కదంబకం – 3 : Nice

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :—
16–07–2017; ఆదివారము.
సుమసుందర కదంబకం—3.

ఇంకా మరికొంతకాలం మాటగురించే మన చర్చ కొనసాగిద్దాం! నాకు పరమ ఆత్మీయుడు ఈ శీర్షికలో విషయాలని ఆమూలాగ్రం ౘదివి నాకు ఒక ౘక్కని-చిక్కని మాటకి సంబంధించిన మరింత విస్తృతమూ, గాఢమూ, గంభీరమూ ఐన అంశాలని ఈ చర్చలో చేర్చి మన చర్చని సంపూర్ణమూ, పూర్తిఫలప్రదమూ చెయ్యాలని సూచించాడు. ఇది సందర్భోచిత సూచన. ఐతే నాకు ఈ విషయాలని వ్రాయడానికి కావలసిన వివరాలన్నీ నామనసులోనే వున్నాయి. కాని వాటిని వ్రాయడానికి కావలసిన “మూడ్ “ని, తదితరసామగ్రిని శ్రీశారదామాత యివ్వాలి. అవి ఆ తల్లి ప్రసాదించేలోపుగా మాటకి సంబంధించిన ఈ ప్రస్తావనని ఆమె స్ఫురింపజేసినట్లుగా కొనసాగిస్తాను.

ఆంగ్లంలో Shift of Meaning అంటే (మాటల) అర్థపరిణామక్రమం ఎలాగ ఉంటుందో శాస్త్రీయ ప్రణాలికాబధ్ధంగా పరిశోధన జరిగింది. తెలుగులోకూడా ఈ విషయంమీద కొందరు పెద్దలు ఎంతో గొప్ప కృషి చేసేరు. మనం ఈ వారం ఆంగ్లంలో మనందరికీ బాగాతెలిసిన “NICE” అనే ఆంగ్లశబ్దం కాలానుగుణంగా ఊసరవెల్లిలాగ రకరకాల రంగులు మార్చుకుంటూ ప్రస్తుతానికి ఎటువంటి అర్థాన్నిస్తోందో క్రమపద్ధతిలో పరిశీలిద్దాం.

“Nice” అనేమాటకి అసలు మూలం Latin భాషలోని Nescire అనే క్రియా పదం. ఈ మాట రెండు శబ్దభాగాల (word-parts) యొక్క కూర్పు. “Ne” అనే వ్యతిరేకార్థాన్నిచ్చే ఉపపదం (prefix), “Scire” అనే ముఖ్యక్రియాపదం కలవడంవల్ల Nescire అనే మాట పుట్టింది. Scire అనేక్రియా పదానికి “తెలిసిన”, “జ్ఞానముకలిగిన” అని అర్థం. Ne అనే వ్యతిరేకార్థంవున్న ఉపపదానికి “లేకపోవుట” అని అర్థం. మొత్తంమీద “తెలియకుండు”, “అజ్ఞానియగు” అని అర్థం. ఈ క్రియనుంచి Nescius అనే విశేషణం(adjective) పుట్టింది. దీనికి Ignorant లేక అజ్ఞానియైన అని అర్థం. 1390 వ సంవత్సరంలో John Gower తన రచనలలో ఈమాటని foolish అనే అర్థంతోను, 1423 లో James I of Scotland కూడా wanton అనే అర్థం తోను, ఆ తరవాతకాలాలలో క్రమంగా సంకోచముకలిగిన, బిడియముగల, మృదుస్వభావిఐన, (shy, delicate, refined) ఉన్నతాభిరుచికలిగిన అని క్రమంగా మారిపోతూ వచ్చింది. From the ridiculous to the sublime లేక from rags to riches అన్నట్టుగా “నైస్ ” యొక్క అర్థ పరిణామం జరిగింది.
ఇది ఊర్ధ్వగతి పరిణామం. కొన్ని మాటలకి అథోగతి పరిణామం వుంటుంది. మరొకమారు అటువంటిదికూడా చూడవచ్చు. మొత్తం మీద nice అనే మాట foolish నుంచి fastidious కి; stupid నుంచి pleasant కి క్రమంగా అర్థంలో ఊర్ధ్వగతి పరిణామాన్ని betterment of meaning ని పొందింది.

స్వస్తి||
(సశేషం).

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *