సాహిత్యము సౌహిత్యము – 5 : సీసపద్యం

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :—

చమత్కారం అనే ఉత్ప్రేరకం (catalyst) ద్వారా వినోదాన్ని, విజ్ఞానదాయకమైన విద్యని మన పెద్దలు ఎంతౘక్కగా మేళవించి మనకి అందించేరో మనం గ్రహిద్దాం. సీసపద్యం పేరు పరిచితమైనదే! ఈ పద్యాలు సంగీతంలో వరసకట్టి పాడుకోవడానికి ౘక్కగా ఉంటాయని మన పౌరాణిక నాటక-చలనచిత్రాలని చూచేవారికి తెలుస్తుంది. ఇక్కడినుంచి కొన్ని సంచికలలో ఈ సీసపద్యాలద్వారా కొన్ని క్రొత్త విషయాల అందౘందాలు గ్రహించే ప్రయత్నం చేద్దాం!

మనుజునిఆకారమహిమకుమొదలెద్ది,
నగవైరి వైరిదౌ నగరమెద్ది?
రఘుపతికాచిన రాక్షసాండజమెద్ది?
శిబికర్ణులార్జించు చెలువమెద్ది?
పంచబాణునివింట పరగెడురుచియెద్ది,
గిరిపతి భుజియించు గిన్నె యెద్ది?
నయనాంగరక్షకు ననువైన బలమెద్ది?
చెలగి మానముకాచు చెట్టదెద్ది?

అన్నిటికి చూడ రెండేసి అక్షరములు
ఆదు లుడుపంగ తుదలెల్ల ఆదులగును
చెప్పగలవాడు తెలివిలో గొప్పవాడు
చెప్పలేనివాడిల కాడు చిన్నవాడు!

ఇది చాలా చమత్కారభరితమైన పద్యం. ముందు దీనిలోని విశేషాంశాలు చూద్దాం!

సీసపద్యంలో నాలుగు పెద్దపాదాలు, వాటిని అనుసరించి ఒక తేటగీతిపద్యం కాని, లేక ఒక ఆటవెలది పద్యం కాని సీసపద్యానికి ముగింపుగా ఉంటుంది. ఇక్కడ మొదటి నాల్గు పాదాలలో 4×2=8 ప్రశ్నలున్నాయి. తేటగీతిలో ఈ సాహిత్య క్రీడని యెలా ఆడాలో ఆ వివరాలున్నాయి. దీనిలో ఉన్నది మనకి ఈ కాలంలో అందరికీ సుపరిచితమైన అంత్యాక్షరి ఆటే!

ఐతే పాటల అంత్యాక్షరి మనకి తెలుసు. ఇక్కడ ఉన్నది మాటల అంత్యాక్షరి అన్నమాట! అంటే మన పెద్దలు సాహిత్య అంత్యాక్షరి ఆడుకొనేవారని మనం గ్రహించాలి. ఇప్పుడు అసలు విషయం చూద్దాం!

సీసపద్యంలోని మొదటి నాల్గు పాదాలలో ఎనిమిది ప్రశ్నలున్నాయి కదా! ఆ ప్రశ్నలన్నింటికీ రెండేసి అక్షరాల ఎనిమిది జవాబులున్నాయట! జవాబుగాఉన్న ప్రతిపదంలోను మొదటి అక్షరాన్ని వదిలేసి, రెండవ అక్షరంతో తరువాతి జవాబు ప్రారంభం ఔతుందట! ఇప్పుడు ఆట ఆరంభిద్దాం!

మొదటి ప్రశ్న: మనిషి ఆకారానికి గొప్పతనాన్ని కలిగించే మొదటి అవయవం ఏది? సమాధానం: “తల”
ఇప్పుడు రెండవ ప్రశ్నకి “తల” అన్న మొదటి జవాబులోని “త”ని విడిచిపెట్టి “ల”తో ప్రారంభమయ్యే రెండక్షరాల మాటతో రెండవ ప్రశ్నకి జవాబు చెప్పాలి.

2. “నగవైరి” = నగ అంటే పర్వతం. వైరి అంటే శత్రువు= పర్వతాలకి శత్రువు దేవేంద్రుడు. ఆయన వైరి(శత్రువు) రావణుడు. ఆయన నగరం “లంక”.
3. రాముడి శరణాగతి ద్వారారక్షించబడిన రాక్షసాంశగల పక్షి ఏది= “కాకి”.
4. శిబిచక్రవర్తి, కర్ణుడు దానం ద్వారా ఆర్జించిన ఘనత ఏది?= “కీర్తి”.
5. మన్మథుడి బాణాలలోని రుచి ఏది?= “తీపు”
6. స్మశానవాసి ఐన రుద్రుడు ఏ గిన్నెలో భోజనంచేస్తాడు?= “పుర్రె”
7. కంటిని రక్షించేది ఏది?= “రెప్ప”
8. మనిషి తన దేహగౌరవాన్నిరక్షించుకోవడానికి సహాయంచేసే చెట్టు ఏది? “పత్తిచెట్టు”.

మొత్తానికి 8 ప్రశ్నలకి 8 జవాబులు ఇలా ఉన్నాయి:
1.తల, 2.లంక, 3.కాకి, 4.కీర్తి 5.తీపు, 6. పుర్రె, 7.రెప్ప, 8.పత్తి.

రెండవ జవాబునుండి అన్నీముందు జవాబుయొక్క చివరి అక్షరంతో ప్రారంభం కావడమనే నియతి దీనిలోని పరీక్ష. ఆ పరీక్షకి పై విధంగా ౘక్కని సమాధానం నిర్వహించబడింది.

స్వస్తి||

You may also like...

1 Response

  1. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    సీసాలు మరిగిన శ్రీనాథ కవిసార్వ
    భౌముని ఛందస్స్రవంతి ఎద్ది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *