శారదా సంతతి – 3 : శ్రీ తిరుక్కోడికావల్ కృష్ణయ్యర్

 శ్రీశారదా దయా చంద్రికా :—
23—7—2017; ఆదివారము.శారదా సంతతి —3.

ఈ వారం దక్షిణభారతదేశ కర్ణాటక సంగీతప్రపంచంలో శాశ్వతయశస్సు పొందిన శారదాతనయుడు, గొప్ప వాయులీన విద్వత్కళాకారుడు ఐన శ్రీ తిరుక్కోడికావల్ కృష్ణయ్యర్ గారి అనుపమాన ప్రజ్ఞావిభవం గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణయ్యరు తంజావూరుజిల్లాలోని మరత్తురైగ్రామంలో 1857 లో జన్మించేరు. తండ్రి కుప్పుస్వామి భాగవతరు హరికథానిర్వహణలో సుప్రసిద్ధులు. ప్రారంభంలో కృష్ణయ్యరు తండ్రివద్ద సంగీతంనేర్చినా, తండ్రిగారి మార్గ దర్శకత్వంలో గాత్రసంగీతానికి గొంతు సహకరించకపోవడంవల్ల వాయులీనవిద్యలో చక్కని శిక్షణని సాత్తనూరు పంచనదయ్యరుగారి వద్ద
పొందేడు. ఆ పైన ఆ కాలంలో సుప్రసిద్ధ వాయులీనవిద్వాంసుడైన ఫిడేలు సుబ్బరాయరుగారివద్ద ఉన్నతవిద్యని కూలంకషంగా అభ్యసించి ప్రావీణ్యం సాధించేడు. ఎంత విద్యనిసాధించినా, ఎంత పరిణతిని పొందినా కృష్ణయ్యరుగారి విద్యాప్రావీణ్యసాధన నిరంతరాయంగా పెరుగుతూపోయిందేకాని కొంచెం కూడా తృప్తిపడి ఏ సమయంలోనూ ఆగిపోలేదు. ఆయన కేవలం ప్రధానకళాకారులకి

సహకారవాద్యకారుడిగా మాత్రమే వుండిపోక ప్రధాన వాయులీన విద్వాంసుడిగా దక్షిణభారతంలో తిరుగులేని పేరుప్రఖ్యాతులు సంపాదించేరు.

కాకినాడలోని సరస్వతీగానసభ దసరా నవరాత్రి సంగీతోత్సవంలో వారు తమ వాయులీనగానప్రతిభని అనితరసాధ్యంగా ప్రదర్శించేరని చరిత్ర చెపుతోంది. ఆ నాటి వారి కచేరిలో వారు తమ వాద్యం పైన
“సావేరి” రాగంలో రాగం-తానం-పల్లవి ని సుమారు నాలుగు గంటల పాటు వాయించి సభ్యులందరిని దివ్యపారవశ్యంలో నిమగ్నం చేసినట్లు చరిత్ర సాక్ష్యమిస్తోంది. వారి జీవితమంతా వర్ణమయమైన

కమనీయ సంగీతకావ్యంగా సాగి పోయింది. వారి జీవితంలో చాలా గొప్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం యిక్కడ ముచ్చటించుకుందాం!

ఆ కాలంలో మదరాసుకి లార్డు కర్జన్ గవర్నరుగావున్నారు. మదరాసు హై కోర్టుకి ప్రధానన్యాయమూర్తి ఐన ఎస్ . సుబ్రహ్మణ్యయ్యరు కృష్ణయ్యరు మిత్రుడు. పాశ్చాత్యసంగీతంలో వాయులీనవిద్యలో ప్రసిద్ధుడైన ఒక కళాకారుడు తన కళాప్రదర్శనకి మదరాసు వచ్చేడట. ఆ సభకి కర్ణాటకవాయులీన విద్వాంసులని ఆహ్వానించాలని కర్జన్ సుబ్రహ్మణ్యయ్యరుకి సలహాయిచ్చేరట! దానితో  కృష్ణయ్యరుగారుకూడా ఆహ్వానం మేరకి సభని అలంకరించేరు. పాశ్చాత్యవిద్వాంసుడి వాయులీన విద్యలోని కమాను ఉపయోగించే అపారకౌశలానికి, ఇతర ప్రత్యేక విన్యాసాలకి కృష్ణయ్యరు చాలా

అబ్బురపడి ఆయనని శ్లాఘించేరట. కర్జనుప్రభువు మన కళాకారులెవరైనా అటువంటి విద్యానైపుణ్యాన్ని ప్రదర్శించగలరా అని సభాముఖంగా అడిగారట. ఒక్క కృష్ణయ్యరుమాత్రం తగినంత సమయం యిస్తే తప్పక అటువంటి నైపుణ్యాన్ని చూపగలనని చెప్పేరట.

ఒక నిర్ణీతమైన రోజున కృష్ణయ్యరు సంగీతసభ యేర్పాటు చేయబడింది. ఆ రోజు కృష్ణయ్యరు పాశ్చాత్యసంగీతాన్ని తను విన్నది యథాతథంగా వాయించేసరికి కర్జన్ కన్న ఆ పాశ్చాత్యకళాకారుడు ఎక్కువ ఆశ్చర్యపోయేడుట! ఎందుకంటే తాను నొటేషను వుంటేతప్ప తన సంగీతాన్ని ఏమాత్రమూ వాయించలేడు. అటువంటిది కృష్ణయ్పరు యెలా వాయించేడో అతనికి అర్థంకాక అయ్యరునే అడిగాడట. దానికి అయ్యరు నవ్వుతూ మా నొటేషను మా మనసులోనేవుంటుందని జవాబు చెప్పేరట! తరవాత మచ్చుకి మన సంగీతం వాయించి వినిపించేడట.అది విని కర్జన్ ఆ సంగీతాన్ని తాను వాయించగలడా అని విదేశీయ విద్వాంసుడిని అడిగితే ఆతడు అది తనకి అసాధ్యం అని చెప్పేడట!

స్వస్తి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *