కదంబకం – 1 : ఇదమిత్థం
02–07–2017; ఆదివారం.
సుమసుందర కదంబకం:
ఈ శీర్షికలో ఇదమిత్థంగా వర్గీకరించి చెప్పడానికి అవకాశంలేని అనేకానేక విషయాలు మన ౘదువరులముందు ఉంౘడంజరుగుతుంది. ఈ విషయాలలో కొన్ని సాంకేతిక (technical) అంశాలుకూడా వుంటాయి. ఐతే ఏ విషయాలనైనా పారిభాషిక పదజాలాన్ని కనీసస్థాయిలో వినియోగించి పాఠకుల పఠనసామర్థ్యానికి సహకరించేవిధంగా వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది.
ఈ ప్రయత్నంలోకూడా పాఠకుల ఉత్సాహానికి, ఉత్సుకతకి దోహదం చేసేవిధంగానే విషయవివరణ ఉంటుంది. ఈ విషయాలు కేవలం మనప్రాంతానికీ, దేశానికి, భాషకి, సంస్కృతికిమాత్రమే పరిమితం కాకుండా ముందే అనుకున్న విధంగా విభిన్నఅంశాలగురించి సంక్షిప్తపరిచయరూపంలో వుంటుంది.
ఈ మొట్టమొదటిభాగంలో “మాట” గురించి మాట్లాడుకుందాం. మాట, పలుకు, నుడి, మొదలైనవి అచ్చమైన తెలుగుకి చెందినవి. వాక్కు, శబ్దం, ఉక్తి, వచస్సు, వాణి, వచనము మొదలైనవి సంస్కృతం నుంచి తెలుగులోకివచ్చి తెలుగుని సుసంపన్నం చేసినవి. మన తెలుగు ప్రత్యేకబలం సంస్కృతశబ్దాలని చాలవరకు యథాతథంగా ఉపయోగించుకోగలగడంలోనే ఉందనిచెప్పాలి. మనదేశభాషలలో చాలాతక్కువ భాషలకే ఈ విశేషసామర్థ్యం ఉంది.
ఉదాహరణకి ఈ శీర్షిక పరిచయ ప్రారంభంలో “ఇదమిత్థం” అనే పదబంధం వినియోగించడం జరిగింది. ఇది రెండు మాటల కూర్పుతో వుంది. “ఇదం” అనే సర్వనామం (pronoun) మొదటిది. “ఇత్థం” అనే అవ్యయం(indeclinable) రెండవది. “ఇదం” అంటే ‘ఇది’ అని అర్థం. ‘ఇది’ అనే తెలుగుమాట ఈ “ఇదం” నుంచే వచ్చింది. “ఇత్థం” అనే మాటకి ‘ఇట్లు’, ‘ఈ విధముగా’ అని అర్థం అంటే మొత్తంమీద “ఇదమిత్థం”గా చెప్పలేనిది అంటే ‘ఇది ఇటువంటిది’ అని నిర్ధారణగా చెప్పలేనిది అని అర్థం. అందుకే అనేకానేకం అని అనుకున్నాం. ఏకం అంటే ఒకటి. అనేకం అంటే ఒకటికాదుకనక “చాలా” అని చెప్పాలి. అనేకానేక అంటే బహువిధాలుగా వేర్వేరు విషయాలు దీంట్లో ప్రసక్తం ఔతాయి. అందుకనే “కదంబకం” అన్నాం! అచ్చతెలుగులో “కలగూరగంప” అన్నమాట!
(సశేషం)