సాహిత్యము సౌహిత్యము – 8: సీసపద్యం – 4 – మూడు మాటలొక్కపదమై కూడుచుండ
01–07–2017; శనివారం.ఈ వారం మరొక సీసపద్యంలోని అందంయొక్క చందం చూద్దాం!
“ఏనుగు,సింహంబు,ఎలనాగయునుకూడి
ఒకమాటలోపల ఉండవలయు;
పక్షియు,వస్త్రంబు,పాషాణమునుకూడి
ఒకమాటలోపల ఉండవలయు;
ఫణిరాజు,ఫణివైరి,ఫణిభూషణుడుకూడి
ఒకమాటలోపల ఉండవలయు;
రారాజు,రతిరాజు,రాజరాజునుకూడి
ఒకమాటలోపల ఉండవలయు
మూడు మాటలొక్కపదమై కూడుచుండ
నాల్గు ప్రశ్నలకు జవాబు నాల్గు కలవు
చెప్పనేర్చిన వారిల గొప్పవారు
చెప్పలేనివారలు కారు చిన్నవారు!”
ఈ సీసపద్యం ప్రత్యేకత ఏమిటంటే మొదటి నాలుగుపాదాలకి నాలుగే జవాబులుంటాయి. ఐతే, ఒక్కొక్క జవాబులోను మూడేసి చిన్న జవాబులుకూడా ఉంటాయి. అంటే 4 పెద్దజవాబులు x 3 చిన్న జవాబులు= 12 మొత్తం జవాబులువస్తాయి. మరొక విధంగా చెప్పాలంటే మూడేసి చిన్న జవాబులు కలిసి ఒక పెద్ద జవాబు ఔతుందన్నమాట! ఇప్పుడు పద్యంలోని సమస్యలు పరిశీలించి వాటిని పరిష్కరిద్దాం!
1. ఏనుగు+సింహం+పాము(ఎలనాగ) =నాగకేసరాలు(ఒకరకం ధాన్యం). ఇక్కడ “నాగం” అనేమాటకి ఏనుగు; పాము అనే రెండర్థాలూ ఉన్నాయి. “కేసరి” అంటే సింహం అని మనకి తెలిసిన విషయమే!
2. పక్షి+వస్త్రం+పాషాణం= కాకిబొంతరాయి(ఒకరకం రాయి)
3. ఫణిరాజు+ఫణివైరి+ఫణిభూషణుడు=పాము+గరుత్మంతుడు+శివుడు లేక ఈశ్వరుడు=నాగ గరుడేశ్వరం(ఒక క్షేత్రం).
4. రారాజు+రతిరాజు+రాజరాజు=రాజు+మన్మథుడు+కుబేరుడు (రాజరాజంటే కుబేరుడనే అర్థం కూడా వుంది.)=రాజమదనకుబేరం(ఒక రకమైన ఔషధం లేక మందు. ఇది ఒక aphrodisiac).
స్వస్తి.