చేది, (శ్రీకృష్ణ సంకీర్తనాన్ని ఆశ్రయించుకున్న) అందరికీ నిరంతర నైర్మల్యాన్ని, స్నిగ్ధతని ప్రసాదించేది అయినదై సర్వోత్కృష్టతతో ప్రకాశిస్తోంది.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *