Fun facts – 3

శ్రీశారదా దయా చన్ద్రికా :—
08–07–2017,  శనివారము.

వాస్తవాలు—వినోదాలు—3.ఈ వారం ఈ శీర్షికలో కొన్ని అంశాలు ౘవి చూద్దాం!1. ఇప్పుడు తెలుసుకోబోయే విషయం ౘప్పగావున్నా, ఉప్పగావున్నా మనంచెప్పుకోక తప్పదు. క్రీస్తు పూర్వం కాలానికి చెందిన జూలియస్ సీజర్ రోమను సామ్రాజ్యంలో తన యుద్ధసైనికులకి జీతం ఉప్పు పలకలలో యిచ్చేవాడట! లేటిన్ భాషలో ఉప్పుని సాల్ (sal) అంటారు. అందువల్ల జీతాన్ని లేటిన్ లో సాలరియం(salarium) అంటారు. ఇది ఆంగ్లో-నార్మన్ (Anglo-Norman) భాషలో Salarie అంటారు. అది ఇంగ్లిష్ భాషలో Salary గా అవతరించింది. కొంచెం తేడాతో దీనికి ఇంకొక కథనం కూడావుంది. సీజర్ కాలంలో సైనికులకి మామూలుగా యిచ్చే వేతనంతో బాటు అదనంగా ఉప్పు కొనుక్కోవడానికి ప్రత్యేకంగా అదనపు మొత్తాన్నివిడిగా చెల్లించేవారట. ఈ మొత్తాన్ని ప్రత్యేకంగా “లవణభృత్యం” అంటే Salarium లేక ఆంగ్లంలో Salary అనిపిలిచేవారు. అంటే ఆ రోజులలో ఉప్పు అంత ప్రియమైన వస్తువన్నమాట! చరిత్రప్రకారం దేశాలమధ్య Salt Wars జరిగినట్లు ఆధారాలు వున్నాయి. లవణసంగ్రామాలంటే మనకి ఈ కాలంలో మరి విడ్డూలమే!

2. ఆధునికమైన ఫ్లష్ టాయ్లెట్ 1878 వ సంవత్సరంలో కనుగొనబడింది. కనుగొన్న ఆ మహానుభావుడి పేరు థామస్ క్రేపర్ (Thomas Crapper). ఆయన ఆంగ్లేయ పారిశుద్ధ్య యంత్రకారుడు (British Sanitary Engineer). ఆయన జీవితచరిత్రని రచించిన రచయిత ఆపుస్తకానికి పెట్టిన పేరు ఏమిటో తెలుసా? “Flushed With Pride“.

3. మేము యువకులుగావున్న కాలంలో English Cricket Team కి మైక్ బ్రియర్లీ (Mike Brearley) కెప్టెన్ గా వుండేవాడు. టెస్టుల్లో బేటింగ్ చేసే సమయంలో ఆయన బీథోవెన్ రచించిన సంగీతకృతులని (Compositions of Beethoven) తనలోతాను ఆలపించుకుంటూ ఆట ఆడేవారు. దానివలన ఆయన మనసు శాంతిపూర్ణంగావుండి ఆటపై పూర్తి ఏకాగ్రత వుండేదట! మొత్తంమీద ఆయన క్రికెట్ ప్రపంచంలో చాలా well-composed ఆటగాడు, ఆ పైన గొప్ప నాయకుడు అని విశ్వ విఖ్యాతి పొందేడు.

(సశేషం).

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *