సాహిత్యము సౌహిత్యము – 10 : అంభోధిః జలధిః పయోధిరుధధిః వారాన్నిధిర్వారిధిః

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :—
14–07–2017,  శనివారం, 6–20AM.

ఈ శీర్షికలో యింతవరకు తెలుగు వాఙ్మయంలో ప్రసిద్ధమైన సీసపద్యాలలో వున్న కొన్ని ప్రహేళికలని పరికించి, చర్చించుకుని అంతో-ఇంతో వినోదంతోపాటు, కాస్తంత విషయసేకరణచేసి ముందుకి

కొనసాగుతున్నాం! ప్రహేళికల పరంపరని ఈ సామాజిక మాధ్యమ పరిమితులకి లోబడి ఒక్కొక్క రకానికి ఒక ఉదాహరణ రూపంలో ఏ ఒక్క రకమూ పునరావృతం కాకుండా దీనిని నిర్వహించుకున్నాం. ఇంక
ప్రస్తుతానికి దీనిని ఇక్కడ విడిచి పెడదాం. అవకాశాన్నిబట్టి సంస్కృత ప్రహేలికలని తరువాత చూద్దాం!

ఈ వారంనించి “సమస్య” అనే ప్రక్రియని ఎంత సమయస్ఫూర్తితో, అయత్నసిద్ధంగా, ప్రశంసాపాత్రంగా, విజ్ఞాన-వినోదదాయకంగా ప్రతిభావంతులైన కవులు ఆయా దేశ-కాలాలలో నిర్వహించేరో చూద్దాం! అష్ట/శత/సహస్ర అవధానాలలో సమస్య చాలా ప్రత్యేకస్థానం వుంది. “దత్తపది”, “ఆశువు”, “అప్రస్తుత ప్రశంస” వంటి గొప్ప-గొప్ప అంశాలెన్నివున్నా, సమస్య “సమస్యే”!

మనం ఈ “సాహిత్యము-సౌహిత్యము” శీర్షికని “మృగాత్ సింహః పలాయనం” అనే సంస్కృత సమస్య పూరణం మనంచూచేం! ఇక్కడ ఒకవిషయం ప్రస్తావించాలి.

ఈ మొట్టమొదటి సమస్యాపూరణ విషయానికి నా ప్రాణసఖుడు, మన ఈ కుటుంబసభ్యుడు, సరస హృదయుడు, ఇటువంటి ఉన్నత శ్రేణివిషయాలకోసం తన ప్రాణాన్ని అలవోకగా యిచ్చేటంత గాఢశీలత

కలవాడు ఐన శ్రీ ఎం.ఏ. వహాబ్ నిష్పక్షపాతమైన, వివరణాత్మకమైన ౘక్కని “ఫీడ్ బేక్ ” యిచ్చేడు. ఇటువంటి స్పందన చాలా ముఖ్యం. అలాగే “నిమ్స్ ” హైదరాబాద్ లో హృదయవైద్యనిపుణుడు,
హృదయగత సర్వరసజ్ఞానకుశలుడు నాకు ఆత్మజసమానుడు ఐన డా. బి.శ్రీనివాస్ , ఆత్మీయుడు సి.యస్ ., ప్రాణమిత్రుడు శ్రీ హయగ్రీవరావు, నా తమ్ముడు సూరిబాబు కుమార్తెలు శ్రీ పురుహూతిక-శ్రీసౌమ్య, పూజ్యశ్రీ జి. సూర్యనారాయణగారు ( Retd. Engineer, L.I.C.,)మా మీనాక్షి, ఆత్మీయమిత్రుడు కె.వి.జోగన్న మొదలైన ఎందరో పిన్నలు-పెద్దలు ఐన రసహృదయుల ఫీడ్ బేక్ ఈ శీర్షికలనిర్వహణకి అడుగడుగునా నాకు సుస్పష్టమైన దిశానిర్దేశం చేసింది- చేస్తూవుంది. ఈ విషయంలో డా. పి. నిశాంత్ అతడి గురువు డా. బి.శ్రీనివాస్ లాగ ఇంకా ఈ వ్యాసపరంపరద్వారా ఏమేమి విషయాలు చర్చించబడాలో సూచిస్తూంటాడు. వారిద్దరూ ఈ వ్యాసవాహనానికి రెండు పెద్ద హెడ్ లైట్స్ .ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం!

ఈ వారం సమస్యాపూరణం సంస్కృత సమస్యతో ఆరంభిద్దాం.
సమస్య:
“అంభోధిః జలధిః పయోధిరుధధిః వారాన్నిధిర్వారిధిః”||

ఈ సమస్యలో ఆరు మాటలున్నాయి.
1.అంభోధి; 2.జలధి; 3.పయోధి ; 4.ఉదధి; 5.వారాంనిధి లేక వారాన్నిధి; 6.వారిధి.

సంస్కృతంలో “ధిః” అనే ప్రత్యయానికి (terminator or suffix అని ఇక్కడ అర్థం) ఆశ్రయస్థానం, కలిగివుండే చోటు,పాత్ర మొదలైన అనేక అర్థాలు వున్నాయి.
ఈ ఆరుమాటలలో ముందున్న ‘అంభః’,’జల’, ‘పయః’, ‘ఉద’, ‘వారాం’, ‘వారి’ అన్న శబ్దాలన్నింటికి “నీరు” అనే అర్థం. అందువలన ఈ ఆరు మాటలకి “సముద్రం” అనే ఒకేఒక్క అర్థం తప్ప వేరే అర్థం రాదు. అంటే ఆరుమార్లు సముద్రం అనే అర్థం వచ్చే శార్దూల విక్రీడితం ఛందస్సులోవున్న శ్లోక పాదానికి అనుగుణమైన సమస్యా పూరణం చెయ్యాలన్నమాట! దీనికి కవిగారు ఎంత అందమైన శ్లోకం చెప్పేరో గమనిద్దాం:

“అంబా కుప్యతి తాత! మూర్ధ్ని విలసత్ గంగేయముత్సృజ్యతాం
విద్వన్ ! షణ్ముఖ! కా గతిః మయి చిరాత్ అస్యాః స్థితాయాః వద|
రోషావేశవశాత్ అశేష వదనైః ప్రత్యుత్తరం దత్తవాన్
అంభోధిః జలధిః పయోధిరుధధిః వారాన్నిధిః వారిధిః” ||

“కుమారస్వామి తనతండ్రి శివుడి దగ్గరకి వెళ్ళి యిలా అన్నాడు: 

నాన్నగారు! (మా)అమ్మ(పార్వతీ దేవి–గంగాదేవియొక్క సవతిపోరు భరించలేక) కోపంగావుంది. (మీ తలపై వున్న) ఈ గంగని వదిలిపెట్టెయ్యండి. అనగానే శివుడు ‘విద్వాంసుడవైన ఓ షణ్ముఖా! చాలా కాలంగా నన్ను(నాయందు) ఆశ్రయించుకునివున్న ఈమెకు వేరే వెళ్ళడానికి గతి ఏముందిరా?’ అని అడిగాడు. (మాతృప్రేమాతిశయంతో) రోషం వచ్చిన కార్తికేయుడు తనకివున్న ఆరుముఖాలతోను ఆరు గమ్య స్థానాలని గంగాదేవికి చూపించేడు. అవి, అంభోధి, జలధి, పయోధి, ఉదధి, వారాన్నిధి, వారిధి”.

“నదీనాం సాగరో గతి” నదులన్నింటికీ సముద్రమే చివరి గమ్యస్థానం. మొత్తంమీద షణ్ముఖుడి పుణ్యమా అని మనకి సముద్రశబ్దానికి ఆరు పర్యాయపదాలు ఈ శ్లోకం ద్వారా లభించాయికనుక మనశ్రమకి తగిన ఫలం వచ్చినట్లే! ఏదో కాస్త గిట్టుబాటు అయ్యింది.

స్వస్తి||  (సశేషం)

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    ‘సాహిత్యంలో చమత్కారాలు’ లాంటి పేర్లు పెట్టకుండా ‘సౌహిత్యము’ అని మంచి పేరు పెట్టేవు.
    ప్రతిభావంతులైన అవథానులే కాదు , అద్భుతమైన సమస్యలివ్వగలిగిన పృచ్ఛకులూ ఉండేవారు.
    కనకనే ఇంతటి గొప్ప శ్లోకాలు పుట్టుకొచ్చాయి. వాటిని వెలికితీసి, వివరణాత్మకమైన విశ్లేషణ చేస్తూన్నందుకు నీకు ధన్యవాదాలు.
    ఈ శ్లో కంలో కుమారస్వామి మాతృప్రేమతో పాటు కోపంలోఉన్నవ్యక్తి ఒకే మాటని నొక్కినొక్కి అనేకసార్లు అనే సహజలక్షణం బాగా అర్థమైంది

  2. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    చాలా బావుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *