కదంబకం – 2 : మాట
09–07–2017; ఆదివారము.
సుమసుందర కదంబకం—2.ఈ శీర్షికలో క్రితం ఆదివారం “మాట” అనే విషయాన్ని మన పరిశీలనకి స్వీకరించి ఆ విషయ పరిచయం చేసుకున్నాం. ఈ రోజు “మాట” గురించి అసలు విషయం సంక్షిప్తంగా కొన్ని పరిధులకి లోబడి చర్చించుకుందాం! ఆంగ్లంలో మాటని “word”(వర్డ్ ) అంటారని మనకి తెలుసు. ఒక ఆంగ్లకవయిత్రిపేరు Anna H. Branch. ఆమె “Her Words” అనే కవిత వ్రాసేరు. దానిలో ఒకపద్యంలో ఆమె ఇలాగ అంటారు:
God wove a web of loveliness
Of clouds and stars and birds,
But made not any thing at all
So beautiful as words.
దేవుడిచ్చె మనకు దివ్యమౌ విషయాలు పక్షి, తార, మబ్బు వంటివెన్నొ, కాని మాట వంటి కమనీయసౌందర్య జగతి నతడు మనకొ సగనె లేదు!
పై విధంగా ఆంగ్ల పద్యాన్ని తెలుగులోకి అనువదించుకోవచ్చు. అంటే దేవుడు మబ్బులు, నక్షత్రాలు, పక్షులు వంటి ఎన్నో అందమైన వాటిని సృష్టించినా మాటలంత సుందరసృజనని చేయలేదు.
శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వారి కావ్యంలో ఒక అనితర భావ్యమైన దివ్యభావంతో తన కావ్యనిర్మాణానికి యోగ్యమైన భవ్యశబ్దసమూహాన్నితనకి ప్రసాదించుమని సరస్వతీదేవిని ఇలాగ ప్రార్థించేరు:
“గంధ రస రూప సంస్పర్శకంబులైన
నాల్గు గుణములు శబ్దగుణంబునంద
నణగు;నవియనంతంబ; శబ్దార్థినగుచు
అమృతమూర్తి భారతి నాశ్రయింతు.”
నా దృష్టిలో మొత్తం తెలుగు సాహిత్యం లోనే ఇంత అపురూపమైన మహాభావంతో నిండిన పద్యం చాలా చిన్నది. దీనిలో ప్రయోగించబడిన మాటలన్నీ సామాన్యమైనవే. కాని దీనిలో కవిగారు నిక్షిప్తం చేసిన భావపరాయణత్వం వలన ఇది ఒకేఒక మహాపద్యం. ఈ పద్యానికి వ్యాఖ్యానం చెయ్యాలంటే అది ఒక మహాగ్రంథమే ఔతుంది. సంక్షిప్తంగా మాట్లాడుకుందాం!
మనకి వున్న జ్ఞానేంద్రయాలు ఐదూ, 1. ముక్కు, 2. నాలుక, 3. కళ్ళు, 4. చర్మ ఇంద్రియము, 5. చెవి.
వీటికి వరసగా 1. గంధగుణం(వాసన చూడడం), 2. రసగుణం(రుచి చూడడం), 3. రూపగుణం(చూడ గలగడం), 4. స్పర్శ గుణం(చర్మ స్పర్శద్వారా తెలుసుకోగలగడం) అనే ఈ నాలుగు గుణాలూ శబ్ద గుణానికే లోబడి వుంటాయి. ఇంక చెవికి చెందిన వినికిడి శక్తి సహజంగానే శబ్దగుణానికి చెందినదే. శబ్దం అంటే మాట. అంటే మొత్తం అన్ని జ్ఞానేంద్రియ వ్యాపారాలూ మాటలద్వారానే మనసులో భావించుకుంటాం. బయటకి వ్యక్తం చేస్తాం. మాటలులేకపోతే మానవుల భావప్రక్రియ, వ్యక్తీకరణ ప్రక్రియ అన్నీ అసాధ్యాలైపోతాయి. అందులోనూ కావ్యరచన చెయ్యాలంటే అదంతా మాటల ప్రపంచమేతప్ప మరేమీ లేదు. పలుకులతల్లి సరస్వతీదేవి. అందుకని కవిగారు అలాగ ఆమెని ప్రార్థించేరు. అన్ని జ్ఞానేంద్రియవ్యాపారాలూ మాటలలోతప్ప రచనలలో మరొకవిధంగా మనం చెప్పలేము.
మాటకి సాహిత్య(ఆలంకారిక) శాస్త్రం ప్రకారం, తత్త్వశాస్త్రం ప్రకారం, తర్క శాస్త్రం ప్రకారం, మీమాంసాశాస్త్రం ప్రకారం, వివిధ భారతీయ శాస్త్రాల ప్రకారం, పాశ్చాత్య అధ్యయనాల ప్రకారం వేరు-వేరు భావనలు (Concepts), తాత్త్వికధర్మాలు (Philosophical qualities) వున్నాయి. ఐతే ఇక్కడ మనం భారతీయ సాహిత్య భావాలకి అనుగుణమైన చర్చనే చేయడం జరుగుతుంది.
పై పరిధికి లోబడి పరికిస్తే మాటకి మూడు స్థాయిలలో అర్థాలు వుంటాయి. 1. అభిధ (Denotation) 2. లక్షణ (Connotation). 3. వ్యంజన (Figurative meaning). అభిధ అంటే ఒక వస్తువు లేక విషయం యొక్క వాస్తవికమైన అర్థం.
“సంకేతవత్ అస్య అర్థో అనుసంధేయః”.
అంటే మనం అనుకునే వస్తువుకి/విషయానికి మాట అనేది ఒక సకేతం లేక చిహ్నం లేక గుర్తు అని అర్థం. దీనినే ముఖ్యార్థం, లేక శాబ్దికార్థం లేక మాటకి మాట అర్థం అంటాం. ఆంగ్లంలో Primary or literal or denotative meaning అంటారు.
2. లక్షణ (Connotative meaning) అంటే ముఖ్యార్థం సందర్భానికి సరిపోనప్పుడు ఈ అర్థంయొక్క వినియోగం అవసరం ఔతుంది. ఇది అందరికీ ఒకే అర్థాన్ని యిస్తుందని చెప్పలేం. ఒకవ్యక్తికి లేక ఒక సమూహానికి అభిధ యిచ్చే సామాన్య అర్థం కాక విశేషార్థాన్ని యిస్తుంది. దీనిని గౌణార్థం లేక Secondary/ Suggestive/ Implied meaning అంటారు.
3. వ్యంజన/ Figurative meaning: ఇది మన ఇష్టప్రకారం కావాలని మనం ఒకమాటని ఉపయోగించి దానిద్వారా వేరే అర్థాన్ని సందర్భానికి తగినట్లు స్ఫురింపజేస్తాం. ఇది కావ్యాలలో, కథలలో, భాషణలలో
తరచు చూస్తాం. ఒక ఉదాహరణద్వారా ఇది మరింత స్పష్టమౌతుంది.
“శని” అనేమాట తీసుకుందాం.
1. అభిధప్రకారం “శని” అంటే ఆకాశం లో సంచరించే ఒక కేవలద్రవ్యమయ గ్రహం మాత్రమే!
2. జ్యౌతిషంలో “శని” అంటే చాలా మందికి భీతికలిగించే కష్టప్రదాత. కొందరికిమాత్రం ప్రీతినిచ్చే సుఖదాత. ఇది లక్షణార్థం.
3. కొందరు వేళాకోళానికో, మరొక కారణానికో ఒకవ్యక్తిని “శని” అని భావించి అలాగే అతడిని సంబోధిం చడం జరుగుతుంది. ఇక్కడ యిది వ్యంజన లేక వ్యంగ్యార్థంలో అంటే Figurative గా టున్నారన్నమాట!
ఇది అభిధకి, లక్షణకి, వ్యంజనకి సాహిత్యశాస్త్రపరంగా భేదం.
మరొకసారి వేరే విషయం ముచ్చటించుకుందాం.
స్వస్తి.