సాహిత్యము సౌహిత్యము – 9 : శ్రీరంగనాయకస్వామీ
శ్రీశారదా వాత్సల్య దీప్తిః :—
08–07–2017; శనివారము.
ఈ వారం మరొక రకమైన సీసపద్యం పరిశీలిద్దాం!
“పద్మనాభుని ప్రక్క పాయనిదెవ్వరు?
దశకంఠుడేదేవ తరుణి కూడె?
భాగీరథుండేమి పాటించి తెచ్చెను?
భావజ జనకుని పానుపేది?
గ్రహరాజసూనుని ఘనమైన పేరేమి?
మహిలోన భూపతి మన్ననేమి?
ముత్యమేకార్తెలో ముందుజన్మించును?
సోమకునేమియై స్వామి దునిమె?
అన్నిటికి చూడ మూడేసి అక్షరములు,
ఆది పంక్తిని చూచిన అలరుచుండు,
అట్టి శ్రీరంగనాయకుడనుదినంబు,
మనల కరుణావిధేయుడై మనుపుచుండు” !
ఇప్పుడు ఈ పద్యంలో తమాషా చూద్దాం!
1. పద్మనాభుడంటే శ్రీహరి. వారిని పాయక అంటే యెడబాయక ఉండేవారెమరు? = శ్రీలక్ష్మి.
2. రావణుడు(దశకంఠుడు) యే అప్సరసతో ఉన్నాడు?= రంభతో.
3. భగీరథుడు తపస్సుచేసి ఏమి తెచ్చేడు? = గంగను.
4. శ్రీహరి శయనించే పాన్పు ఏది? = నాగము.
5. గ్రహరాజు(సూర్యుడు) కొడుకు పేరేమిటి? = యముడు.
6. భూలోకంలో రాజ్యమేలే రాజుకి కీర్తినిచ్చే గుణమేది? = కరుణ.
7. ఏ కార్తెలో ముందు (ముత్యపుచిప్పలో) కురిసిన వాన చినుకు ముత్యంగా మారుతుంది? = స్వాతిలో.
( ఇక్కడ తెలియనివారికోసం సంక్షిప్త వివరణ కావాలి. సంవత్సరంపొడుగునా సూర్యగతి ప్రకారం సూర్యుడు ఒక్కొక్క నక్షత్రంలో సుమారు 14రోజుల చొప్పున 27 నక్షత్రాలలోను సంచరిస్తాడు.
అలాసంచరించే కాలవ్యవధిని ఆయా నక్షత్రాల పేర్లతో “కార్తె” అని పిలుస్తారు. ఉదాహరణకి కృత్తిక నక్షత్రంలో సూర్యసంచారాన్ని “కృత్తిక కార్తె” అంటారు. రోహిణి నక్షత్రంలో “రోహిణి కార్తె” అంటారు. అదే
విధంగా స్వాతి నక్షత్రగత సూర్యగతిని “స్వాతి కార్తె” అంటారు. ఈ స్వాతికార్తె ప్రారంభంలో సముద్రతీరాలలో తెరుచుకునివున్న ముత్యపు చిప్పలలో పడిన వాన చినుకులు ముత్యపుచిప్పలు మూసుకుపోగా కొంతకాలానికి ముత్యాలుగా మారుతాయట.)
8. శ్రీహరి సోమకాసురుణ్ణి ఏ అవతారం ధరించి ఉద్ధరించేడు? = మీనమై!
ఈ ప్రహేళికలో 8 ప్రశ్నలకి 8 సమాధానాలు వచ్చాయి. ప్రతిసమాధానం 3 అక్షరాల కూర్పు. (7 వ సమాధానం “స్వాతిలో” అని ౘదువుకోవాలి.)
ఈ ప్రహేళిక ప్రత్యేకత ఏమిటంటే ఈ 8 సమాధానాల మొదటి అక్షరాలని వరసగా ౘదివితే “శ్రీరంగనాయకస్వామీ” అని శ్రీరంగనాథులవారి నామం అంటే పేరు వస్తుంది. ఆ శ్రీరంగనాయకస్వామి సహజకరుణామూర్తి కావడంవలన అందరిని రక్షించాలని కవిగారు ఈ పద్యం చివర ప్రార్థన చేస్తున్నారు. తథాsస్తు!
స్వస్తి! (సశేషం)