శారదా సంతతి – 2 : గౌహర్ జాన్
16–07–2017; ఆదివారం, 11-15am.
శారదా సంతతి:—2.
28–05–2017; ఆదివారం రోజున ఈ శీర్షికలో శ్రీ వారణాసి రామసుబ్బయ్యగారి గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నాం! ఈ రోజు వారికి గురువూ-శిష్యురాలు రెండూ ఐన సంగీత విదుషి గౌహర్ జాన్ గారి గురించి పరిచయం చేసుకుందాం! విదుషి గౌహర్ జాన్ 1870 వ సంవత్సరంలో పుట్టింది. ఆమె తల్లి పేరు బడీ మల్కాజాన్ . తల్లి ఆంగ్లో-అర్మేనియన్ జాతికి చెందినది; ఇస్లాంమతం స్వీకరించింది. తల్లి గొప్ప హిందుస్థినీ గాయకురాలు కావడంవల్ల గౌహర్ బాల్యంనుంచీ చక్కని పాటలు పాడడం అభ్యసించింది. ఆమె బాల్యంలో బెనారస్ లో వుండడంవల్ల అక్కడ సుప్రసిద్ధుడైన బచ్చూ మిశ్రా వద్ద గానకళలో కొంత శిక్షణ పొందింది. యుక్తవయస్సు వచ్చేసరికి బెనారస్ లో ధనవంతుడైన రాయ్ శ్యామకృష్ణ/ రాయ్ చగన్ జీ సంరక్షణలో వుంది. తాను ఆ సమయంలో రచించిన కొన్ని ఠుమ్రీలని “చగన్ పియా” ముద్రతో పాడి తనప్రేమని వ్యక్తం చేసింది. ఆ తరువాత ఇద్దరు సంరక్షకుల రక్షణలో కలకత్తాలో స్వంత భవనంలోకి మకాం మార్చింది. ఇక్కడ వున్నప్పుడే పటియాలా ఘరానాకి చెందిన ఉస్తాద్ కాలేఖాన్గారిని తనయింటికిరప్పించుకుని వారి అద్భుతగానశైలిని చక్కగా అభ్యసించి ఒంటపట్టించుకుంది. ఆ పిదప కారానా ఘరానాకి చెందిన ఉస్తాద్ మౌలాబక్ష్ దగ్గర తన జీవితాంతం శుశ్రూష చేసి వారి మనోహరశైలిని స్వంతంచేసుకుంది. ఆ పైన హార్మోనియంలోను, ఠుమ్రీలోను నిరుపమ కళాకారుడైన భైయాసాహబ్ గణపత్రావ్ నుంచికూడా ఠుమ్రీగానకళలోని సూక్ష్మాతిసూక్ష్మ విషయాలన్నీ జీర్ణించుకుంది.ఇంతటిగొప్ప కళాకారుల శిక్షణద్వారా ఆమె అమేయ వైవిధ్యభరిత గానకళాకారిణిగా పరిపక్వత చెందింది. ఆమె తన జీవితంలో ఎంత గొప్ప కీర్తిప్రతిష్ఠలని, సంపదని, భోగాలని అనుభవించిందో జీవిత చరమాధ్యాయంలో అంతటి దైన్యాన్నికూడా ౘవి చూసింది. కోర్టు లావాదేవీల లో ఆస్తి నంతటినీ పోగొట్టుకుని ఎంతో లేమిని అనుభవించింది. మైసూర్ మహారాజా దాక్షిణ్యం వల్ల మైసూరు దర్బారు కళాకారిణిగా మన్ననపొంది ఆమె జీవితాంతం వరకు రాజావారు ఏర్పాటు చేసిన జీవనభృతితో బ్రతికి 1930లో మైసూరులోనే తనువు చాలించింది.
హెచ్ .ఎం. వి. మొదలైన గ్రామఫోను సంస్థలవారు ఆరోజులలో సుమారు 600 ల రికార్డులలో ఆమె మృదుమధుర గానాన్ని పదిలం చేసారని చరిత్ర చెప్తోంది. ఆమె గానశైలి అనితరసాధ్యమైనది. ఐనా సిద్ధేశ్వరీదేవివంటి ఎందరో గాయనీమణులు, కొందరుగాయకులు కూడా ఆమె అడుగుజాడలని అనురక్తితో, ఆ పైన భక్తితో అనుసరించారు.
స్వస్తి|| (సశేషం)||
excellent